జైషే కార్యాలయం స్వాధీనం


Sat,February 23, 2019 02:46 AM

Pressure builds on Pak to blacklist J e Ms Masood Azhar

- పంజాబ్‌లోని మదర్సాను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
- అంతర్జాతీయ ఒత్తిడితో చర్యలు ఆరంభించిన పాక్
- భారత్‌తో యుద్ధాన్ని కాంక్షించడం లేదని వెల్లడి

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, ఫిబ్రవరి 22: పాకిస్థాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలంటూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ దేశం చర్యలు ఆరంభించింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అయిన జైషే మహమ్మద్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పాక్ ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకున్నది. పంజాబ్ ప్రావిన్సులోని బవల్‌పూర్‌లో జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంగా భావించే.. మదర్సాతుల్ సాబిర్, జామై మసీద్ సుభానల్లా క్యాంపస్‌ను అక్కడి ప్రభుత్వం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నది. మదర్సాలో 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీటి పరిపాలనా వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది అని పాక్ అంతర్గతశాఖ మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. పంజాబ్ సర్కారు మదర్సా క్యాంపస్‌ను ఆధీనంలోకి తీసుకుని చుట్టూ పోలీసుల్ని మోహరించినట్లు వెల్లడించింది. ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఫైన్సాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఏ) తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన నేపథ్యంలో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు గురువారం రాత్రి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో జాతీయ భద్రతా కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. జైషే మహమ్మద్ కార్యాలయాన్ని నియంత్రణలోకి తీసుకోవడం పాటు, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా, దాని ముసుగులో నడిచే స్వచ్ఛంద సంస్థ ఫలాహ్-ఎ-ఇన్సానియత్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా కార్యకలాపాల్ని పూర్తిగా జమాత్ ఉద్ దవా నియంత్రిస్తుంది.
jaish1

భారత్ దుడుకు చర్యలకు దిగితే.. దీటుగా బదులిస్తాం: పాక్

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎటువంటి దుందుడుకు చర్యలకు దిగినా దీటుగా పాకిస్థాన్ హెచ్చరించింది. యుద్ధం జరుగాలని తాము కోరుకోవడంలేదని, భారత్ మాత్రం కయ్యానికి కాలుదువ్వుతున్నదని ఆరోపించింది. పుల్వామా దాడిపై భారత్ ఎటువంటి దర్యాప్తు జరుపకుండానే పాకిస్థాన్‌ను నిందిస్తున్నదని పాక్ సైనిక అధికార ప్రతినిధి, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. మేము యుద్ధానికి సిద్ధం కావడంలేదు. మీరు (భారత్) మాత్రం బెదిరింపులకు దిగుతున్నారు. ఆ బెదిరింపులకు జవాబిచ్చే హక్కు మాకున్నది. తొలుత మీరే ముందడుగువేసి ఎలాంటి చర్య చేపట్టినా మమ్మల్ని ఆశ్చర్యపర్చలేరు. మేమే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం అని గఫూర్ పేర్కొన్నారు. ఇప్పుడు మేము గతంలో మాదిరిగా లేము. యుద్ధాలతో మా సైన్యం రాటుదేలింది. ముప్పును ఎదుర్కొనేందుకు మేము పూర్తిస్థాయిలో స్పందించగలం. ఈ విషయం భారత్‌కు తెలుసని, పాకిస్థాన్‌తో ఆటలాడుకోదని ఆశిస్తున్నాం అని అన్నారు. పాక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నదని, భారత్ మీడియా మాత్రం యుద్ధోన్మాదంతో రగిలిపోతున్నదని గఫూర్ ఆరోపించారు.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles