తగ్గిన అల్లర్లు.. పెరిగిన బాధితులు!

Wed,October 23, 2019 03:26 AM

-దేశంలో 5 శాతం తగ్గిన ఘర్షణలు
-22 శాతం పెరిగిన బాధితులు
-బీహార్‌లో అత్యధిక అల్లర్లు
-మొత్తం నేరాల్లో యూపీ టాప్
-2017లో నేరాలపై ఎన్‌సీఆర్‌బీ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో అల్లర్ల సంఖ్య తగ్గినప్పటికీ, బాధితుల సంఖ్య మాత్రం 22% పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో వెల్లడైంది. 2017లో దేశంలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ దాదాపు ఏడాది ఆలస్యంగా సోమవారం నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2016తో పోలిస్తే 2017లో ఘర్షణల సంఖ్య 5% తగ్గినప్పటికీ, బాధితుల సంఖ్య మాత్రం ఏకంగా 22% పెరుగడం గమనార్హం. 2017లో దేశవ్యాప్తంగా 58,880 అల్లర్ల కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 90,394 మంది బాధితులుగా ఉన్నారు. అల్లర్లు అంటే కేవలం మత సంబంధమైనవే కాదు.. ఆస్తి తగాదాలు, కుల వివాదాలు, రాజకీయ ఘర్షణలు, విద్యార్థులు నిరసనలనూ అల్లర్లుగా పరిగణించారు.

అల్లర్ల రాజధాని.. బీహార్

11,698 కేసులతో బీహార్ దేశ అల్లర్ల రాజధానిగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (8,990), మహారాష్ట్ర (7,743) ఉన్నాయి. 2016లో కూడా బీహార్ రాష్ట్రమే తొలిస్థానంలో నిలిచింది. కేసుల సంఖ్యలో బీహార్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, బాధితుల సంఖ్యలో మాత్రం తమిళనాడు తొలిస్థానంలో ఉన్నది. 2017లో తమిళనాడులో 1,935 అల్లర్ల కేసులు నమోదవగా, బాధితులు మాత్రం 18,749 మంది ఉన్నారు. మరోవైపు, కేవలం ఒకేఒక్క కేసుతో పంజాబ్ అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా నిలిచింది. కాగా, దేశంలో కుల వివాదాలకు సంబంధించిన అల్లర్లు 2016తో పోలిస్తే 2017లో 65 శాతం తగ్గాయి. కుల ఘర్షణల్లో ఉత్తరప్రదేశ్ (346 కేసులు) మొదటిస్థానంలో నిలిచింది.

భూ/ఆస్తి తగాదాలే అత్యధికం

దేశంలో నమోదైన అల్లర్ల కేసుల్లో భూమి/ఆస్తి తగాదాలే అత్యధికమని నివేదిక వెల్లడించింది. 2017లో దేశంలో చోటుచేసుకున్న మొత్తం అల్లర్ల ఘటనల్లో వీటి వాటా 22 శాతం. బాధితుల సంఖ్యలో 35%. భూమి/ఆస్తి తగాదాల్లో బీహార్ (7,030 కేసులు) మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే బాధితుల సంఖ్యలో మాత్రం తమిళనాడు తొలి స్థానంలో ఉంది.

మత ఘర్షణలు

దేశంలో మత ఘర్షణలు 2016లో 869 చోటుచేసుకోగా, 2017లో 723 ఘటనలు సంభవించాయి. బాధితుల సంఖ్య కూడా 2016తో (1,139) పోలిస్తే 2017లో (1,092) తగ్గింది. 2017లో బీహార్‌లో అత్యధికంగా 163 మతఘర్షణలు జరుగగా, కర్ణాటక(92), ఒడిశా(91) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2016లో హర్యానాలో 250 కేసులు నమోదుకాగా, 2017లో 25 మాత్రమే నమోదయ్యాయి.

10 శాతం నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే..

అల్లర్లు మాత్రమేగాక దొంగతనాలు, హత్యలు, లైంగికదాడులు, అవినీతి తదితర అన్నిరకాల నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ దేశంలోనే తొలిస్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఢిల్లీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2017లో దేశవ్యాప్తంగా మొత్తం 30,62,579 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా యూపీలో 3,10,084 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మొత్తం కేసుల్లో ఇది 10.1%. ఆ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది కూడా కేసుల సంఖ్య పెరుగడం గమనార్హం. ఢిల్లీ, యూపీ వంటి రాష్ర్టాలు వాహన దొంగతనాలు, ఇతర ఘటనలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కల్పించాయని, ఈ కారణంగా ఇక్కడ కేసు నమోదు శాతం పెరిగి ఉండొచ్చని ఎన్‌సీఆర్‌బీ అభిప్రాయపడింది.

899
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles