గోరక్షకుల దౌర్జన్యాలను ఉపేక్షించంMon,July 17, 2017 03:07 AM

-అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: గోరక్షణ పేరిట చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే సహించబోమని ప్రధాని మోదీ మరోమారు హెచ్చరించారు. ఆవు పేరు చెప్పి జరుగుతున్న అరాచకంపై ఉమ్మడిగా పోరాడుదామని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. గోరక్షణ పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ భద్రత, రక్షణ విషయంలో అన్ని పార్టీలదీ ఒకే మాట కావాలని అన్నారు. జీఎస్టీకి సహకరించినట్లే దేశానికి సంబంధించిన కీలక విషయాల్లో అదే సహకారం కావాలని పార్టీలను కోరారు. ఆర్‌జేడీ, తృణమూల్ నేతలపై వచ్చిన అభియోగాలను పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ.. అవినీతి వ్యతిరేక పోరాటంలో పార్టీలన్నీ కలిసిరావాలని, రాజకీయ ప్రయోజనాల సాకుతో అవినీతికి ఆస్కారమివ్వవద్దని కోరారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై మండిపడ్డారు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు కావాలనే హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయని అన్నారు. ఈ తరహా చర్యలతో దేశానికి చెడ్డపేరు వస్తున్నదని చెప్పారు. గోరక్షకుల పేరుతో హింసకు పాల్పడేవారిపట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అన్ని పార్టీలు ఉమ్మడిగా ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులపై పోరాడాలని పిలుపునిచ్చారు. గోరక్షణ కర్తవ్యం తమదేనన్నట్లు వ్యవహరిస్తున్న కొంతమంది దాడులకు తెగబడడం వెనుక వారి ప్రయోజనాలు ఏం దాగున్నాయో ప్రజలు చూడాలని కోరారు. కొంతమంది ఇలాంటి చర్యలతో దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
NarendraModi

సభా సమయం వృథా కానివ్వొద్దు

వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే 26 రోజుల సమావేశాల్లో 19 రోజుల పాటు సభా కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల సమయం వృథా కాకుండా అన్ని పార్టీలూ సంయమనంతో వ్యవహరించాలని విపక్ష నేతలను ప్రధాని మోదీ కోరారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను ఒక నెల ముందుగానే నిర్వహించినందువల్ల రుతుపవనాలు వచ్చేటప్పటికే కేంద్రం నుంచి నిధులు రాష్ర్టాలకు అందాయని, దాని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, కేంద్ర ఆలోచనకు పూర్తి సహకారం అందించి సహకార సమాఖ్య స్ఫూర్తిని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ లాంటి పెద్ద ఆర్థిక సంస్కరణకు కూడా విపక్షాల నుంచి సంపూర్ణ సహకారం అందిందని అన్నారు. దేశ రక్షణ, భద్రత అంశాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలదీ ఒకే వైఖరిగా ఉండాలని, దేశ ప్రయోజనాలే ప్రధానం కావాలని కోరారు. చైనా సైనికుల దూకుడు, అమర్‌నాథ్ యాత్రికులపై మిలిటెంట్ల దాడులు తదితర సంఘటనలపై యావత్తు దేశం ఒకే మాటమీద ఉన్నదని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో జరిగే చర్చల్లో జాతి ప్రయోజనాలే ప్రధానమని స్పష్టంచేశారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ చాలా హుందాగా ఉండేలా పార్టీలన్నీ తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వివరించాలని కోరారు.

విపక్షాల నుంచి సహకారం కోరాం: అనంతకుమార్

26 రోజుల వర్షాకాల సమావేశాల్లో 19 రోజులు సభ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ తెలిపారు. లోక్‌సభలోని 21 బిల్లులు, రాజ్యసభలో 42 బిల్లులకు ఆమోదం లభించాల్సి ఉన్నదని తెలిపారు. ఈ సమావేశాల్లో కొత్తగా 16 బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎనిమిది బిల్లులు, రాజ్యసభలో 10 బిల్లులపై ఈసారి చర్చ జరిపి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు.

260
Tags

More News

VIRAL NEWS