ముంచుకొస్తున్న మూడో ప్రపంచయుద్ధం!Mon,April 16, 2018 02:23 AM

-ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ రష్యా ప్రభుత్వ చానల్ హెచ్చరిక
-సిరియాపై మరిన్ని దాడులు : ట్రంప్
-తగిన సమాధానం చెబుతామన్న పుతిన్
-భద్రతామండలిలో వీగిన రష్యా తీర్మానం

trump-putin
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఏడేండ్లుగా సిరియాలో సాగుతున్న అంతర్యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారనుందన్న వార్తలు వెలువడుతున్నాయి. సిరియాపై అమెరికా అణుదాడి జరిపేందుకు సిద్ధమవుతుందని, అణ్వస్ర్తాలనుసిద్ధం చేసుకుంటున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో మధ్యదరాతీరంపై యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. సిరియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ రష్యా ప్రభుత్వ టీవీ చానల్ రోసియా-24 ప్రజలను అప్రమత్తం చేసింది. మూడో ప్రపంచ యుద్ధం వస్తున్నది. సిద్ధంగా ఉండండి. బంకర్లు, షెల్టర్లలో తలదాచుకునేందుకు తగిన ఆహారపానీయాలను, నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోండి. రేడియేషన్ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు తగిన మోతాదులో అయోడిన్ నిల్వలు, మందులు కూడా అందుబాటులో ఉంచుకోండి అని చానల్ తెలిపింది. అమెరికా, రష్యా ఇరుదేశాల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ తీవ్రమైంది. రాయబారుల బహిష్కరణ, ఆంక్షలకు తోడు తాజాగా సిరియా సంక్షోభం కూడా ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధకాలంనాటి కన్నా తీవ్రమైన పరిస్థితులను సృష్టించాయి.

సిరియా అధ్యక్షుడు బషర్ అసద్ రసాయన దాడులు జరుపుతున్నారని, అవి కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సిరియాలోని రసాయన ఆయుధాలు కలిగిన స్థావరాలపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా మెరుపు దాడులు జరుపుతున్నాయి. అయితే రసాయన దాడులేవీ జరుగలేదని తెలిపిన రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో మాట్లాడుతూ అమెరికా దాడుల్ని కొనసాగిస్తే అంతర్జాతీయ సంబంధాల్లో మార్పులు తప్పవని హెచ్చరించారు. మరోవైపు సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దాడులకు వ్యతిరేకంగా రష్యా చేసిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో వీగిపోయింది.

4276

More News

VIRAL NEWS