99% పోలింగ్ నమోదు


Tue,July 18, 2017 01:22 AM

Presidential election sees close to 99percentage voting, the highest ever

-రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక పోలింగ్‌శాతం

న్యూఢిల్లీ, జూలై 17:భారత 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సోమవారం జరిగిన ఎన్నికల్లో సుమారు 99శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే ఇప్పటివరకు అత్యధిక ఓటింగ్‌శాతమని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. విపక్షాల అభ్యర్థి, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో పోల్చితే, అధికారపక్షానికి చెందిన అభ్యర్థి, బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్‌కు సానుకూలంగా ఓట్లు నమోదయ్యాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, గుజరాత్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ర్టాల్లో వందశాతం ఓటింగ్ నమోదైంది.
poling
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో మాత్రం 99శాతం ఓట్లు పోలయ్యాయని రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వెల్లడించారు. లోక్‌సభ, రాజ్యసభల్లోని 776 మంది సభ్యులకుగాను 771మంది ఓటువేయడానికి అర్హులని ఆయన చెప్పారు. రెండు సభల్లోనూ ఒక్కొక్క స్థానం ఖాళీగా ఉందని తెలిపారు. బీజేపీ ఎంపీ చేడి పాశ్వాన్‌కు ఓటు వేయడానికి అర్హత లేదు. ముందు అనుమతి కోరిన ప్రకారం మొత్తం 717మంది ఢిల్లీలో ఓటు వేయాల్సి ఉండగా, 714మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారని అనూప్ మిశ్రా తెలిపారు. టీఎంసీకి చెందిన తపాస్‌పాల్, బీజేపీకి చెందిన రామచంద్ర హన్స్‌దక్, పీఎంకే ఎంపీ అంబుమణి రామ్‌దాస్ ఓటు వేయలేదని మిశ్రా వెల్లడించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య, కేంద్రమంత్రి ఉమాభారతి సహా 54మంది ఎంపీలు ఆయా రాష్ర్టాల్లో ఓటింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి తీసుకున్నారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. గుజరాత్ ఎమ్మెల్యే అయిన బీజేపీ చీఫ్ అమిత్‌షా ఢిల్లీలో ఓటుహక్కు వినియోగించుకోగా, తృణమూల్ ఎంపీలు కోల్‌కతాలో పోలింగ్‌కు హాజరయ్యారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ వేశారు. జమ్ముకశ్మీర్, మణిపూర్, త్రిపుర రాష్ర్టాలు మినహా అన్ని రాష్ర్టాల నుంచి పోలింగ్ వివరాలు అందాయని, వందశాతానికి దగ్గరగా పోలింగ్ నమోదైందని అనూప్ మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జూలై 20వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని రిటర్నింగ్ అధికారి అనూప్ మిశ్రా పేర్కొన్నారు.

ఏపీలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల రాంగ్ ఓటింగ్?
హైదరాబాద్/అమరావతి, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ వందశాతం నమోదైంది. అయితే టీడీపీకి చెందిన ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే ఆర్ జితేందర్‌గౌడ్ తప్పుగా ఓటు వేసినట్లు సమాచారం. వీరిద్దరూ బ్యాలెట్ పత్రాలపై తమ పేర్లను రాసినట్లు తెలుస్తున్నది. ఈ ఓట్లు చెల్లుతాయా? లేదా అన్నది 20న జరిగే కౌంటింగ్‌లో తేలనుంది.

128

More News

VIRAL NEWS