‘ఈబీసీ’ వ్యూహం ఫలించేనా?


Thu,January 10, 2019 02:58 AM

Reservation for economically weaker cant stand up in court

-ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ బిల్లు బీజేపీకి లాభమా? నష్టమా?
-గతంలో బెడిసికొట్టిన ఈ తరహా ప్రయత్నాలు

న్యూఢిల్లీ, జనవరి 9: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తురుపుముక్కగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు భావిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్ బిల్లు కమలం పార్టీని విజేతగా నిలుపుతుందా? లేదంటే పరాజితగా మారుస్తుందా?.. చివరి క్షణంలో ఆదరబాదరాగా తీసుకువచ్చిన ఈబీసీ బిల్లు అగ్ర కులాల మనస్సును గెలుచుకుంటుందా? లేదంటే వారి తిరస్కారానికి గురవుతుందా? అనే ప్రశ్నలకు మరి కొద్ది నెలల్లో సమాధానం లభించనున్నది. గతంలోనూ వివిధ సందర్భాల్లో ఆఖరి క్షణాల్లో బిల్లులను తీసుకువచ్చిన ఉదంతాలున్నాయి. కానీ, అవేమీ నాడు ఆయా పార్టీలకు ఓట్లు రాల్చలేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేసిన జాట్ల విన్నపాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం మన్నించింది. అలాగే మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆ సామాజిక వర్గం చేసిన డిమాండ్‌కు అప్పటి మహారాష్ట్రలో కొలువుదీరిన కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కారు ఆమోదముద్ర వేసింది.

అయితే, ఇవేవీ తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీలను గట్టెక్కించలేకపోయాయి. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. జాట్లు, మరాఠాలు బీజేపీకే ఓటు వేసినట్లు ఆయా రాష్ర్టాల్లో పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదు. మరోవైపు రైతులు, యువత ఎన్డీఏ సర్కారుపై గుర్రుగా ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం ఈ రెండు అంశాలు ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ ప్రకటించిన రైతు రుణమాఫీ ఆయా రాష్ర్టాల్లో ఆపద్భందువుగా పనిచేసింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో తాజా విజయం కాంగ్రెస్‌కు కాస్త తెరిపినిచ్చినట్లయింది. అలాగే రాఫెల్ ఒప్పందం వివాదం కూడా హస్తం పార్టీకి కలిసివచ్చింది. రాహుల్‌గాంధీ గ్రాఫ్ కాస్త పెరిగింది.

అటు అగ్రకులాలు.. ఇటు దళితులు

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని కఠిన నిబంధనలపై అగ్ర కులాలు గుర్రుగా ఉన్నాయి. ఈ చట్టంలోని మార్గదర్శకాలను సవరించేందుకు బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ చట్టాన్ని సాకుగా తీసుకుని తమపై కేసులు నమోదు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని వారు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు అట్రాసిటీ చట్టంలో జోక్యం చేసుకుని నిబంధనలు మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని, బీజేపీ హయాంలో తమపై అణిచివేత ధోరణి కొనసాగుతున్నదంటూ దళితులు కాషాయ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అటు అగ్రకులాలు, ఇటు దళితులు.. రెంటికి చెడ్డ రేవడిలా ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన కులా (ఈబీసీ)లకు రిజర్వేషన్ అనే సరికొత్త ఆయుధాన్ని మోదీ తన అమ్ముల పొదినుంచి బయటకు తీశారు. తద్వారా ఉత్తరాదిలో బలమైన వర్గాలైన జాట్లు, బనియాలు, పటేళ్లు, భూమిహార్, మరాఠా, బ్రాహ్మణ తదితర వర్గాల మనసు గెల్చుకునే దిశగా బీజేపీ పావులు కదిపింది. వీరిలో జాట్లు, పటేళ్లు, మరాఠాలు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గాలను ఓబీసీల్లో చేర్చితే .. ఇప్పటికే ఆ గ్రూపులో ఉన్న కులాలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో నొప్పించక..తానొవ్వక రీతిలో కేంద్రం జనరల్ కేటగిరీలోనే ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది.

ఓబీసీల్లోనూ పట్టుకు యత్నం

ఓబీసీలను ఆకట్టుకునే దిశగా కూడా బీజేపీ యత్నించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించడం, ఓబీసీల్లో వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కమిషన్‌ను నియమించడం ద్వారా ఆ వర్గాలకు దగ్గరైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యాదవేతర వర్గా (ఎంబీసీ)లను ఒక్కతాటిపైకి తీసుకురావడం ద్వారా అక్కడ బీజేపీ ఘనవిజయం సాధించింది. ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ప్రధాని మోదీ కూడా తాను ఓబీసీనేనని పదేపదే చెప్పడం ద్వారా ఆ వర్గాల మద్దతు కూడగట్టే యత్నం చేశారు. మరోవైపు రైతుల్ని ఆదుకునేందుకు భారీ కార్యాచరణను ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే కేంద్రం పలు పథకాల్ని ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈబీసీ బిల్లుకు వ్యతిరేకంగా దళితులు, ఓబీసీలు విపక్ష పార్టీలకు మద్దతిచ్చే అవకాశం లేకపోలేదని, ముఖ్యంగా యూపీ, బీహార్‌లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles