ఎన్నికల వేళ..బయోపిక్‌ల గోల!

Fri,January 11, 2019 02:55 AM

-నేతల జీవిత చరిత్రలు, చారిత్రక ఘటనల ఆధారంగా సినిమాల నిర్మాణం
-మోదీ, మన్మోహన్, థాకరే, లాల్‌బహదూర్ శాస్త్రిలపై చిత్రాలు
-బహిరంగసభా వేదికలుగా మారుతున్న వెండితెరలు
-ప్రచారాస్ర్తాలుగా మలుచుకుంటున్న రాజకీయ పార్టీలు

న్యూఢిల్లీ, జనవరి 10: మరో మూడు నెలల్లో లోక్‌సభతోపాటు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎని్నకలు కూడా జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్ర్తాలలో ఒకదానిగా సినిమాలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంతోనే ఏప్రిల్ నెల నాటికి ఆరు నుంచి ఎనిమిది సినిమాలు విడుదల కానున్నట్టు తెలుస్తున్నది. వీటిలో ఎక్కువగా జీవితకథల ఆధారిత సినిమాలు (బయోపిక్)లు ఉండబోతున్నాయి. ఒకరకంగా వెండితెరను బహిరంగ సభా వేదికలుగా మలుచుకుంటున్న పార్టీలు తమ సినిమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూరి: ది సర్జికల్ ైస్ట్రెక్, ది యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్, థాకరే, ది తాష్కెంట్ ఫైల్స్ చలనచిత్రాలు వెంట వెంటనే విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు రానున్నాయి. ఒకటి బీజేపీ ఎంపీ, సినీ నటుడు పరేశ్ రావల్ రూపొందిస్తుండగా, మరో సినిమాలో వివేక్ ఒబెరాయ్ మోదీగా నటిస్తున్నారు.

శుక్రవారం విడుదలవుతున్న యూరి: ది సర్జికల్ ైస్ట్రెక్ సినిమాను 2016 సెప్టెంబర్‌లో భారత సైనిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఉదంతంపై రూపొందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయనకు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైం మినిస్టర్ పుస్తకం ఆధారంగా అదే పేరుతో సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ మన్మోహన్‌గా నటించారు. ఈ సినిమాలో ఇందిరాగాంధీ కుటుంబాన్ని నెగెటివ్‌గాచూపించినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబం పదేండ్లపాటు తెరవెనుక నుంచి ప్రభుత్వాన్ని తన చెప్పు చేతుల్లో ఎలా ఉంచుకుందో ఈ సినిమా తేటతెల్లం చేయనుందని బీజేపీ పేర్కొంటుండగా, ఎన్నికల ముంగిట తమకు వ్యతిరేకంగా జరిగే సినిమా ప్రచారంగా కాంగ్రెస్ దీనిని అభివర్ణించింది.

ఇక థాకరే సినిమాను శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాకరే జీవితకథ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా రచయితగా, నిర్మాతగా శివసేన సీనియర్‌నాయకుడు సంజయ్ రౌత్ వ్యవహరిస్తుండగా, నవాజుద్దీన్ సిద్దిఖీ థాకరే పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా థాకరే జయంతి సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మృతిచెందిన అనుమానాస్పద పరిస్థితులపై ది తాష్కెంట్ ఫైల్స్ రూపొందించారు. బీజేపీ మద్దతుదారుగా పేరొందిన వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమాను కూడా కాంగ్రెస్‌ను విమర్శించేందుకే ఎక్కుపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో విడుదల కావొచ్చని భావిస్తున్నారు. ఇక తెలుగునాట కూడా ఇప్పటికే ఒక సినిమా విడుదల కాగా, మరో రెండు లేదా మూడు చిత్రాలు ఎన్నికలకు ముందు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు, దిగ్గజ నటుడు ఎన్టీ రామారావు జీవిత కథతో రెండు సినిమాలను రూపొందించారు. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కాగా, ఎన్టీఆర్ మహానాయకుడును వచ్చే నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌పైనే రాంగోపాల్‌వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే మరో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీని రెండుసార్లు అధికారానికి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. .

1209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles