రాఫెల్ ఒప్పందం వివరాలు ఇవ్వండి


Thu,October 11, 2018 01:45 AM

Rafale deal details Supreme Court tells Modi govt

-ధర, సాంకేతిక వివరాలు అవసరం లేదు
-ఒప్పందానికి సంబంధించిన నిర్ణయ ప్రక్రియ గురించి తెలుపండి
-29లోగా సీల్డు కవర్లో అందజేయండి
-కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: వివాదాస్పదంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తీసుకున్న నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, వాటి సాంకేతిక సమాచారాన్ని మాత్రం పంపాల్సిన అవసరం లేదని తెలిపింది. రాఫెల్ విమాన ఒప్పందంపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ రాజకీయ పిటిషన్లని, వాటిని తోసిపుచ్చాలని ప్రభుత్వం కోరింది. అయితే తాము ప్రభుత్వానికి నోటీసు జారీ చేయడం లేదని, కేవలం యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన నిర్ణయం చట్టబద్ధమా? కాదా? అన్న విషయాన్ని మాత్రమే తాము తెలుసుకోగోరుతున్నామని సీజేఐ గొగోయ్ పేర్కొన్నారు. తాము కోరిన సమాచారాన్ని ఈ నెల 29లోగా అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం సమాచారం అందించిన రెండు రోజుల తరువాత పిటిషన్లపై విచారణ జరుపుతామని పేర్కొంది.

రాఫెల్ యుద్ధ విమానాల ధర, వాటి అనుకూలతలకు సంబంధించి తాము విచారణ జరుపడం లేదని, కేవలం ఒప్పందం చేసుకోవడానికి గల ప్రాతిపదికను మాత్రమే పరిశీలిస్తామని తెలిపింది.విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ, న్యాయవాదులు వినీత్ ధండా, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లలో పేదలకు సంబంధించిన ప్రజా ప్రయోజనం ఏమీ లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యాజ్యాలని పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే దేశంలో ఓ రాజకీయ పోరాటం జరుగుతున్నదని, ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఇటువంటి పిటిషన్లను విచారణకు స్వీకరించడం వల్ల వాటిని రాజకీయంగా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నదని అన్నారు.

ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను న్యాయపరంగా సమీక్షించకూడదని చెప్పారు. న్యాయస్థానం జారీ చేసే నోటీసు ప్రధానమంత్రి వద్దకు వెళుతుందని, అందువల్ల ఇటువంటి పిటిషన్లను ప్రోత్సహించవద్దని కోరారు. ఈ వాదనపై స్పందించిన ధర్మాసనం, తాము పిటిషన్లలో చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రభుత్వానికి నోటీసు కూడా జారీ చేయడం లేదని, కేవలం తమ సంతృప్తి కోసం సమాచారాన్ని కోరుతున్నామని తెలిపింది.

రాఫెల్‌కు రిలయెన్స్ తప్పనిసరి!

-ఈ షరతు ఒప్పందంలోనే ఉంది
-బయటపెట్టిన ఫ్రెంచ్ పత్రిక మీడియాపార్ట్

న్యూఢిల్లీ/పారిస్, అక్టోబర్ 10: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ఇప్పటికే రగిల్చిన రాజకీయ చిచ్చుకు మరింత ఆజ్యం పోసే పత్రాన్ని ఫ్రెంచ్ పత్రిక మీడియాపార్ట్ బుధవారం బయటపెట్టింది. భారత్‌కు రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేసే కాంట్రాక్టును పొందిన ఫ్రెంచ్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్‌కు చెందిన ఓ రహస్య పత్రాన్ని తాము సేకరించామని ఆ పత్రిక తెలిపింది. ఆ పత్రం ప్రకారం, రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను తప్పనిసరిగా తమ సహచర భాగస్వామిగా చేర్చుకోవాలన్న షరతు విధించారని వెల్లడించింది. రిలయెన్స్ సంస్థను భాగస్వామిగా చేర్చుకోవాలని భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ ఆరోపణను అప్పుడే తోసిపుచ్చిన డస్సాల్ట్ సంస్థ, రిలయెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకోవాలన్నది తమ నిర్ణయమేనని పేర్కొంది. కానీ భారత్, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పందంలోనే రిలయెన్స్ సంస్థ పేరును ప్రస్తావించారని, విదేశీ భాగస్వామిగా ఆ సంస్థను చేర్చుకోవాలన్న నిబంధన విధించారని మీడియాపార్ట్ తాజాగా సేకరించిన పత్రం ఆధారంగా వెల్లడించింది. వేల కోట్ల అప్పుల్లో ఉన్న తన పారిశ్రామిక మిత్రుడు అనిల్ అంబానీని గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి మోదీ స్వయంగా రాఫెల్ కాంట్రాక్టులో భాగస్వామిగా ఆయనను ప్రతిపాదించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

760
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles