సమయం వస్తే యుద్ధం చేద్దాం!Sat,May 20, 2017 02:34 AM

అభిమానులతో ఐదోరోజు సమావేశంలో రజనీకాంత్
రాజకీయ ప్రవేశంపై ఇంకా సందిగ్ధత

చెన్నై, మే 19:తమిళనాడులో మంచి నాయకులున్నారు, కానీ, వ్యవస్థే బాగాలేదు రాజకీయాలపై సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా వ్యక్తం చేసిన అసంతృప్తి ఇది. ఈ వ్యవస్థ కుళ్లిపోయింది.. అవసరమైనపుడు యుద్ధం చేద్దాం. అలాంటి పరిస్థితి వస్తే పిలుస్తా. పూర్వకాలంలో యుద్ధం వచ్చినప్పుడు అందరూ పాల్గొనేవారు. అని అభిమానులతో చెప్పారు. రాజకీయ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత వ్యవస్థ ప్రజల గురించి ఆలోచించడం లేదు. వారికేం చేయడం లేదు. పరిస్థితి మారాలి అన్నారు. ఐదురోజులుగా తన అభిమానులతో సమావేశమవుతున్న ఆయన శుక్రవారం కోడంబాకమ్ ప్రాంతానికి చెందిన అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పైవిధంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తను అన్న మాటలపై సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యానాలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని అభిమానులను కోరారు. మీలాగా నాకూ పనులూ, బాధ్యతలున్నాయి. మీరు మీమీ ఇండ్లకు వెళ్లి మీ పనులు చేసుకోండి..
rajnikanth
మనం యుద్ధం చేయాల్సివచ్చినపుడు చేద్దాం అని అన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం అన్న మాట విశేషంగా మారింది. యుద్ధం అంటే రాజకీయవ్యవస్థ మీదేనా? దానిని మార్చడానికా? అందుకోసం ఆయన రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తమిళనాడులో మంచి నాయకులున్నారంటూ ఆయన డీఎంకే నేత ఎంకే స్టాలిన్, పీఎంకే యువనేత అంబుమణి రాందాస్, వీసీకే నేత తిరుమలవన్, ఎన్టీకే నేత సీమన్ పేర్లు చెప్పారు. వారు వ్యవస్థ సంగతి చూసుకుంటారన్నారు. స్టాలిన్‌కు స్వేచ్ఛ ఇస్తే అద్భుతాలు చేస్తాడని, చో రామస్వామి అన్న మాటలను రజనీ ఉదహరించి ఒక విధంగా స్టాలిన్‌ను మెచ్చుకున్నారు. అటువంటి వారుండగా తను రాజకీయాల్లోకి రావలసిన అవసరం లేదంటూనే మరి అవసరమైతేనే చూద్దాం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నేను తమిళుడినే..


తాను తమిళవ్యక్తి కాదు అన్న విమర్శలను రజనీ తోసిపుచ్చారు. నేను కర్ణాటకలో 23 ఏండ్లుంటే ఆ తరువాత 44 ఏండ్ల నుంచి తమిళనాడులోనే ఉంటున్నా.. కర్ణాటకకు చెందిన మరాఠీనైనా నన్ను తమిళనాడు ప్రజలు ఆదరించి అన్నీ ఇచ్చారు. వారు నన్ను తమిళుడిని చేశారు . కాబట్టి నేను పక్కాగా తమిళుడినే. మా పూర్వీకులు కృష్ణగిరి జిల్లాకు చెందిన వారు అని వెల్లడించారు.

ఇంతకీ తలైవా రాజకీయాల్లోకి వస్తారా?


రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా..! అభిమానులతో సమావేశాల సందర్భంగా గత ఐదు రోజులుగా ఆయన చెప్తున్న మాటలు ప్రజలకు ఈ విషయంలో స్పష్టతనివ్వడం లేదు. ఎనిమిదేండ్ల తరువాత అభిమానులను నేరుగా కలుసుకుంటూ వారిలో ఒక్కొక్కరితో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతున్న తలైవా అడపాదడపా రాజకీయ ఝలక్‌లు విసురుతున్నారు తప్ప అసలు విషయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం లేదు. ఈ సూపర్‌స్టార్ ైస్టెల్‌గా చెయ్యెత్తినా, పంచ్ డైలాగ్ విసిరినా జనాన్ని విపరీతంగా ఆకట్టుకోవడం ఆయనపై సినీ అభిమానుల ఫాలోయింగ్‌కు నిదర్శనమన్న సంగతి తెలిసిందే. అభిమానులతో సమావేశాల్లో ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, రాజకీయ వ్యవస్థపై విమర్శలు కూడా అదేవిధంగా ఆసక్తికరంగా మారాయి. మూడు రోజుల క్రితం రజనీ తన భవిష్యత్తును దైవమే నిర్ణయిస్తుందన్నారు. నేనేం చేయాలనేది భగవంతుని నిర్ణయం. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి ప్రవేశిస్తా అన్నారు. అంతేతప్ప కచ్చితంగా వస్తానని చెప్పలేదు. తాజాగా మరి కాస్త బలమైన డైలాగే విసిరారు.

రాజకీయ వ్యవస్థ సరిగా లేదు. మారాల్సిన అవసరం ఉన్నది అన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ బాగాలేదని పరోక్షంగా విమర్శించిన ఆయన మరి దీనిని మార్చాలనుకుంటున్నారా? లేదా? అందుకేం చేస్తారు? అన్నవి శేష ప్రశ్నలుగానే మిగిలాయి. తమిళనాడులో రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతల్లో జయలలిత ఇటీవలే మరణించారు. మరో నేత కరుణానిధి వార్ధక్యంతో క్రియాశీలకంగా పనిచేయలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఇద్దరు నేతలతో సమానమైన లేదా వారిలా ప్రజలను ఆకట్టుకోగల నాయకులు లేరు. దక్షిణాదిలో బలపడాలనుకుంటున్న బీజేపీ రజనీపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి తమిళనాడులో ఇప్పుడు రాజకీయ శూన్యత ఆవరించుకొని ఉన్నది. ప్రజలు కూడా మరో బలమైన నేత కావాలనుకుంటున్నారు. రజనీ ఈ విషయంలో స్థిరచిత్తంతో కూడిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరో పక్క రజనీ రాజకీయ ప్రవేశంపై పలువురు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

రజనీ రాజకీయాలకు అన్‌ఫిట్..


Swamy
రజనీకాంత్ అసలు రాజకీయాలకు పనికిరారు. రజనీ గనుక రాజకీయాల్లోకి వస్తే అది పెద్ద దుర్ఘటనే అవుతుంది. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది. సీఎం కావాలన్న ఆలోచన, అందుకు తగిన అర్హత కూడా ఆయనకు లేదు. అయినా ఆయనను బీజేపీలో చేర్చుకోవాలనుకునుకుంటే ఆ సంగతి మా పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది.
-బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి

యాక్టర్ కాదు డాక్టర్ కావాలి..


anbumani-ramadoss
రజనీ నన్ను మంచివాడని కితాబు ఇచ్చారు. సంతోషం. కానీ తమిళనాడు(రాజకీయాల)కు మరో సినీ నటుని అవసరం లేదు. ఈ రాష్ట్రం ఇప్పుడు ఐసీయూలో ఉన్నది. దీనికి యాక్టర్ కాదు మంచి డాక్టర్ కావాలి.. నటులు ఈ రాష్ర్టాన్ని 50 ఏండ్లపాటు నాశనం చేశారు.
- పీఎంకే నేత అంబుమణి రాందాస్

రజనీ వస్తే స్వాగతం..


Panneerselvam
తలైవా చాలా మంచివారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే తిరుగుబాటువర్గం
- తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం

1216

More News

VIRAL NEWS