ఆరంభం.. అదుర్స్

Tue,February 12, 2019 02:36 AM

-30 కి.మీ. మేర మెగా రోడ్‌షో
-జనసంద్రంగా మారిన లక్నో నగరం
-తొలిసారి యూపీలో అడుగుపెట్టిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి
-ప్రియాంకకు అపూర్వ స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
-సోదరుడు రాహుల్, జ్యోతిరాదిత్యతో కలిసి రోడ్‌షో
-కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు.. జోష్ నింపిన ప్రియాంక పర్యటన

లక్నో, ఫిబ్రవరి 11: రాజు వెడలె రవి తేజములదరగా.. అనే రీతిలో కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం, యువనేత ప్రియాంక గాంధీ (47) సోమవారం అట్టహాసంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అడుగుపెట్టారు. ఏఐసీసీ కార్యదర్శిగా, యూపీ తూర్పు ప్రాంత ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి యూపీకి వచ్చిన ప్రియాంకకు అడుగడుగునా పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. సాదాసీదా వస్త్రధారణతో, మోములో చిరునవ్వుతో, ఆద్యంతం కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ శ్రేణుల్లో ప్రియాంక జోష్ నింపారు. తన నాయనమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలపించారు. సోదరుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ యూపీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి బస్సు టాప్‌పై నిలబడి ప్రియాంక మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. లక్నోలోని చౌదరీ చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్‌షో భారీ ఎత్తున సాగింది. రండి.. అందరం కలిసి సరికొత్త భవిష్యత్‌ను నిర్మిద్దాం. వినూత్న రాజకీయాలకు శ్రీకారం చుడదాం.. ఈ మహాక్రతువులో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం.కృతజ్ఞతలు అంటూ లక్నోకు బయలుదేరే ముందు సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక గాంధీ పోస్టు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె ఇక్కడికి చేరుకున్నారు.

దుర్గామాత అవతారంతో పోస్టర్లు


ప్రియాంకను దుర్గామాత అవతారంతో పోలుస్తూ కార్యకర్తలు లక్నోలో పోస్టర్లు అంటించారు. సింహంపై దుర్గామాత అవతారంలో ప్రియాంక కూర్చున్నట్లుగా వీటిని తయారుచేశారు. దుర్గామాత రూపంలో సోదరి ప్రియాంక అనే క్యాప్షన్ పెట్టి పెద్దసంఖ్యలో ముఖ్య కూడళ్లలో వీటిని అంటించారు.

priyanka-Gandhi1

గులాబీ టీషర్టులతో ప్రియాంక సేన సందడి


రోడ్‌షోలో ప్రియాంక సేన సందడి చేసింది. ప్రియాంక ముఖచిత్రంతో ఉన్న గులాబీ టీషర్టులు ధరించిన కార్యకర్తలు ఆద్యంతం నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర తివారీ.. ప్రియాంకకు స్వాగతం పలుకుతూ తన కారును వినూత్నంగా ముస్తాబు చేయించారు. ప్రియాంక వచ్చింది.. విజయఢంకా మోగించింది.. దుష్టులను లంకకు తరిమివేస్తుంది అంటూ ప్రత్యేక బ్యానర్‌ను ప్రదర్శించారు.

మూడు రోజులు ఇక్కడే మకాం


ప్రియాంక, జ్యోతిరాదిత్య మూడు రోజులపాటు యూపీలోనే పర్యటించనున్నారు. 12, 13, 14 తేదీల్లో నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు, ఆఫీసు బేరర్లతో వరుస భేటీలు నిర్వహించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం, పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార విధి విధానాలను చర్చించనున్నారు.తూర్పు యూపీపైనే గురి


తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ గతంలో కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ ప్రాంతంలోని పూల్పూర్ నుంచి దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రాతినిధ్యం వహించారు. అలాగే అలహాబాద్ నుంచి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయకేతనం ఎగురవేశారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో పూల్పూర్, గోరఖ్‌పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు దారుణ పరాభవం ఎదురైంది. ముఖ్యంగా 40 పార్లమెంట్ స్థానాలు ఉన్న తూర్పు యూపీ ప్రాంతం.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు కంచుకోటగా ఉంది. ఈ ప్రాంతంలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ తన తురుపుముక్కగా ప్రియాంకను రంగంలోకి దించింది.

ప్రియాంక జాగ్రత్త: రాబర్ట్ వాద్రా


తన భార్య ప్రియాంకకు రాబర్ట్ వాద్రా ఉద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. పి.. నీకు నా అభినందనలు. నీ సరికొత్త యాత్ర సజావుగా సాగాలని కోరుకుంటున్నా. దేశ ప్రజలకు సేవ చేయాలనే నీ తపనను స్వాగతిస్తున్నా. నువ్వు నా ఆత్మీయ స్నేహితురాలివి. ఉత్తమ భార్యవి. మన పిల్లలకు అత్యుత్తమమైన తల్లివి. కానీ, ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నావు. ఇదంతా చాలా కక్షాపూరితమైన రాజకీయ వాతావరణం. కానీ, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది. అందుకే భారత ప్రజలకు నిన్ను అప్పగిస్తున్నా. దయచేసి ప్రియాంకను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు.
priyanka-Gandhi2

యూపీ ముఖ్యమంత్రిగా ప్రియాంక!


2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా యూపీలో 1989లో కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 30 ఏండ్ల వనవాసానికి చరమగీతం పాడాలని కాంగ్రెస్ యోచిస్తున్నది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 403 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఏడు చోట్ల మాత్రమే గెలిచింది. తాజాగా ప్రియాంక రాజకీయ ప్రవేశంతో కాంగ్రెస్ వర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు కాగానే ప్రియాంక పూర్తిస్థాయిలో రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌కు దూరమైన బ్రాహ్మణ ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించేందుకు ఆమె ప్రయత్నిస్తారని పేర్కొన్నాయి.

1601
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles