మోదీ.. ప్రైమ్ టైమ్ మినిస్టర్


Sat,February 23, 2019 03:43 AM

Rahul Gandhi says Modi Primetime minister

-ఉగ్రదాడి తర్వాత కూడా ప్రచార చిత్రం షూటింగ్‌ను కొనసాగించడం సిగ్గుచేటు
-ప్రధానిపై తీవ్రస్థాయిలో మండిపడిన రాహుల్ గాంధీ
- ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని పునరుద్ఘాటన
- రాహుల్‌వి తప్పుడు ఆరోపణలంటూ బీజేపీ ఎదురుదాడి

న్యూఢిల్లీ / తిరుపతి, ఫిబ్రవరి 22: ప్రధాని నరేంద్రమోదీని ప్రైమ్ టైమ్ మినిస్టర్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయనపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకు కూడా మోదీ తన ప్రచార చిత్ర షూటింగ్ కొనసాగించారని, ఈ దాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలతోపాటు దేశమంతా ఆవేదనతో గగ్గోలు పెడుతుంటే.. మోదీ మాత్రం ఫొటోషూట్‌లో పాల్గొన్నారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు రాహుల్ ఫొటోషూట్ సర్కార్ హ్యాష్ ట్యాగ్‌తో ఓ ట్వీట్ చేశారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో కూడా రాహుల్ ఇదే విమర్శలను పునరుద్ఘాటించారు. ప్రధానిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, జాతీయవాదిగా చెప్పుకొనే మోదీ సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా మూడున్నర గంటల పాటు తన ప్రచార చిత్రం షూటింగ్‌ను కొనసాగించడం సిగ్గుచేటని రాహుల్ నిప్పులు చెరిగారు. పేద రైతుల పంట రుణాలను రద్దు చేయని మోదీ.. బడా వ్యాపారవేత్తలు చెల్లించాల్సిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేశారని ధ్వజమెత్తారు. ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన రాహుల్.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని మరోసారి ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, లేకున్నా ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ఏపీకి పదేండ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని గతంలో బీజేపీ ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు మోదీ సిగ్గుపడాలన్నారు.

తెలిసినా పట్టించుకోలేదా?
పుల్వామాలో దాడి తర్వాత తొలి రెండు గంటలు ప్రధాని ఏమిచేశారో చెప్పాలని కాంగ్రె స్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ దాడి గురించి మోదీకి పూర్తిగా తెలియదని, ఒకవేళ తెలిసినా ఆయన తగినట్లు స్పందించలేదని విమర్శించింది. ఆ రోజు సాయంత్రం 5.10 గంటలకు మోదీ ఫోన్ ద్వారా ఉత్తరాఖండ్‌లో ఓ సభను ఉద్దేశించి ప్రసంగించినట్టు డీడీ న్యూస్ చానల్ తెలిపిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ శుక్రవారం మీడియాకు తెలిపారు. 14 మధ్యాహ్నం 3.10 గంటలకు పుల్వామాలో ఉగ్రదాడి జరిగితే ఆ రోజు సాయంత్రం 5.10 గంటలకు మోదీ ఉత్తరాఖండ్ సభను ఉద్దేశించి ప్రసంగించారన్న మనీశ్ తివారీ.. ఆ 2 గంటలు మోదీ ఏమి చేశారో చెప్పాలన్నారు.

అవి ఉదయం తీసిన ఫొటోలు
కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడికి దిగింది. మోదీపై ఆరోపణలు సిగ్గుచేటని, ఉగ్రదాడి త ర్వాత భద్రతా బలగాలకు, సర్కార్‌కు అండగా నిలుస్తామన్న్న కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నదని బీజేపీ ధ్వజమెత్తింది. రాహుల్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఫొటోషూట్ పై రాహుల్ షేర్‌చేసిన ఫొటోలు ఆ రోజు (14) ఉదయం తీసినవేనన్నది. రాహుల్ జీ.. మీ తప్పుడు వార్తలతో దేశం అలసిపోయింది. దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు మీరు 14న ఉదయం ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇటువంటి సిగ్గుమాలిన పనులను కట్టిపెట్టండి అని బీజేపీ ట్వీట్ చేసింది.
rahul

110 నిమిషాల్లో కాలినడకన తిరుమల కొండపైకి

తిరుమల, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తిరుమలలో రికార్డు సృష్టించారు. కేవలం 110 నిమిషాల్లో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11.40కు నడక ప్రారంభించి 1.30కు తిరుమల చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్‌తో పోటీపడి నడిచారు. ఏకబిగిన 3,500 మెట్లెక్కారు. తిరుమలపైకి చేరుకున్నాక శ్రీకృష్ణ గెస్ట్‌హౌస్‌లో కొద్దిసేపు సేద తీరారు. రాహుల్‌కు టీటీడీ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ స్వాగతం పలికారు. దివ్యదర్శనం టోకెన్లతో సాధారణ భక్తుడిలా శ్రీవారిని రాహుల్ దర్శించుకున్నారు. తర్వాత రరాహుల్, రెహాన్ వాద్రాలకు వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ జేఈవో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి, రాహుల్‌ను పట్టు వస్ర్తాలతో సత్కరించారు.

అప్నాదళ్.. అదే బాటలో ఎస్బీఎస్పీ


-ఎన్డీయే నుంచి వైదొలిగేందుకు రెడీ

బలియా : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మిత్రపక్షాల్లో అప్నాదళ్‌తోపాటు ఎస్బీఎస్పీ (సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) కూడా ఎన్డీయే నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నది. బీజేపీ తమ డిమాండ్లను నెరవేర్చడం లేదని యూపీ మంత్రి, ఎస్పీఎస్పీ అధినేత ఓంప్రకాశ్ రాజ్‌భర్ శుక్రవారం ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఎస్పీ-బీఎస్పీ కూటమిలో చేరే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. బీజేపీతో తెగతెంపులపై తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ అధినేతలతో చర్చిస్తున్నానని, దీనిపై ఈ నెల 24న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్డీయేలో కొనసాగడంపై సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తమకు ఉన్నదని అప్నాదళ్ పేర్కొన్న కొద్ది గంటలకే ఎస్బీఎస్పీ ఈ హెచ్చరిక చేసింది.

బుల్లెట్ రైలుకు పేరు, మస్కట్ సూచించండి


-విజేతకు నగదు పురస్కారం: ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రతిష్ఠాత్మక బుల్లెట్ రైలుకు పేరు సూచించాలని, అలాగే మస్కట్‌ను రూపొందించాలని దేశ ప్రజలను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) కోరింది. ప్రయాణికులు రైలు పేరును గుర్తుపెట్టుకునేలా చాలా సులభంగా ఉండాలని, మస్కట్ కూడా చూడగానే బుల్లెట్ రైలు హుందాతనం కొట్టొచ్చినట్లు కనిపించాలని సూచించింది. ఈ పోటీలో పాల్గొనే వారు మార్చి 25లోపు పేరు, మస్కట్‌ను mygov.in అనే వెబ్‌సైట్‌కు పంపాలని తెలిపింది. విజేతకు నగదు పురస్కారం అందజేస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకు mygov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది.

884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles