పారాహుషార్

Fri,November 8, 2019 03:19 AM

-అయోధ్య పై తుదితీర్పు నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు
-అన్ని రాష్ర్టాల్లో భద్రత పెంపు
-యూపీకి నాలుగువేల మంది అదనపు సిబ్బంది తరలింపు
-నిత్యావసరాలు, మందులు సమకూర్చుకుంటున్న అయోధ్యవాసులు
-మొదటిసారిగా శిల్పాల తయారీని నిలిపివేసిన వీహెచ్‌పీ

న్యూఢిల్లీ/అయోధ్య, నవంబర్ 7: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఈ నెల 17వ తేదీలోగా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, సున్నిత ప్రాంతాల్లో భద్రత పెంచాలని గురువారం సూచించింది. అయోధ్యలో మోహరించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్‌కు అదనంగా నాలుగువేల మంది పారా మిలిటరీ సిబ్బందిని తరలించింది. మరోవైపు అయోధ్య నగరంలో ఉత్కంఠ నెలకొంటున్నది. స్థానికులు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ర్టాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలిటరీ బలగాలను సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. హిందూ, ముస్లిం వర్గాల నేతలు, ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా సంయమనం పాటించాలని కోరుతున్నారు. తీర్పు అనుకూలంగా వస్తే సంబురాలు చేసుకోబోమని, పటాకులు కాల్చడం, రంగులు చల్లుకోవడం వంటివి చేయమని, వ్యతిరేకంగా వస్తే ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టమని, నినాదాలు చేయబోమని వివిధ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు అని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావు అన్నారు.

అప్రమత్తమైన రైల్వే శాఖ

రేల్వేశాఖ ముందుజాగ్రత్తగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అన్ని రైళ్లలో భద్రత పెంచాలని ఆదేశించారు. స్టేషన్ల సమీపంలోని ప్రార్థనా మందిరాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణికుల సాంద్రత అధికంగా ఉండే 78 రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. రాత్రుళ్లు అన్ని లైట్లూ వెలుగుతూనే ఉండాలని ఆదేశించారు. వీవీఐపీలు, పారా మిలిటరీ సిబ్బంది పర్యటన వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ లీక్ చేయవద్దని స్పష్టంచేశారు.
AyodhyaCase1

అయోధ్యలో ఉత్కంఠ

అయోధ్య నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. ఓవైపు తీర్పు ప్రభావం తమపై ఉండబోదని ధీమా వ్యక్తం చేస్తూనే.. మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసరాలను, మందులను నిల్వ చేసుకుంటున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొందరు పెండ్లిళ్లు రద్దు చేసుకోవడమో లేదా పెండ్లి వేదికలను జిల్లా అవతలికి మార్చడమో చేస్తున్నారు. 1990లో చెలరేగిన ఘర్షణలు, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతర పరిస్థితులు, 2010లో హైకోర్టు తీర్పు సందర్భంగా నెలకొన్న ఉత్కంఠ, గత ఏడాది నవంబర్‌లో అయోధ్యలో శివసేన ప్రదర్శన వంటి సందర్భాలను నేను ప్రత్యక్షంగా చూశాను. అయోధ్య ప్రజలు ఒకరికొకరు హాని చేసుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. అవతలి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే ఘర్షణలు జరుగుతున్నాయి అని అయోధ్య కేసు కక్షిదారుల్లో ఒకరైన ఉమర్ ఫరూఖ్ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులే ఉన్నాయి. ప్రజలు భయపడటం లేదు. కానీ కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అందుకే అదనంగా వారం, పదిరోజులకు సరిపడా మందులు రాయాలని నన్ను కోరుతున్నారు అని నగరానికి చెందిన డాక్టర్ ఇంద్రనీల్ బెనర్జీ పేర్కొన్నారు. మతాలతో సంబంధం లేకుండా నగరప్రజలంతా శాంతిని కోరుకుంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమలో తాము కొట్టుకోవద్దని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మందిర వివాదం అయోధ్యకు మంచికన్నా చేటే ఎక్కువ చేసిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వ్యాపారులు ఫైజాబాద్‌కు తరలిపోయారని, పెట్టుబడిదారులు ఇటువైపే చూడటం లేదని వాపోయారు. తీర్పు అనుకూలంగా రాకుంటే ఘర్షణలు చెలరేగుతాయని, ఫలానా ప్రాంతంపై దాడులు జరుగుతాయని వస్తున్న వార్తలతో ప్రజలు కొంత కలత చెందుతున్నారు. అయోధ్య కలెక్టర్ అనుజ్ కే జా మాట్లాడుతూ కొన్ని వారాలుగా హిందూ, ముస్లిం సంస్థల ప్రతినిధులతో, నేతలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

30 ఏండ్లలో తొలిసారిగా..

విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తొలిసారిగా మందిర శిల్పాల తయారీని నిలిపివేసింది. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మి స్తామంటూ వీహెచ్‌పీ 1990లో అయోధ్యలో నిర్మాణ్ కార్యశాలను ప్రారంభించింది. మందిరం ఆకృతిని విడుదల చేసింది. దాదాపు 30 ఏండ్లుగా రాతి శిల్పాలను, ఇతర నిర్మాణాలను రూపొందిస్తున్నది. ప్రస్తుతం నగరంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పనులను మొట్టమొదటిసారిగా నిలిపివేసినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. శిల్పులు ఇండ్లకు వెళ్లిపోయారన్నారు. పనులను మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలో రామ జన్మభూమి న్యాస్ నిర్ణయిస్తుందన్నారు. తీర్పు ఎలా వచ్చినా శ్రేణులంతా సంయమనంతో ఉండాలని, వేడుకలు గానీ, నిరసనలు గానీ నిర్వహించొద్దని సూచించారు.

అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు

అయోధ్యలో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. వేడుకలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం ఉన్నది. ఇది డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నది. ఫైజాబాద్ జిల్లాను రెడ్, యెల్లో, గ్రీన్, బ్లూ సెక్యూరిటీ జోన్లుగా విభజించారు. ఇందులో రెడ్, యెల్లో జోన్లు సున్నిత ప్రాంతాలు. వీటి భద్రతను పారామిలిటరీ బలగాలకు, గ్రీన్, బ్లూ జోన్ల భద్రతను సివిల్ పోలీసులకు అప్పగించారు. అయోధ్యలో భద్రత కోసం అదనపు డీజీపీ ర్యాంకు అధికారిని ఇంచార్జిగా నియమించారు. ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వివాదాస్పద స్థలానికి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సందేశాలను లైక్ చేసినా, ఫార్వర్డ్ చేసినా జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. 1600 గ్రామాల నుంచి ఎంపిక చేసిన 16వేల మంది వలంటటీ ర్లను యాప్‌కు అనుసంధానించారు. అయోధ్యలోని స్కూళ్లను తాత్కాలికంగా జైళ్లుగా మార్చాలని, అనుమానితులను వాటిల్లో నిర్బంధించాలనే ప్రతిపాదన కూడా ఉన్నదని పోలీస్ వర్గాలు తెలిపాయి.

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles