ప్రియాంకం


Thu,March 21, 2019 02:53 AM

Priyanka Gandhi Vadra concludes her Ganga Yatra

- ప్రియాంక రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
-ఉత్తరప్రదేశ్‌లో హస్తానికి పూర్వవైభవం వచ్చేనా?

కాంగ్రెస్‌లో ప్రియాంకం మొదలైంది. ఇన్నాళ్లూ తెరవెనుక వ్యూహరచనకే పరిమితమైన ప్రియాంకా గాంధీ.. ఇప్పుడు సోదరుడికి తోడుగా ప్రత్యక్ష రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్‌కు.. నూతన జవసత్వాలు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. బీజేపీ కంచుకోటలో గంగాయాత్రతో ఎన్నికల ప్రచారభేరి మోగించారు. ఈ యాత్ర ద్వారా అంతర్లీనంగా సాఫ్ట్ హిందుత్వ కార్డును కాంగ్రెస్ ప్రయోగిస్తున్నది.
- ఎలక్షన్ డెస్క్


ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను పక్కనబెట్టి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) జట్టుకట్టడంతో నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రియాంక రాజకీయ అరంగేట్రం నిస్సందేహంగా ఉత్సాహం నింపేదే. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత విభాగానికి ప్రియాంకను ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ నియమించింది. పశ్చిమ బాధ్యతలు జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించింది. తూర్పు యూపీ బీజేపీకి కంచుకోట. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఈ ప్రాంతంలోనిదే. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇదివరకు లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఏమాత్రం బలంగా లేని పార్టీని చక్కదిద్దడం ప్రస్తుతం ప్రియాంక ముందున్న అసలైన సవాల్.
Priyankagandhi1

యువత, మహిళలు చేరువయ్యేనా..

వాస్తవానికి ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే తన తల్లి, సోదరుడి నియోజకవర్గాలైన అమేథీ, రాయబరేలీకే ఆమె ఇన్నాళ్లు పరిమితమయ్యారు. వారి విజయం కోసం అక్కడ ప్రచారం నిర్వహించారు. తెరవెనుక వ్యూహాలు రచించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ఎంపికలోనూ కీలకంగా వ్యవహరించారు. కానీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఎట్టకేలకు ఈసారి కార్యకర్తల ఆశలు నెరవేరుస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రియాంక రాకతో మహిళలు, యువత తమకు చేరువవుతారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నది.

జవసత్వాలు తెచ్చేనా?

ఒకప్పుడు కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముస్లింలు ఇప్పుడు దూరమయ్యారు. ఓబీసీలు, దళితులు చాలా వరకు ఎస్పీ, బీఎస్పీ వైపు మొగ్గుచూపుతున్నారు. అగ్రకులాలు బీజేపీవైపు మళ్లారు. ఈ క్రమంలో ప్రియాంక ఏవిధంగా వీరిని తమవైపు తిప్పుకుంటారనేది ఆసక్తికరం. మరోవైపు తన భర్త రాబర్ట్‌వాద్రా మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఆమెకు ప్రతిబంధకంగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీలో కాంగ్రె స్ పార్టీకి ఆమె ఏవిధంగా జవసత్వాలు తీసుకువస్తారో చూడాలి. ముక్కోణపు పోరులో కాంగ్రెస్ వల్ల ఎస్పీ, బీఎస్పీ ఓట్లే చీలుతాయని, ఇది పరోక్షంగా బీజేపీకే లాభం చేకూరుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

సాఫ్ట్ హిందుత్వ కార్డ్..

గంగాయాత్ర ద్వారా కాంగ్రెస్ అంతర్లీనంగా సాఫ్ట్ హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్నది. పవిత్ర సంగమంలోని హనుమాన్ ఆలయంలో అభిషేకంతో పాటు అక్షయ్‌వట్ వృక్షం వద్ద ప్రియాంక ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఆమె ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన కొద్ది నిమిషాలకే కాంగ్రెస్ శ్రేణులు.. 1979 జూన్‌లో ఇందిరాగాంధీ ఆ ఆలయాన్ని సందర్శించిన నాటి ఫొటోలను, ఇప్పటి ప్రియాంక ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో బాగా సర్యులేట్ చేశారు. రెండో రోజు పర్యటనలో ఆమె ప్రముఖ దుర్గా క్షేత్రమైన మా వింద్యవాసిని ఆలయాన్ని సందర్శించారు. ఇందిరగాంధీ కూడా 1977లో ఈ ఆలయాన్ని సందర్శించారు. కాశీ విశ్వనాథుడిని కూడా ప్రియాంక దర్శించుకోనున్నారు.
Priyankagandhi2

గంగాయాత్రతో ప్రచారానికి శ్రీకారం

మతం, కులం ప్రభావం అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో గంగాయాత్రతో ప్రియాంక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) నుంచి భడోయ్, మీర్జాపూర్ మీదుగా ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసి వరకు గంగానదిపై పడవలో ప్రయాణిస్తూ నదీ తీర ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ గ్రామాల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. గంగా నదీ పరిసర ప్రాంతాల్లో నివసించే మల్లహాస్, బింద్స్ వంటి వెనుకబడిన ఉపకులాలతో కూడిన నిషద్ సామాజిక వర్గం రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైనది. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని వీరు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. వీరికి చేరువయ్యేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టింది. అలాగే భడోయ్‌లో కార్పెట్ తయారీదారులు, మీర్జాపూర్‌లో రగ్గుల తయారీదారులకు దగ్గరయ్యేందుకు కూడా ఈ యాత్ర ఉపయోగపడనుంది. సాఫ్ట్ హిందుత్వ, కులం లెక్కల ఆధారంగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోగలిగిందని రాజకీయ పండితుల విశ్లేషణ. యూపీలోనూ ఇదే ఫార్ములాను అనుసరించారని కాంగ్రెస్ నిర్ణయించింది. యూపీలో నిషద్ సామాజిక వర్గం రాజకీయంగా కీలకమైనది. గతేడాది మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ను బద్ధలు కొట్టడంలో వీరే ప్రధాన కారణం. నిషద్ పార్టీ స్థాపకుడు సంజయ్ నిషద్ కుమారుడైన ప్రవీణ్.. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బరిలోకి దిగి గోరఖ్‌పూర్‌లో ఘన విజయం సాధించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు యోగి ఆదిత్యనాథ్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు.

మేడమ్ లైఫ్ జాకెట్ వేసుకోండి నో ప్లీజ్ మేడమ్.. వేసుకోండి నో

మేడమ్.. ఎందుకు వేసుకోనంటున్నారు.. లైఫ్ జాకెట్లు లేని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేనేమీ ప్రత్యేకం కాదు.
ప్రియాంక చేపట్టిన గంగాయాత్రలో చోటుచేసుకున్న చిన్న సంఘటన ఇది. భద్రతా సిబ్బంది వారించినా.. ఆమె వినలేదు. లైఫ్ జాకెట్ వేసుకోకుండానే బోట్ ఎక్కారు. ఆహార్యం, హావభావాల్లో అచ్చు తన నానమ్మ ఇందిరాగాంధీని తలపించే ప్రియాంక.. సామాన్య ప్రజానీకంతో ఇట్టే కలిసిపోతారు. చిరునవ్వుతో పలుకరించడం, చిన్నారులను చేరదీయడం, చొరవగా ప్రజల ఇండ్లల్లోకి వెళ్లడం, మహిళలను హత్తుకోవడం వంటి చర్యలతో ఆమె సులువుగా ప్రజలతో మమేకమవుతారు. శిర్సా పాదయాత్రలో స్థానికులు ఇచ్చిన మామిడి రసం తడుముకోకుండా తాగి ఆశ్చర్యపరిచారు. ఆమె రాజకీయ ప్రసంగాలు కూడా ప్రత్యేకమే. నేను ఎక్కడికి వెళ్లినా.. కష్టాల్లో కూరుకుపోయిన రైతులు, మహిళలు, యువతే కనిపిస్తున్నారు. మీ బాధలు నేను అర్థం చేసుకోగలను. కొత్త తరహా రాజకీయాలు చేసేందుకు నేను ఇక్కడికి వచ్చా. సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం అని ఆమె శిర్సాలో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా ప్రజలు తమ తలరాతలు తామే మార్చుకోగలరని పేర్కొన్నారు. మీ కష్టాలు ఎవరు తొలిగిస్తారు? అని ఆమె ప్రజలను అడగ్గా.. కాంగ్రెస్ అంటూ సమాధానం వచ్చింది. అందుకు ఆమె.. కాంగ్రెస్ కాదు.. మీరే అంటూ బదులిచ్చారు.
Priyankagandhi3
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఓబీసీలు (ఇతర వెనుకబడిన వర్గాలు) 7.08 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 40 శాతం. దీంతో ఎన్నికల్లో వీరి ప్రాధాన్యాన్ని గుర్తించిన అధికార బీజేపీ.. రాష్ట్రంలో ఓబీసీల స్థితిగతులపై అధ్యయనానికి నలుగురు సభ్యులతో సామాజిక న్యాయ కమిటీని నియమించింది. గతేడాది అక్టోబర్‌లో ఈ కమిటీ నివేదిక సమర్పించింది. 27 శాతం ఉన్న ఓబీసీ కోటాను మూడు క్యాటగిరీలుగా విభజించాలని కమిటీ సిఫార్సు చేసింది. వెనుకబడిన తరగతులకు 7 శాతం, బాగా వెనుకబడిన వర్గాలకు 11 శాతం, అత్యంత వెనుకబడిన వర్గాలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. నిషద్, ఇతర ఉపకులాల ప్రజలు గంగా నదీ తీరప్రాంత గ్రామాల్లో నివసిస్తుంటారు. భౌగోళిక సంక్షిష్టతల దృష్యా చాలామంది రాజకీయ నాయకులు వారికి చేరువ కావడం లేదు. గంగాయాత్రతో ప్రియాంకా గాంధీ వారి సాధకబాధకాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.

821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles