ఆస్తానాకు చుక్కెదురు


Sat,January 12, 2019 02:06 AM

Rakesh Asthana Faces Arrest To Be Probed For Bribe Says Court

-లంచాల కేసు కొట్టివేతకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
-క్రిమినల్ విచారణ నుంచి రక్షణ కల్పించే ఉత్తర్వు రద్దు
-10 వారాల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐకి ఆదేశం

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాకు శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. లంచాలు స్వీకరించారన్న ఆరోపణలతో ఆస్తానాపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించడంతోపాటు క్రిమినల్ విచారణల నుంచి ఆయనకు రక్షణ కల్పిస్తూ గతంలో జారీచేసిన తాత్కాలిక ఉత్తర్వును రద్దుచేసింది. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్‌తోపాటు మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజ్ ప్రసాద్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసేందుకు కూడా జస్టిస్ నజ్మీ వజీరీ నిరాకరించారు. ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తే.. రాకేశ్ ఆస్తానా, దేవేందర్ కుమార్‌లను ప్రాసిక్యూట్ చేసేందుకు ముందస్తు అనుమతి అవసరంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో ఆస్తానా, ఇతరులపై 10 వారాల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలంటూ సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అప్పటి సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దురుద్దేశంతో వ్యవహరించినట్టు చేసిన ఆరోపణను నిరూపించలేకపోయారని న్యాయస్థానం పేర్కొన్నది.

తమపై దాఖలైన కేసును సవాలుచేస్తూ ఆస్తానా, దేవేందర్ కుమార్, మనోజ్ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. నేరపూరిత కుట్రకు, అవినీతికి, నేరపూరిత ప్రవర్తనకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఆస్తానాపై ఈ కేసు దాఖలయింది. ఓ కేసులో ఉపశమనాన్ని పొందేందుకు లంచం ఇచ్చానంటూ హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సానా సతీశ్‌బాబు చేసిన ఫిర్యాదు మేరకు ఆస్తానాపై ఈ కేసు నమోదు చేశారు. ఆస్తానా తీవ్రమైన అక్రమాలకు, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, తలబిరుసుతో వ్యవహరించారని కూడా సానా సతీశ్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles