ఎస్సీ, ఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం


Fri,August 10, 2018 02:35 AM

Rajya Sabha Approval for SC ST bill

-విపక్షాల ఒత్తిడితోనే బిల్లు : కాంగ్రెస్
-ప్రధాని అంకితభావం వల్లే తెచ్చాం: బీజేపీ
-కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్, ఖర్గేల మధ్య మాటలయుద్ధం

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఎస్సీ, ఎస్టీ చట్టంలోని అరెస్టు నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసే బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు ముందస్తు బెయిల్ లభించదు. అలాగే నిందితునిపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు అవసరం ఉండదు. రాజ్యసభలో గురువారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, రక్షణకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుడు అబిర్ రంజన్ బిశ్వాస్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీల ఒత్తిడితోనే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందని విమర్శించారు. వివాదాస్పద రాఫెల్ విమానాల ఒప్పందం లోక్ సభను కుదిపేసింది. ఈ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ లోక్‌సభలో కాంగ్రెస్ ఆందోళనకు దిగి సభా కార్యకలాపాల్ని పూర్తిగా స్తంభింపచేసింది.

ఖర్గే దమ్ముంటే ముంబైలో పోటీచేయ్: పీయూష్‌గోయల్

జీఎస్టీపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మధ్య మాటలయుద్ధం జరిగింది. సభకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడంతో విసిగిపోయిన గోయల్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3-4 స్థానాలకే పరిమితమవుతుందంటూ చురకలంటించారు. దీనిపై ఖర్గే ప్రతిస్పందిస్తూ.. గోయల్ కనీసం స్థానిక ఎన్నికల్లో కూడా గెలువలేదని ఎద్దేవాచేశారు. దీంతో గోయల్ తనపై ముంబైలో పోటీచేసి గెలవాలని ఖర్గేకు సవాల్ విసిరారు.

142

More News

VIRAL NEWS