ఉన్నావ్, కతువా లైంగిక దాడుల బాధితులకు బాసట


Mon,April 16, 2018 03:35 AM

Rape horrors Gujarat rallies for justice

దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
-ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో రెండు వేల మందితో ఆందోళన
-ముంబైలో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖులు
-కేసు విచారణ జమ్ము బయట జరుగాలన్న బాధితురాలి కుటుంబం
-నేడు కతువా కోర్టులో విచారణ ప్రారంభం

KathuaAhmed
జమ్ము/ న్యూఢిల్లీ/ కోజికోడ్, ఏప్రిల్ 15: కతువా, ఉన్నావ్ లైంగిక దాడి బాధితులకు న్యాయం జరుగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవాతోపాటు కేరళ రాష్ట్రమంతటా ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో వేల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్, పంజాబ్ రాజధాని చండీగఢ్, భోపాల్‌లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల నిరసన కారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మానవ హారం నిర్మించారు. ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షా శిబిరం సమీపాన సుమారు రెండు వేల మంది నిరసన ప్రదర్శన జరిపారు. మరోవైపు ముంబైలో బాలీవుడ్ సినీ నటి ప్రియాంక చోప్రా, నిర్మాత ఏక్తా కపూర్‌తోపాటు పలువురు సినీ నటులు.. బాంద్రా ప్రాంతంలోని కార్టర్ రోడ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.

బెంగళూరు ఫ్రీడం పార్క్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి ప్రధాని మోదీ క్షమాపణ కోరాలని సూచిస్తూ 49 మంది మాజీ ఐఏఎస్ అధికారుల బృందం బహిరంగ లేఖ రాశారు. మరోవైపు కతువా లైంగికదాడి కేసు విచారణను రాష్ట్రం బయట చేపట్టేందుకు ఆదేశించాలని బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నది. చార్జిషీట్ దాఖలు చేయకుండా న్యాయవాదులు అడ్డుకున్న నేపథ్యంలో జమ్ములో విచారణ సజావుగా సాగదని బాధిత కుటుంబం భావిస్తున్నదని వారి తరఫు న్యాయవాది చెప్పారు. మరోవైపు ఈ కేసుపై కతువా కోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నది. కాగా, నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులు లాల్ సింగ్, చందర్ ప్రకాశ్ గంగాల రాజీనామాలను ఆమోదించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాలకు సీఎం మెహబూబా ముఫ్తీ సిఫారసు చేశారు. బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించేలా ఒక బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

అతడ్ని నిలదీస్తానన్న నిందితుడి కాబోయే భార్య

కతువా ఘటనలో నిందితుడిగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ దీపక్ ఖజూరియా నిజంగానే తప్పు చేశాడా? లేదా? అనే విషయం తానే తేల్చుకుంటానని అతడితో నిశ్చితార్థం జరిగన రేణుశర్మ అనే యువతి తెలిపింది. ఈనెల 28న వీరి పెండ్లి జరుగాల్సి ఉన్నది. దీపక్ కండ్లలోకి చూసి నిజంగానే ఈ తప్పు చేశావా? అని అడుగుతాను. తప్పు లేదని తెలిస్తే జీవితాంతం ఎదురు చూస్తా. తప్పు చేసినట్లు తేలితే మరో వ్యక్తిని పెండ్లాడుతా అని ఆమె చెప్పారు. మరోవైపు కతువా ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు జోక్యాన్ని జమ్ము హైకోర్టు బార్ అసోసియేషన్ స్వాగతించింది. కాగా, చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా న్యాయవాదులు అడ్డుకోవడం నిజమేనని తేలితే, లైసెన్సులు రద్దు చేస్తామని బీసీఐ తెలిపింది.

నేనే కాదు.. ఈ దేశమూ ఓ బిడ్డను కోల్పోయింది..

KathuaAhmed2
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: తానే కాదు, ఈ దేశం కూడా ఓ బిడ్డను కోల్పోయిందని కతువాలో లైంగికదాడి, హత్యకు గురైన ఎనిమిదేండ్ల చిన్నారి తండ్రి అంజాద్ అలీ చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కతువా దారుణకాండ తర్వాత తమ తెగకు చెందిన మరో 17 కుటుంబాలతో కలిసి అంజాద్‌అలీ కుటుంబం కూడా గ్రామాన్ని విడిచిపెట్టింది. ఒకే వారంలో ఉన్నావ్, కతువా రెండు ఘటనలతో దేశం విస్తుపోయిన వేళ.. గత గురువారం అంజాద్‌అలీ కుటుంబం మౌనంగా రసానా గ్రామాన్ని వీడింది. ఉధంపూర్‌కు కొద్దిదూరంలో ఉన్న రౌందోమెయిల్ ప్రాంతంలో ప్రస్తుతం తన 50 గొర్రెలు, మరో 50వరకు మేకలు, 15 గుర్రాలతో ఆ కుటుంబం రోడ్డువెంట రెండు డేరాలు వేసుకుని తాత్కాలికంగా తలదాచుకున్నది. తొమ్మిది రోజుల్లో 110కిలోమీటర్లు నడచుకుంటూ వచ్చామని అంజాద్ తెలిపారు. మరో నెల నెలన్నర రోజుల్లో కాలినడకన కిష్టార్‌కు చేరుకోవాలని ఆయన భావిస్తున్నారు. తామిక ఎంతమాత్రం కతువాకు గానీ, రసానాకు గానీ వెళ్లబోమని ఆయన అంటున్నారు. మా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. మా పశువులను, ఇండ్లను తగులబెడుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. మేం ఎవరితో పోరాడగలం? ఎంతవరకు పోరాడగలం? బకర్‌వాల్ తెగకు మేకలు, గొర్రెలే కదా జీవనాధారం. వాటినే చంపేస్తే ఇక మాకు దిక్కేంటి? ఇప్పటికే బిడ్డను కోల్పోయాం.. అని అంజాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పుడు స్వగ్రామానికి తిరిగి వెళ్తారన్న ప్రశ్నకు.. మాకు అక్కడ ఏం ఉంది? కానీ నాకు ఒకే ఒక్క ఆశ మిగిలింది. ఈ దేశంలో మానవత్వం అనేది ఇంకా ఉంటే, ఈ దారుణాన్ని ఆ మానవీయత నిండిన కండ్లతోనే చూడాలి. ఎందుకంటే, నేనొక్కడినే బిడ్డను కోల్పోలేదు.. ఆమె ఈ దేశపు బిడ్డ కూడా కదా అని చెప్పిన ఆయన... రాజకీయనాయకులు ఈ ఘటనను వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

మృతదేహాన్ని పూడ్చేందుకు స్థలమివ్వలేదు

KathuaAhmed4
లైంగిక దాడి తర్వాత హత్యకు గురైన కతువా బాధితురాలి మృతదేహాన్ని ఖననం చేసేందుకు అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు రసానా గ్రామస్తులు నిరాకరించారు. ఎనిమిదేండ్ల బాలిక మృతదేహం ఖననానికి కేవలం ఐదు అడుగుల స్థలం అవసరం. మృతదేహం ఖననం చేయడానికి గోయి తవ్వుతున్న సంగతి తెలుసుకున్న గ్రామస్థులు సాయంత్రం ఆరు గంటల సమయంలో అక్కడికి చేరుకుని సదరు స్థలం ముస్లిం బకర్వాలాలది కాదని, అక్కడ ఖననం చేయడం చట్ట విరుద్ధమని అడ్డుకున్నారు. బాధితుల బంధువు ఒకరు పదేండ్ల క్రితం హిందువుల నుంచి కొనుగోలు చేసిన తన భూమిలో బాలిక మృతదేహం ఖననం చేసుకునేందుకు అవకాశం కల్పించాడు. దీంతో వారు గజగజ వణికే చలిలో ఎనిమిది కి.మీ. దూరంలోని కనాహ్ గ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లి చీకటి పడక ముందే ఖననం చేశారు.

బాధితులకు కేరళలో ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షకుల సంఘీభావం

KathuaAhmed3
కతువా బాధిత కుటుంబానికి సంఘీభావంగా కేరళలోఓ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు మౌనం పాటించారు. కోజికోడ్ జిల్లా కొడువల్లీలో సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతున్నది. మ్యాచ్ ప్రారంభానికి ముందు లేచినిలబడిన ప్రేక్షకులు నిమిషం పాటు తమ సెల్‌ఫోన్ల ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇది వీక్షకుల నుంచి యాదృచ్ఛికంగా వచ్చిన ప్రతిస్పందన అని నిర్వాహకులు తెలిపారు. పండిక్కడ్, మల్లపురం జిల్లాల్లోనూ నిరసన ప్రదర్శనలు సాగాయి.

1235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles