ఆర్కేనగర్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యంThu,December 7, 2017 02:27 AM

-న్యాయ పోరాటం చేస్తా: నటుడు విశాల్
-నామినేషన్ తిరస్కరణపై రాష్ట్రపతి, ప్రధానికి ట్వీట్లు
-నిబంధనలు పాటించనందు వల్లే తిరస్కృతి: రిటర్నింగ్ అధికారి

vishal
చెన్నై, డిసెంబర్6: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికల ప్రక్రియలో తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని సినీనటుడు విశాల్‌కృష్ణ వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు. ఈ అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్లు చేశారు. నేను విశాల్‌ను. ఆర్కే నగర్ ఎన్నికల ప్రక్రియలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుందని భావిస్తున్నా. నా నామినేషన్‌ను తొలుత ఆమోదించారు.. ఆ తర్వాత తిరస్కరించారు. ఇది పూర్తిగా అన్యాయం. న్యాయం జరుగుతుందనే ఆశతో నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను అని విశాల్ ట్వీట్ చేశారు. 5 డిసెంబర్ 2016న అమ్మ (జయలలిత) చనిపోయింది.. 5 డిసెంబర్ 2017న ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. విశాల్ నామినేషన్‌పై మంగళవారం అర్ధరాత్రి వరకు గందరగోళం కొనసాగుతూ వచ్చింది. రిటర్నింగ్ అధికారి వేలుస్వామి తొలుత నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించగానే విశాల్ ధర్నా చేశారు.

దీంతో నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ దాదాపు అర్ధరాత్రి సమయంలో అధికారికంగా విశాల్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. విశాల్ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకు లుగా 10మంది సంతకాలు చేయాల్సి ఉండగా 8మంది మాత్రమే సంతకం చేశారని, నామినేషన్ల పరిశీలన సమయంలో తమ ముందు హాజరైన సుమతి, దీపన్ ఇద్దరూ సదరు సంతకాలు తమవి కావని పేర్కొన్నారని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. అయితే అన్నాడీఎంకే ఒత్తిడికి తలొగ్గి సుమతి అనే వ్యక్తి తన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని విశాల్ ఆడియో టేప్ విడుదల చేశారు. విశాల్ నామినేషన్‌తోపాటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ పత్రాలనూ తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనని దీపా జయకుమార్ ఆరోపించారు. ఆర్కేనగర్ స్థానం నుంచి అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా ఈ మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. డీఎంకే తరఫున మరుదు గణేష్, అన్నాడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్ కూడా పోటీలో ఉన్నారు.

225

More News

VIRAL NEWS