పీవోకేపై వైమానిక దాడులు?

Sun,February 17, 2019 02:40 AM

-అదే సరైనదంటున్న సైనికాధికారులు
-పాక్‌కు గుణపాఠం చెప్పాల్సిందేనని డిమాండ్
-సైనిక చర్యకు రాజకీయ సంకల్పం అవసరమని అభిప్రాయం
-యుద్ధానికి దారితీయొచ్చని పలువురి హెచ్చరిక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సాయుధ బలగాలు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సరిహద్దులను దాటి దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు గల అవకాశాలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధం వరకూ వెళ్లకుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్ర స్థావరాలపై ఉపరితల దాడులు చేయడం లేదా నియంత్రణ రేఖ వెంబడి కచ్చితమైన గగనతల దాడులకు దిగడం వంటి అవకాశాలను పరిశీలించాలని సీనియర్ మిలిటరీ అధికారులు సూచిస్తున్నారు. వైమానిక దాడులు నిర్వహించడమే సరైనదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. 2016 సెప్టెంబర్‌లో భారత బలగాలు ఉపరితల ఆధారిత లక్షిత దాడులు (సర్జికల్ స్రైక్స్) నిర్వహించి పాక్‌ను విస్మయపరిచిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే సుఖోయ్-30ఎమ్‌కేఐ, మిరాజ్-2000, జాగ్వార్స్ వంటి యుద్ధ విమానాల ద్వారా నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ఉగ్ర స్థావరాలను, లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇలాంటి వైమానిక దాడులకు తక్కువ సమయంలోనే సిద్ధం కావొచ్చని రక్షణ రంగ అధికారి ఒకరు చెప్పారు.

బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ ద్వారా పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర స్థావరాలు, ల్యాంచ్ ప్యాడ్‌లపై దాడులు చేయొచ్చని సైనికాధికారులు చెబుతున్నారు. పాక్ నుంచి ప్రతిదాడులు ఎదురయ్యే పక్షంలో ఇలాంటి చర్యలు చేపట్టాలంటే రాజకీయ సంకల్పం అవసరమని పేర్కొంటున్నారు. సమయం, ప్రాంతం, వినియోగించే ఆయుధ వ్యవస్థను బట్టి మనముందు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే మన లక్ష్యం పీవోకేలోని ఉగ్రస్థావరాలు కావాలి కానీ, పాక్ ప్రధాన భూభాగం, పాక్ పౌరులు కాకూడదు అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పుల్వామా ఘటన తీవ్ర విషాదం. దీనిలో పాక్ హస్తం ఉంది. ఇలాంటి దాడులను మనం ఎంతకాలం భరించాలి. కఠిన చర్యలపై మనం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది అని 2016లో లక్షిత దాడులను పర్యవేక్షించిన లెప్టినెంట్ జనరల్ హుడా (రిటైర్డ్) అభిప్రాయపడ్డారు. పాక్‌తో దౌత్యం ఫలితాన్నివ్వడం లేదు. ఆ దేశానికి చైనా మద్దతునిస్తున్నది. మూడేండ్లకొకసారి సర్జికల్ ైస్ట్రెక్స్ నిర్వహించినా పాక్ వైఖరిలో మార్పు రాదు. భారత్ దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి అని ఆయన పేర్కొన్నారు. అయితే సైనిక చర్యపై పలువురు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పరస్పరం నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. పాక్ తన వాయు రక్షణ సంపత్తిని మొత్తం భారత సరిహద్దుల వద్ద మోహరించింది. క్షణాల్లో పరిస్థితులు చేయిదాటి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పూర్తి కసరత్తు తరువాతే చర్యలకు దిగాలని నిపుణులు సూచిస్తున్నారు.

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles