శరద్‌యాదవ్‌పై వేటు!Sun,August 13, 2017 01:31 AM

జేడీ(యూ) రాజ్యసభాపక్ష నేత పదవి నుంచి తొలిగించిన పార్టీ అధ్యక్షుడు నితీశ్‌కుమార్
పార్టీ ఎంపీ అలీ అన్వర్ అన్సారీపై సస్పెన్షన్
త్వరలో ఎన్డీఏలో జేడీ(యూ) చేరిక.. నితీశ్‌కు కన్వీనర్ పదవి?

Sharad
న్యూఢిల్లీ/ పాట్నా, ఆగస్టు 12: బీహార్‌లో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకుడు శరద్‌యాదవ్‌ను రాజ్యసభాపక్ష నేత పదవి నుంచి జేడీ(యూ) పార్టీ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తొలిగించారు. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరో సీనియర్ నేత ఆర్సీపీ సింగ్‌ను నియమించారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అలీ అన్వర్ అన్సారీపై కూడా వేటు వేశారు. ఆయనను పార్లమెంటరీ పార్టీ నుంచి శుక్రవారం రాత్రి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరైనందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. జేడీ(యూ) ఎంపీల ప్రతినిధి బృందం శనివారం రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి తమ పార్టీ రాజ్యసభాపక్ష నేతను మార్చుకున్న విషయం తెలియజేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన లేఖను ఆయనకు అందజేసింది.

అసలైన జేడీ(యూ) నాదే: శరద్‌యాదవ్

అసలైన జేడీ(యూ) పార్టీ తన వెంటే ఉన్నదని, జేడీ(యూ) ప్రభుత్వం మాత్రమే నితీశ్‌కుమార్ వెంట ఉన్నదని శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. జేడీ(యూ) కేవలం నితీశ్‌కుమార్ పార్టీ మాత్రమే కాదు, నా పార్టీ కూడా అని అన్నారు. బీహార్‌లో రెండు జేడీ(యూ)లున్నాయి. వాటిలో ఒకటి సర్కారీ జేడీ(యూ) అయితే మరొకటి ప్రజల జేడీ(యూ). పార్టీకి చెందిన ఎమ్యెల్యేలు, నాయకుల్లో నితీశ్‌కుమార్‌కు సన్నిహితంగా ఉంటూ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే వారు ప్రభుత్వం వెంట ఉన్నారు. ప్రజలకు సన్నిహితంగా ఉండే పార్టీ నాయకులు, కార్యకర్తలు నావెంట ఉన్నారు అని శరద్‌యాదవ్ చెప్పారు. రాజ్యసభాపక్ష నేత పదవి నుంచి తనను తొలిగించడంపై ఆయన నేరుగా స్పందించలేదు. కానీ నేను ఇందిరాగాంధీకే భయపడలేదు. ఇతరుల సంగతి లెక్కేమిటి? అన్నారు. తాను సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, సత్యం మాట్లాడుతానని చెప్పారు. బీహార్‌లోని 11కోట్ల మంది ప్రజల తీర్పు మేరకు తాను ఇంకా కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమిలోనే ఉన్నానని తెలిపారు.

కేంద్రంలో చేరనున్న జేడీ(యూ) ..

ఎన్డీఏలో చేరాలని నితీశ్‌కుమార్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోరారు. శుక్రవారం ఢిల్లీలో నితీశ్‌కుమార్ తనను కలుసుకున్నపుడు ఈ మేరకు ఆహ్వానం పలికారు. అందుకు నమ్మతించిన నితీశ్‌కుమార్ ఈ నెల 19న జరిగే జేడీ(యూ) జాతీయకార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏలో చేరితే జేడీ(యూ)కు కేంద్రమంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని, నితీశ్‌కుమార్‌కు ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇస్తారని అంటున్నారు.

219

More News

VIRAL NEWS