రైల్వేలను బేరసారాలకు వాడుకునేవారుTue,January 10, 2017 02:09 AM

రైల్వే శాఖ అంటే మిత్రపక్షాలకు ఎరవేసే సాధనంగా ఉపయోగించుకునేవారని గత ప్రభుత్వాలపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి మీదే దృష్టి నిలిపిందని అన్నారు. వేగాన్ని పెంచి భద్రతను ఇనుమడింపజేస్తున్నామని వివరించారు.

గాంధీనగర్, జనవరి 9:రైల్వేల్లో పాతపద్ధతులకు స్వస్తి చెప్పి అభివృద్ధి మీదే సర్కారు దృష్టి కేంద్రీకరిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇదివరకటి ప్రధాన పాలకపక్షం తన మిత్ర పక్షాలకు తాయిలాలు పంచేందుకు రైల్వేలను ఒక సాధనంగా ఉపయోగించేదని ఆయన దుయ్యబట్టారు. గాంధీనగర్‌లో రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.250 కోట్లతో చేపట్టనున్న పనులకు సోమవారం ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో రైల్వే విభాగాన్ని దాని ఖర్మకు వదిలేసేవారని అన్నారు. ప్రభుత్వంలో చేరేందుకు మిత్రపక్షాలు రైల్వే శాఖను డిమాండ్ చేసేవని, ప్రధాన పక్షం కూడా బేరసారాలకు సాధనంగా వాడుకునేదని చెప్పారు. ఇదొక చేదు నిజమని ప్రధాని పేర్కొన్నారు. రైల్వేలపై ఆధిపత్యం సాధించిన రాజకీయ పక్షాలకు రైల్వేల అభివృద్ధి మీద అంతగా ఆసక్తి ఉండేది కాదని, వారికి ఆసక్తి దేనిమీద ఉండేదో తాను చెప్పాల్సిన పనిలేదని అన్నారు.
Modi
రైల్వేలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, విస్తరణ, అభివృద్ధి, ఆధునీకరణకు చర్యలు చేపడుతూ సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. రైల్వే బడ్జెట్‌ను రెట్టింపు చేశామని వివరించారు. వివిధరకాల అభివృద్ధి పనులను వివరిస్తూ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైళ్ల వేగాన్ని పెంచేందుకు, గ్లోబల్ టెక్నాలజీతో భద్రతను పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నదని ప్రధాని తెలిపారు. రైల్వేల్లో సరుకు రవాణా చౌక అని, అందుకే సరుకు రవాణా కారిడార్ల ఏర్పాటు గురించి నొక్కిచెప్తున్నామని వివరించారు. నగరాల్లోని రైల్వే స్టేషన్లపై బహుళ అంతస్థుల నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేయవచ్చని అన్నారు.

వైబ్రెంట్ గుజరాత్ షోను ప్రారంభించిన మోదీ


గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఐదురోజులపాటు నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. దేశ, విదేశాలకు చెందిన 1,500 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో పెట్టాయి. ట్రేడ్‌షోను ప్రారంభించిన అనంతరం వివిధ స్టాళ్లను ప్రధాని పరిశీలించారు. తమ ఉత్పత్తుల గురించి పలువురు వ్యాపారులు మోదీకి వివరించారు. 80కి పైగా దేశాల నుంచి వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాయి. వాణిజ్య ప్రదర్శనను 15 లక్షల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో వ్యాపార సెమినార్లు నిర్వహించనున్నారు. 12, 13 తేదీల్లో ప్రదర్శన సందర్శనకు ప్రజలను అనుమతిస్తారు.

నేడు గ్లోబల్ సమ్మిట్


గాంధీనగర్‌లో మూడురోజులపాటు జరుగనున్న ఎనిమిదో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌ను మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు బోయింగ్‌కు చెందిన బెర్ట్రాండ్ మార్క్‌అలెన్, సిస్కో చాంబర్స్‌కు చెందిన జాన్‌సహా ఫార్ట్యూన్ 500 జాబితా కంపెనీల సీఈవోలు హాజరుకానున్నారు. సదస్సులో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రికార్డుస్థాయిలో 21,190 ఎంవోయూలను గుజరాత్ ప్రభుత్వం కుదుర్చుకోనున్నది. సమ్మిట్‌కు సుమారు ఆరువేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవర్గాల మధ్య, వ్యాపారవర్గాలు ప్రభుత్వాల మధ్య వివిధ రకాల సమావేశాలు జరుగనున్నాయి. సదస్సును ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం విదేశీ ప్రతినిధులతో కలిసి ప్రధాని మోదీ విందులో పాల్గొంటారు.

351
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS