రాహుల్ కోసం మాస్టర్‌ప్లాన్!

Tue,October 8, 2019 03:59 AM

-కాంబోడియా పర్యటన అందులో భాగమే
-సీనియర్ నేతల కథ ఇక కంచికే
-సోనియా నేతృత్వంలోనే పథక రచన!

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: విపాసన నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కాంబోడియా వెళ్లారన్న వార్త ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాహుల్ సన్నిహిత నేతలు ప్రస్తుతం పార్టీలో సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడం యువనేతల్లో అయోమయానికి కారణమవుతున్నది. అశోక్ తన్వర్, సంజయ్ నిరుపమ్, ప్రద్యుత్ దెబర్‌మాన్ తిరుగుబాటు చెబుతున్నది ఒక్కటే.. పార్టీలో వృద్ధ నేతలు యువనేతలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని. మరోమాటలో చెప్పాలంటే.. సోనియా కోటరీ.. రాహుల్ సన్నిహితులను తప్పిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ ఆకస్మిక పర్యటన వారిని విస్మయపరుస్తున్నది. ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఉండడమే కాకుండా, రాహుల్ టీం.. పార్టీలో టార్గెట్ అవుతున్నది. పార్టీలో ఉన్న చాలామంది జూనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తుపై వారిలో అయోమయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఎందుకు విదేశీ పర్యటనకు వెళ్లారు? ఎందుకు ఆయన మౌనం వహిస్తున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాహుల్ త్వరలోనే తిరిగి వస్తారని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

కాకపోతే లోక్‌సభ ఎన్నికల్లోలాగా దూకుడుగా ప్రచారం చేయబోరని పేర్కొన్నాయి. యువనేతల్లో నెలకొన్న ఆందోళన ఆయనకు తెలుసునని, అయితే ఈసారి ఆయన వేచిచూసే ధోరణిలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు సీనియర్ నేతలు (ముఖ్యంగా సోనియా గాంధీ కోటరీ) అసంతృప్తికి గురయ్యారు. ఆయన పనితీరుపై పలు సందర్భాల్లో అసమ్మతి తెలిపారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ సూచనలకు మద్దతు కరువైంది. రాఫెల్ వివాదం విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల దాడి చేసినప్పుడు కొద్ది మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాహుల్‌ను షాక్‌కు గురిచేశాయి. సీనియర్ నేతలు ఎప్పటికీ తనకు అండగా నిలువరని భావించడం ఆయన రాజీనామా చేయడానికి ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీనియర్ నేతల పెత్తనానికి సోనియా ఎందుకు అంగీకరిస్తున్నారు? యువనేతలను ఎందుకు శాంతపరచడం లేదు? సమాధానం ఒక్కటే. తన కుమారుడు రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆమె కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ అంతర్గత కుట్ర అనే మాస్టర్‌ప్లాన్ వేశారని భావిస్తున్నారు.

వృద్ధనేతల కథ ముగింపు..

ఎన్నికల అనంతరం, మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ సిద్ధమైతే, వృద్ధ నేతాగణానికి ఇక ఒకేసారి ముగింపు పలుకుతారని విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్లపై తీవ్ర విమర్శలు చేస్తూ యువనేతలు పార్టీని వీడుతున్నారు. వీటిని రాహుల్, సోనియా తర్వాత ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక్కడ సోనియా క్రీయాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాల ప్రకారం హర్యానా, మహారాష్ట్రలో పార్టీకి ఓటమి తప్పదు. హర్యానాలో హుడాకు పగ్గాలు అప్పగించారు. పార్టీ ఓటమిపాలైతే ఆయన కథ ఇక ముగిసినట్లే. ఎన్నికల ముంగిట, ప్రస్తుతం సోనియా దృష్టి అంతా సీనియర్లను తప్పించడంపైనే ఉందని సమాచారం. తద్వారా యువనేతలకు లేదా రాహుల్ టీంకు మార్గం సుగమం చేయనున్నారు. రాహుల్ విపాసన కార్యక్రమం.. ఆయన సెకండ్ ఇన్సింగ్స్‌కు ప్రారంభమని నేతలు పేర్కొంటున్నారు.

వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి

ఎన్నికల ముంగిట రాహుల్ విదేశాలకు వెళ్లడంపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత ప్రజాస్వామిక సంప్రదాయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు ఎప్పుడూ గౌరవముందని, వ్యక్తిగత విషయాలను ప్రజా జీవితంతో ముడిపెట్టకూడదని స్పష్టంచేసింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఎస్పీజీ భద్రతకు సంబంధించి నిబంధనల్లో చేసిన మార్పులపై తమ నేతలకు ఎలాంటి సమాచారం అందలేదని ఆ పార్టీ పేర్కొంది. విదేశాల్లో ఉన్నప్పుడు కూడా నేతలకు ఎస్పీజీ భద్రత కల్పించనున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది.

2345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles