ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


Sun,January 13, 2019 02:13 AM

Ramnath Kovind Approved EBC Reservation Bill

-నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
-చట్టం అమలు తేదీని తర్వాత ప్రకటిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 12: జనరల్ క్యాటగిరీకి చెందిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు- 2019కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందనేది కేంద్రం తరువాత ప్రకటించనుంది. ఈ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 15, 16 అధికరణలను సవరించారు. ఇందులో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిస్తూ ప్రత్యేక క్లాజ్‌ను చేర్చారు. దీని ప్రకారం మైనారిటీ విద్యా సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి క్యాటగిరీలో గరిష్ఠంగా 10 శాతం సీట్లు కేటాయించవచ్చు.

అలాగే ఉద్యోగ నియామకాల్లోనూ ఈబీసీ వర్గాలకు గరిష్ఠంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఇప్పటివరకు అమలులో ఉన్న రిజర్వేషన్లకు ఈ పది శాతం అదనమని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కుటుంబ ఆదాయం, ఇతర ఆర్థిక వెనుకబాటు సూచీల ఆధారంగా ఈబీసీ వర్గాలు ఎవరనేది ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుందని పేర్కొన్నారు. ఈబీసీ బిల్లుకు ఈ నెల 8న లోక్‌సభ ఆమోదం తెలుపగా, ఆ మరుసటి రోజు రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, క్షత్రియ తదితర వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది.

433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles