ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండSat,January 13, 2018 02:22 AM

-యువత పది మందికి ఉద్యోగం ఇచ్చేలా ఎదుగాలి
-ప్రధాని మోదీ పిలుపు

modi
న్యూఢిల్లీ/నొయిడా, జనవరి 12: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. యువత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా పది మందికి ఉద్యోగం ఇచ్చేలా ఎదుగాలని సూచించారు. సమాజంలో ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవడానికి యువత ప్రయత్నించాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. దేశానికి ఉపయోగపడే ఆలోచనలను, కొత్త ఆవిష్కరణలను యువత చేపట్టాలని కోరారు. 22వ జాతీయ యువజనోత్సవాలను పురస్కరించుకొని ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రేటర్ నోయిడాలో ఉన్న గౌతమ బుద్ధ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. ముందుగా ఒక వ్యక్తి మంచి పనిని ప్రారంభిస్తే అతడి వెంట మరో పదిమంది వస్తారు.

ఆ పనిని ప్రారంభించండి. భయపడకండి. వినూత్న ఆవిష్కరణలు చేపట్టండి. మీకు ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుంది. బ్యాంకు గ్యారెంటీలుగానీ, రుణాలు గానీ ఇలా ఎలాంటి సహాయ సహకారాలకైనా ప్రభుత్వం సిద్ధమే అని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సహాయ సహకారాలు అందిచడానికి, రుణాలు అందజేయడానికి ముద్రా పథకం, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఫండ్స్ వంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని, వీటిని ఉపయోగించుకొని నూతన ఆవిష్కరణలను ప్రారంభించాలని ప్రధాని మోదీ సూచించారు. విద్యార్థులు, ప్రజలు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, ఆరోగ్య జీవితానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.

210

More News

VIRAL NEWS