హమ్‌సఫర్ రైళ్లకు ఫ్లెక్సీ ఫేర్ స్కీమ్ రద్దు


Sat,September 14, 2019 02:34 AM

Railways removes flexi fare scheme from Humsafar trains

- స్లీపర్ క్లాస్ కోచ్‌లనూ జతచేయనున్న రైల్వే

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట కల్పించింది. హమ్‌సఫర్ ప్రీమియం రైళ్లకు ఫ్లెక్సీ ఫేర్ పథకాన్ని రద్దు చేసింది. అలాగే ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ వివరాల్ని రైల్వే శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుతం హమ్‌సఫర్ రైళ్లలో ఏసీ 3-టైర్ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఆనంద్ విహార్-అలహాబాద్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారమే నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్‌లను ప్రవేశపెట్టారు. 13,452 రైళ్లలో 141 రైళ్లలోనే ఫ్లెక్సీ ఫేర్ పథకం అమలవుతున్నది. దీని ప్రకారం.. పది శాతం బెర్త్ టికెట్లు అమ్ముడైన ప్రతిసారీ ప్రాథమిక ధరను (బేస్ చార్జీ) 10 శాతం పెంచుతున్నారు. కాగా, హమ్‌సఫర్ తత్కాల్ చార్జీలను కూడా రైల్వే శాఖ తగ్గించింది. ఇకపై తత్కాల్ చార్జీలు ప్రాథమిక ధరపై 1.5 రెట్లు కాకుండా, 1.3 రెట్లు ఉండనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.

అంటే హమ్‌సఫర్ తత్కాల్ చార్జీలు కూడా ఇతర మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల తత్కాల్ చార్జీలతో సమానంగా ఉండనున్నట్లు చెప్పారు. ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతి ఉన్న రైళ్లలో టిక్కెట్ ధరలపై 25 శాతం తగ్గించనున్నట్లు రైల్వే ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. శతాబ్ది, గతిమాన్, తేజస్, డబుల్ డెక్కర్, ఇంటర్‌సిటీ తదితర రైళ్లకు ఈ తగ్గింపు వర్తించనుంది.

136
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles