వరద తగ్గింది.. నష్టం మిగిలింది


Thu,August 16, 2018 12:44 PM

Rahul Gandhi Writes To PM Modi On Kerala Floods

-1,031 హెక్టార్లలో పంట నష్టం,
-500 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
-కేరళలో ఇప్పటికీ ఎనిమిది జిల్లాల్లో హై అలర్ట్
-34కు చేరిన మృతుల సంఖ్య
-వరద తగ్గినా ఇంటికి వెళ్లడానికి భయపడుతున్న జనం
-సీఎం ఏరియల్ సర్వే; ఆదుకోవాలంటూ మోదీకి రాహుల్ లేఖ

తిరువనంతపురం, ఆగస్టు 11: కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వరద ఉద్ధృతి కూడా తగ్గింది. శుక్రవారం నాటికి రిజర్వాయర్లలో ప్రమాదస్థాయికి చేరిన నీటిమట్టం శనివారం నాటికి తగ్గింది. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికీ హై అలర్ట్ అమల్లో ఉన్నది. భారీ వర్షాలతో మరణించిన వారి సంఖ్య 34కు చేరుకుంది. వర్షాలతో సహాయ శిబిరాల్లో తల దాచుకున్న దాదాపు 54 వేల మంది.. మళ్లీ వర్షం, వరద పెరుగుతుందేమోనన్న భయంతో ఇండ్లకు వెళ్లడం లేదు. వర్షం తగ్గి, వరద ఉద్ధృతి తగ్గడంతో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వర్షంతో దాదాపు 1,031 హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. వర్షప్రభావిత జిల్లాల్లో కేరళ సీఎం పినరాయి విజయన్ శనివారం ఏరియల్ సర్వే చేశారు. ఎర్నాకుళంలోని సహాయ శిబిరాన్ని ప్రముఖ మళయాల నటుడు మమ్మూటి సందర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వర్షాలతో భారీగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవడానికి పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి రూ. కోటి విరాళం ప్రకటించారు. కేరళను ఆదుకోవడానికి కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని, సరిపడా నిధులు విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

భారీగా పంట నష్టం

శుక్రవారం వరద ఉద్ధృతి భారీగా పెరుగడంతో ఇడుక్కి డ్యాంలోనీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరిన విషయం తెలిసిందే. శనివారంనాటికి ఆ డ్యాంలో నీటి మట్టం తగ్గి 2,401 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రమాదం తప్పింది. అయినా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో కిందకు నీటిని వదులుతున్నారు. దాదాపు 500 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరద వల్ల ఇండ్లల్లోకి బురద వచ్చి చేరడం, గోడలు కూలిపోవడం, పాములు తదితర భయాలతో వాళ్లు ఇంటికి వెళ్లడం లేదు. అంతేగాక తమ నివాస ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు కావడం, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండం వల్ల కూడా వారు ఆందోళన చెందుతున్నారు. సహాయక శిబిరంలో ఉన్న ఓ మహిళ మాట్లాడుతూ వరద ఉద్ధృతి పెరుగడటం, పెరియార్ నది నుంచి నీటిని వదులుతుండటంతో కట్టుబట్టలతో బయటికి వచ్చాం. మా ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలియదు.

మా ఇల్లు ఉన్నదో, కొట్టుకుపోయిందో కూడా తెలియదు. ఇంటికి వెళ్లాలంటేనే భయమేస్తున్నది అని చెప్పారు. తాత్కాలిక శిబిరాల్లో ప్రభుత్వం సదుపాయాలు కల్పించిందని, ఆహారం, మందులు లభిస్తున్నాయని తెలిపారు. పుతెన్‌వేలికారా ప్రాంతానికి చెందిన ఓ రైతు మాట్లాడుతూ లక్ష అరటి చెట్లు నేలమట్టమయ్యాయని చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టం భారీగానే ఉన్నదని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరిన కేరళ సీఎం పినరాయి విజయన్ తన వంతుగా లక్ష రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు.

1099
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles