గాంధీలకు కేంద్రం షాక్

Sat,November 9, 2019 02:29 AM

-సోనియా, రాహుల్, ప్రియాంకకు ఎస్పీజీ భద్రత తొలగింపు
-28 ఏండ్ల తర్వాత మొదటిసారి..
-ఇకపై సీఆర్పీఎఫ్‌తో జెడ్‌ప్లస్ సెక్యూరిటీ
-మండిపడుతున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: సోనియాగాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారికి ఇంతకాలం కల్పించిన అత్యున్నత భద్రతను తగ్గించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రాలకు ఇప్పటివరకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను తొలగించినట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ఇకపై సోనియాగాంధీ కుటుంబం.. సీఆర్పీఎఫ్‌తోకూడిన జెడ్‌ప్లస్ భద్రతను కలిగి ఉంటుందని చెప్పారు. ఎవరెవరికి ముప్పు పొంచిఉన్నదో అంచనావేసిన పలు భద్రతా సంస్థలు.. ప్రత్యక్షంగా సోనియాగాంధీ కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని తేల్చాయని ఓ సీనియర్ అధికారి చెప్పారు. 28 ఏండ్ల తర్వాత సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించారు. ఎస్పీజీ.. దేశంలోనే అత్యధిక భద్రత శ్రేణి కలిగినది. 1991 మే 21న ఎల్టీటీఈ తీవ్రవాదులు.. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత ఎస్పీజీ చట్టంలో సవరణలు చేసి సోనియాగాంధీ కుటుంబాన్ని వీవీఐపీ భద్రత జాబితాలో చేర్చారు. అప్పటివరకు కేవలం ప్రధానమంత్రులు, మాజీ ప్రధానులకు మాత్రమే పదేండ్లవరకు ఎస్పీజీ భద్రత ఉండేది. 2003లో చట్టానికి చేసిన సవరణ తర్వాత పదేండ్ల వ్యవధిని.. ఒక్క ఏడాదికే కుదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్కరే ప్రస్తుతం ఎస్పీజీ కమాండోల భద్రతను కలిగి ఉన్నారు. ఎస్పీజీలో దాదాపు మూడువేల మంది భద్రతసిబ్బంది ఉంటారు.

ఇది రాజకీయ కక్షసాధింపు: కాంగ్రెస్

సోనియాగాంధీ కుటుంబానికి భద్రత తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నది. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందని విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ స్పందిస్తూ.. ఉగ్రవాదులు, హింసాత్మక చర్యలతో ఇద్దరు మాజీ ప్రధానమంత్రులను కోల్పోయిన కుటుంబానికి భద్రత తగ్గించి.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకారచర్యలకు పాల్పడింది అని విమర్శించారు. సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించడం తనను షాక్‌కు గురిచేసిందని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్యేనని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్‌శర్మ అన్నారు. యూపీఏ హయాంలో అటల్‌బిహారి వాజపేయీకి ఎస్పీజీ భద్రతను కొనసాగించా మని,ఆయన మరణించేవరకు మోదీ సర్కారులోనూ భద్రత కలిగిఉన్నారని గుర్తుచేశారు.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles