వాగ్దానం నెరవేర్చాల్సిందే

Tue,February 12, 2019 02:35 AM

-ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రానికి ప్రతిపక్షాల డిమాండ్
-విభజన హామీలకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి: మన్మోహన్
-ఏపీని దోచి అనిల్ అంబానీకి పెట్టారు: రాహుల్‌గాంధీ
-ఫెడరల్ వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారు: కేజ్రీవాల్
-టీడీపీ దీక్షకు సంఘీభావం తెలిపిన పలు పార్టీల నేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఏమాత్రం జాప్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో సోమవారం చేపట్టిన ఒకరోజు దీక్షలో పలు పార్టీల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఢిల్లీలోని ఆంధ్రా భవన్ వద్ద జరిగిన దీక్షలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందేనని అన్నారు. ఏపీ విభజనపై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు బీజేపీ సహా అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఏపీ ప్రజలను దోచి అనిల్ అంబానీకి పెట్టారని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెప్తారని అన్నారు. దేశ ప్రజల మనోభావం ఏమిటో మరో రెండు నెలల్లో మోదీ తెలుసుకుంటారని చెప్పారు.

పాక్ ప్రధానిలా మోదీ: కేజ్రీవాల్


ప్రధాని మోదీ పాకిస్థాన్ ప్రధానిలా వ్యవహరిస్తూ భారతదేశ ఫెడరల్ స్వభావాన్ని నాశనం చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మోదీజీ మీరు బీజేపీకి మాత్రమే కాదు.. దేశమంతటికీ ప్రధాని. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల మోదీ పాకిస్థాన్ ప్రధానిలా వ్యవహరిస్తున్నారు అని చెప్పారు.

రాజధర్మాన్ని పాటించలేదు


ఏపీకి ప్రత్యేక హోదాను నిరాకరించడం ద్వారా ప్రధాని మోదీ రాజధర్మాన్ని పాటించడం లేదని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ తదితరులు పాల్గొన్నారు.

టీ కప్పుకు బదులు దేశాన్నిచ్చారు!


చంద్రబాబు చేపట్టిన దీక్షా శిబిరం వద్ద వెలిసిన ఒక పోస్టర్ కలకలం రేపింది. ప్రధాని మోదీ రాజకీయాలలోకి రాకమునుపు చాయ్ అమ్మిన విషయాన్ని గుర్తు చేస్తూ ఒక ప్లకార్డును శిబిరం వద్ద ప్రదర్శించారు. చాయ్ తాగిన కప్పులను ఇవ్వాల్సినోడి చేతికి దేశాన్ని అప్పగించారు అని ఆ ప్లకార్డుపై రాసి ఉండటం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన టీడీపీ ఆ ప్లకార్డుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

దీక్ష కోసం వచ్చి ఆత్మహత్య


చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడు ఢిల్లీలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దవల అర్జున్ రావు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. ఆదివారం రాత్రి అతడు ఏపీభవన్‌కు సమీపంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీల్‌చైర్‌లో ఉన్న అతని మృతదేహం వద్ద ఒక లేఖ లభించిందని చెప్పారు. తాను ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆ లేఖలో రాసి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles