జకీర్ నాయక్ 18 కోట్ల ఆస్తుల జప్తు

Tue,March 21, 2017 02:06 AM

వివాదాస్పద మతప్రబోధకుడు జకీర్‌నాయక్‌కు చెందిన రూ.18 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మరోవైపు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఐఏ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. జకీర్‌నాయక్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నట్టు సమాచారం.
zakir-naik న్య్యూఢిల్లీ, మార్చి 20: వివాదాస్పద మతప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝలక్ ఇచ్చింది. దక్షిణ ముంబైలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)కు చెందిన రూ.18.37 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జకీర్ నాయక్‌కు రెండోసారి నోటీసులను జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద నమోదైన కేసులకు సంబంధించి ఈనెల 30న ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులను ముంబైలోని ఆయన నివాసానికి పంపింది. ఈ కేసుపై ఈ నెల ప్రారంభంలో విచారణ జరిపిన ఎన్‌ఐఏ ఈనెల 14న హాజరు కావాలంటూ మొదటిసారి నోటీసులు జారీ చేసినా జకీర్ హాజరు కాలేదు.

అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రస్తుతం సౌదీ అరేబియాలో తలదాచుకొంటున్నట్టు సమాచారం. గత ఏడాది బంగ్లాదేశ్‌లోని ఢాకాపై ఉగ్రదాడి సందర్భంగా పడ్డుబడ్డ ఓ ఉగ్రవాది తనను జకీర్ నాయక్ ప్రసంగాలు ప్రభావితం చేశాయని చెప్పాడు. దీనిపై దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ జకీర్‌కు చెందిన ఐఆర్‌ఎఫ్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీ హైకోర్టు సైతం ఐఆర్‌ఎఫ్‌పై నిషేధాన్ని సమర్థించింది. ఇప్పటికే జకీర్ ప్రసంగాలను యూకే, కెనడా, మలేషియాలో నిషేధించారు.

600
Tags

More News

మరిన్ని వార్తలు...