గాడ్సే దేశభక్తుడు!


Fri,May 17, 2019 02:52 AM

Pragya Singh Thakur calls Nathuram Godse a patriot

- బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్య
- ఖండించిన కమలం పార్టీ.. బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచన
- అమరవీరులను అవమానించడం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది: కాంగ్రెస్
- ఎవరినైనా బాధపెట్ట్టి ఉంటే క్షమించాలని కోరిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్


అగార్ మాల్వా (ఎంపీ), మే 16: బీజేపీ భోపాల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సేను దేశభక్తుడుగా ఆమె అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నష్ట నివారణకు దిగిన బీజేపీ అధిష్ఠానం ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తమ పార్టీ నాయకురాలికి సూచించింది. ప్రజ్ఞాసింగ్ ప్రకటనతో తాము ఏకీభవించడం లేదని బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ హంతకుడు దేశభక్తుడు కాలేడు అని ప్రకటించింది. పార్టీ నేతల ఆదేశం మేరకు.. కొన్ని గంటల అనంతరం స్పందించిన ప్రజ్ఞా ఠాకూర్ నా ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదు. ఎవరైనా బాధపడి ఉంటే వారిని నేను క్షమాపణ కోరుతున్నాను అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని అగార్ ఆల్వాలో గురువారం జరిగిన రోడ్‌షోలో ప్రజ్ఞాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక టీవీ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, నాథురాం గాడ్సే గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో.. ఎప్పుడూ దేశభక్తుడే అని వ్యాఖ్యానించారు.

గాడ్సేను టెర్రరిస్టు అని చెప్పే వారు తమను తాము సమీక్షించుకోవాలని అన్నారు. వారికి ఈ ఎన్నికల్లో దీటైన జవాబు లభిస్తుందని చెప్పారు. గాడ్సేనుద్దేశించి ఇటీవల మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ఒక ప్రశ్నకు ప్రజ్ఞాసింగ్ పై విధంగా స్పందించారు. ఈ నెల 12న తమిళనాడులోని అరవకురిచిలో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో కమల్‌హాసన్ మాట్లాడుతూ, ఇది ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. నేను గాంధీ విగ్రహం ముందు నిల్చొని చెప్తున్నాను. స్వతంత్ర భారతంలో మొదటి తీవ్రవాది హిందువు. అతని పేరు నాథురాం గాడ్సే అని పేర్కొన్నారు. ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆమె ప్రతినిధి, బీజేపీ నాయకుడు డాక్టర్ హితేశ్ బాజ్‌పాయ్ పీటీఐతో మాట్లాడుతూ, ప్రజ్ఞాజీ క్షమాపణలు చెప్పారు.. వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు అని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్‌సింగ్‌ను ఆమె క్షమాపణ కోరారా అని ప్రశ్నించగా, ఆమె క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకున్నారు అంటూ బాజ్‌పాయ్ సమాధానం దాటవేశారు.
pragya1

బీజేపీ ఖండన

ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. మహాత్మాగాంధీ విషయంలో ఆమె ప్రకటనతో మేము పూర్తిగా విభేదిస్తున్నాం. ఆమె ప్రకటనను ఖండిస్తున్నాం. అలా ఎందుకు మాట్లాడారో ఆమె నుంచి వివరణ తీసుకుంటాం. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్తే సహేతుకంగా ఉంటుంది అని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజ్ఞాసింగ్ బీజేపీని ఇరుకున పెట్టడం ఇది మొదటిసారి కాదు. ముంబై పోలీస్ అధికారి దివంగత హేమంత్ కర్కరే విషయంలో కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తరువాత క్షమాపణ చెప్పారు. 2008లో ముంబై ఉగ్రదాడుల్లో హేమంత్ కర్కరే ఉగ్రవాదుల తూటాలకు బలైన సంగతి తెలిసిందే. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను అరెస్టు చేసినందుకు, తాను శపించానని, అందువల్లనే కర్కరే మృతి చెందాడని ప్రజ్ఞ పేర్కొన్నారు.
Surjewala

మోదీ క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్

ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమరులైన వారిని అవమానించడం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉందని విమర్శించింది. ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది. బీజేపీ వారు గాడ్సే వారసులన్నది సుస్పష్టం. గాడ్సేను దేశభక్తుడని, హేమంత్ కర్కరేను దేశద్రోహి అని వారంటారు. హింసా సంస్కృతి, అమరవీరులను అవమానించడం బీజేపీ డీఎన్‌ఏలోనే ఉంది అని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. మోదీ-అమిత్‌షాకు ఇష్టమైన బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్, గాంధీ హంతకుడు నాథురాం గాడ్సేను దేశభక్తుడని పేర్కొనడం ద్వారా మరోసారి దేశమంతటినీ అవమానించారు అంటూ ధ్వజమెత్తారు. గాంధేయ విధానాలను అవమానించేందుకు జరుగుతున్న కుట్ర ఇది. ఇది (ప్రజ్ఞా వ్యాఖ్యలు) క్షమించరాని నేరం. ఆమె వ్యాఖ్యలను జాతి ఎన్నటికీ క్షమించదు అని పేర్కొన్నారు. మోదీకి కొంచెమైనా విచక్షణ జ్ఞానం ఉంటే.. ప్రజ్ఞా ఠాకూర్‌పై చర్యలు తీసుకొని.. ఆయనే స్వయంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

గాడ్సేను ప్రశంసించడం దేశభక్తి కాదు, అది దేశద్రోహమని ప్రజ్ఞాసింగ్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఇందుకు మోదీ, అమిత్‌షా, బీజేపీ మధ్యప్రదేశ్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అసలు రంగును ఇప్పుడు దేశ ప్రజలు చూడగలుగుతున్నారని ఎన్సీపీ వ్యాఖ్యానించింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞాసింగ్ కూడా తీవ్రవాది గాడ్సే కూటమికి చెందినవారేనని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర అవహద్ ట్వీట్ చేశారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, జాతిపితను చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడైతే.. మరి మహాత్మాగాంధి దేశ ద్రోహి అవుతారా? అని ప్రశ్నించారు.

నివేదిక ఇవ్వండి: ఈసీ

మహాత్మాగాంధీ హంతకుడు నాథురాం గాడ్సేను దేశభక్తుడు అంటూ బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ (ఈసీ) పరిగణనలోకి తీసుకుంది. ఆమె వ్యాఖ్యలపై శుక్రవారంలోగా వాస్తవ నివేదికను ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ కోరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ktr

ప్రజ్ఞాసింగ్ క్షమాపణ చెప్పాలి

- టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథురాంగాడ్సేను భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ దేశభక్తుడిగా పేర్కొనడం గర్హనీయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలిపారు. తన వ్యాఖ్యలకు గాను ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలోనైనా, భవిష్యత్తులోనైనా గాడ్సే దేశభక్తుడేనంటూ ఆమె వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలైనా ఉండొచ్చుగానీ.. ప్రతిదానికీ హద్దులుంటాయన్నారు. ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు యావత్ జాతికి ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles