రద్దు నిర్ణయం కేంద్రానిదేWed,January 11, 2017 03:25 AM

పార్లమెంటు కమిటీ ముందు ఆర్బీఐ ఒప్పుకోలు నోట్లరద్దు నిర్ణయం ఎవరిది? రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయమా? సర్కారు నిర్ణయమా? అనే వాదోపవాదాలకు తెరపడింది.
ప్రభుత్వ సూచన మేరకే పెద్ద నోట్ల రద్దుకు సిఫారసు చేశామని ఆర్బీఐ వెల్లడించింది. నకిలీ కరెన్సీ, ఉగ్రనిధులు, నల్లధనంపై ఆ చర్యను ప్రభుత్వం ఎక్కుపెట్టినట్టు పార్లమెంటు ఫైనాన్స్ కమిటీకి సమర్పించిన నోట్‌లో స్పష్టం చేసింది.


న్యూఢిల్లీ, జనవరి 10:పెద్దనోట్లను రద్దు చేయాలని సర్కారు ప్రతిపాదించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పార్లమెంటు ఫైనాన్స్ కమిటీకి సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపింది. కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఫైనాన్స్ కమిటీకి ఆర్బీఐ 7 పేజీల నోట్ సమర్పించింది. 500, 1000 నోట్లను ఉపసంహరించాలని 2016 నవంబర్ 7న సర్కారు ఆర్బీఐకి ప్రతిపాదించింది. నకిలీనోట్లు, ఉగ్రవాద నిధులు, నల్లధనం అనే ముప్పే ట సమస్యల నిరోధానికి పెద్దనోట్ల ఉపసంహరణను పరిశీలించాలని ప్రభుత్వం ఆర్బీఐకి సూచించింది అని ఆర్బీఐ తన నోట్‌లో తెలిపింది. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 8న ఆర్బీఐ కేంద్రబోర్డు ఆ ప్రతిపాదనను చర్చించేందుకు సమావేశమైంది. సమాలోచనల అనంతరం 500, 1000 నోట్ల ఉపసంహరణను సిఫారసు చేసింది.
PMmodi
అదేరోజు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ పాత 500, 1000 నోట్ల చలామణిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. పాతనోట్లను రద్దు చేసి కొత్త సిరీస్‌తో నోట్లు ప్రవేశపెట్టడం వల్ల నకిలీనోట్లు, ఉగ్రవాద నిధులు, నల్లధనం అనే మూడు సమస్యలకు ముకుతాడు వేసే అరుదైన అవకాశం లభిస్తుందని అటు భారత ప్రభుత్వం, ఇటు రిజర్వ్‌బ్యాంక్ భావించాయి. పెద్ద నోట్లు రద్దు చేయాలా వద్దా అనే విషయమై ఒక గట్టి నిర్ణయం అంటూ తీసుకోకపోయినా కొత్త సిరీస్ నోట్లను ప్రవేశపెట్టేందుకు మాత్రం కొన్నాళ్లుగా ఏర్పాట్లు కొనసాగాయి అని నోట్‌లో తెలిపింది. ద్రవ్యోల్బణం, చెల్లింపుల జరుగుబాటు, కరెన్సీ నిర్వహణను దృష్టిలో ఉంచుకుని 5,000, 10,000 నోట్లను ప్రవేశపెట్టాలని 2014 అక్టోబర్ 7న రిజర్వ్‌బ్యాంకు ప్రతిపాదించింది. ప్రభుత్వం 2016 మే 18న 2000 నోట్లను ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపిందని నోట్‌లో ఆర్బీఐ వివరించింది.

అయితే రూ. 2000 నోటును ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వమే తీసుకువచ్చిందని పేర్కొంది. 2016 మే 27న 2000తో సహా అన్ని కొత్తనోట్ల డిజైన్లను, సైజులను, రంగులను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిపింది. 2016 జూన్ 7న కేంద్రం వాటికి ఆమోదం తెలుపడంతో అదేనెల కొత్త సిరీస్ నోట్ల ప్రింటింగ్‌కు ముద్రణాలయాలకు ఆదేశాలు జారీ చేశామని ఆర్బీఐ పార్లమెంటరీ కమిటీకి సమర్పించిన నోట్‌లో వెల్లడించింది.

కొత్తనోట్లపై ప్రజల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కనుక అవసరమైన మేర భారీమొత్తాల్లో 2000 నోట్లను అచ్చువేయాలని నిర్ణయించాం. కనీస స్థాయికి నిల్వలు చేరుకున్న తర్వాత ఉపసంహరణ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తుండగా సర్కారు నవంబర్ 7న నోట్లరద్దుపై సూచన చేసింది. ఆ సూచనలో నగదు అనేది నల్లధనానికి దోహదకారిగా పనిచేస్తున్నదని, నగదు లావాదేవీలు ఎలాంటి జాడలను వదలవని పేర్కొన్నది. నల్లధనాన్ని నిర్మూలిస్తే సుదీర్ఘమైన సమాంతర ఆర్థిక వ్యవస్థ నీడను పటాపంటలు చేయవచ్చు. భారత్ ఆర్థిక వృద్ధికి కూడా అది సకారాత్మకంగా దోహదం చేస్తుంది. గత ఐదేండ్లలో 500, 1000 నోట్ల వినియోగం బాగా పెరిగింది. నకిలీల బెడదకూడా దాంతోపాటే విస్తరించింది అని ఆర్బీఐ తెలిపింది. ఉగ్రవాదానికి, మాదకద్రవ్యాల వ్యాపారానికి నిధులు సమకూర్చేందుకు నకిలీ నోట్లను ఉపయోగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పొరుగుదేశం నుంచి వస్తున్న నకిలీ నోట్లు దేశ భద్రతకు, సమగ్రతకు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. అందుకే ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేయాలని సూచించింది అని నివేదించింది. ఇలాంటి ప్రతిపాదన రావడానికి ఇంతకన్నా మంచి తరుణం మరొకటి ఉండదని బోర్డు భావించింది. కొత్తనోట్లు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన సమయంలో కేంద్రం ప్రతిపాదన వచ్చింది. పాత నోట్లను ఉపసంహరించి నకిలీలు సృష్టించేందుకు సులభంగా లొంగని కొత్తనోట్లను ప్రవేశపెట్టడం జరిగింది అని వెల్లడించింది. అయితే విలువ, పరిమాణం రీత్యా నిర్ణీత కాలంలో మొత్తంగా నోట్లను మార్చేయడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ అంగీకరించింది.

ఆర్బీఐ స్వయంప్రతిపత్తి గాలికి?


నవంబర్ 7న సర్కారు ప్రతిపాదన పంపింది. మరుసటి రోజు రిజర్వ్‌బ్యాంకు సిఫారసు పంపింది. అదేరోజు ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నోట్లరద్దుపై దిగ్భ్రాంతికర ప్రకటన చేశారు. నోట్లరద్దు విషయంలో అన్ని నియమాలు, మర్యాదలు పాటించినట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటుకు తెలిపారు. అయితే ఆర్బీఐకి సర్కారే స్వయంగా నోట్లరద్దు ప్రతిపాదన పంపినట్టు ఆయన చెప్పలేదు. కరెన్సీకి సంబంధించిన అతిపెద్ద నిర్ణయం విషయంలో కేంద్రబ్యాంకు సర్కారు నిర్ణయాలకు తలొగ్గి తన స్వయంప్రతిపత్తిని తాకట్టు పెట్టిందన్న విమర్శలు వస్తున్నాయి. కొత్తనోట్లను ప్రవేశపెడితే నల్లధనం అరికట్టవచ్చని, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం కొన్నినెలలుగా అంటూవచ్చిందని, ఇది ఆమోదయోగ్యంగానే కనిపించిందని ఆర్బీఐ పార్లమెంటు కమిటీకి తెలిపింది. చలామణీలో ఉన్న 86 శాతం నగదును హఠాత్తుగా రద్దు చేయడంతో దేశంలో తీవ్రమైన కరెన్సీ కొరత ఏర్పడింది. నోట్లరద్దు నిర్ణయం, దాని పర్యవసానాలపై మరో పార్లమెంటరీ కమిటీ ఈ నెల 20న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించబోతున్నది.

1665
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS