ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి


Mon,June 17, 2019 02:40 AM

Rainfall deficit hits 43pr monsoon progress likely in the next 2-3 days

-వాయు తుఫాన్ బలహీనపడడంతో
-నైరుతికి మార్గం సుగమం
-భారత వాతావరణ విభాగం వెల్లడి

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: వాయు తుఫాన్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు ఇప్పటికే తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ర్టాలకు విస్తరించాల్సి ఉన్నా, అవి ఇంకా మహారాష్ట్రకు కూడా చేరలేదు. దక్షిణ భారతంలోని మంగళూరు, మైసూర్, కడలూర్, ఈశాన్య రాష్ర్టాల్లోని పాసీఘాట్, అగర్తలలోనే ఇంకా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు ఉన్న పశ్చిమ తీరంలో వాయు తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో మాత్రమే నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు నమోదయ్యాయి. వాయు తుఫాన్ బలహీనపడి సోమవారం అర్ధరాత్రి గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం దిశగా పయనించేందుకు మార్గం సుగమమైందని తెలిపింది. సాధారణం కంటే వారం ఆలస్యంగా ఈనెల 8న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. వాయు తుఫాన్ ప్రభావం కారణంగా రుతుపవనాల్లో పురోగతి మందగించింది. తుఫాన్ తీవ్రత తగ్గడంతో రెండు మూడురోజుల్లో రుతుపవనాలు పుంజుకుంటాయని భావిస్తున్నాం అని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ దేవేంద్ర ప్రధాన్ తెలిపారు. మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వచ్చే ఒకటి రెండు రోజుల్లో ఈశాన్య భారతం, ఉత్తరబెంగాల్, సిక్కిం రాష్ర్టానికి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది.

43 శాతానికి లోటు వర్షపాతం

రుతుపవనాలు మందగించడంతో దేశంలో ఈ సీజన్‌లో వర్షపాత లోటు 43 శాతానికి చేరుకుంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవాతో కూడిన మధ్య భారతదేశంలో లోటు వర్షపాతం 59 శాతం నమోదైందని, ఈశాన్యభారతంలో 47 శాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. విదర్భలో 87 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. సెంట్రల్ వాటర్ కమిషన్ వివరాల ప్రకారం.. దక్షిణాది రాష్ర్టాలతోపాటు మహారాష్ట్రలోని రిజర్వాయర్లలో నీటి మట్టం గత పదేండ్ల సగటు కంటే తక్కువగా ఉంది. జార్ఖండ్, బీహార్, ఒడిశాలలో వడగాడ్పులు బెంబేలెత్తిస్తున్నాయి.

వాయు బలహీనం

వాయు తుఫాన్ వాయుగుండంగా బలహీనపడి సోమవారం అర్ధరాత్రి గుజరాత్ తీరాన్ని దాటే అవకాశం ఉన్నదని ఐఎండీ పేర్కొంది. ఆదివారం ఉదయానికి వాయు తుఫాన్ పోర్‌బందర్‌కు పశ్చిమ నైరుతి దిశగా 470 కి.మీ, ద్వారకకు నైరుతి దిశగా 440 కి.మీ, భుజ్‌కు నైరుతి దిశగా 545 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో విస్తరించిన తుఫాన్ పశ్చిమ దిశగా గంటకు 12 కి.మీ వేగంతో పయనిస్తున్నదని పేర్కొంది. వచ్చే ఆరు గంటలు పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. అనంతరం క్రమంగా దిశను మార్చుకుని, ఈశాన్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలహీనపడి సోమవారం అర్ధరాత్రి ఉత్తర గుజరాత్ తీరం దాటనుందని వివరించింది. ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles