సహకరించండి


Mon,June 17, 2019 02:40 AM

PM Narendra Modi Party Chiefs To Meet On June 19 One Nation One Election On Agenda

-పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనిద్దాం
-విభేదాలను పక్కనపెట్టి ప్రజాసమస్యలపై చర్చిద్దాం
-అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ పిలుపు
-జమ్ముకశ్మీర్ ఎన్నికలు, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చించాలన్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ప్రజాసమస్యలపై చర్చించాలని పిలుపునిచ్చారు. సమావేశాలకు ఒకరోజు ముందు ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత తావర్‌చంద్ గెహ్లాట్, ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, కే సురేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మనం ప్రజల కోసం ఉన్నాం. సమావేశాలకు ఆటంకం కలిగిస్తే ప్రజలు హర్షించరు. కాబట్టి అన్ని పార్టీలు విబేధాలను పక్కనపెట్టి దేశాభివృద్ధి దిశగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి అని కోరారు. 2022 నాటికి నవ భారతాన్ని నిర్మించాలని, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలను కేంద్రం గౌరవిస్తుందని, ప్రాధాన్య క్రమంలో పార్లమెంట్‌లో చర్చిద్దామని స్పష్టం చేశారు. మనల్ని నమ్మి ఓటేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామో లేదో ఎంపీలందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 16వ లోక్‌సభ ముగియడంతో దాదాపు 46 ఆర్డినెన్స్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ సహా దాదాపు 10 బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
modi
అయితే అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రతిపక్ష పార్టీల నేతలు పలు అంశాలపై చర్చ జరుగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, కరువు, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను లేవనెత్తింది. వీటితోపాటు జమ్ముకశ్మీర్‌లో త్వరగా అసెంబ్లీ ఎన్నికలు జరుపాలని డిమాండ్ చేసింది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా బిల్లుకు ఈ సమావేశాల్లోనే ఆమోదం పలుకాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు సూచించారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని బలహీనం చేస్తున్నదని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ర్టాలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరమని, మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

నిరుద్యోగంపై దృష్టిపెట్టాలి

కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. మేం కొత్త ప్రభుత్వాన్ని అభినందించాం. అదే సమయంలో బీజేపీ భావజాలంపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాం. రైతులు, కరువు, తాగునీటి ఎద్దడి, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించాం. మేము ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషిచేస్తాం అని పేర్కొన్నారు. పెరుగుతున్న నిరుద్యోగితాశాతంపై ప్రభుత్వం వెంటనే దృష్టిసారించాలని డిమాండ్ చేశామన్నారు.

మీడియా స్వేచ్ఛ అంశాన్నీ తాము ప్రస్తావనకు తెచ్చామని, పాత్రికేయులతో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశామన్నారు. లౌకికవాదానికి కాంగ్రెస్ పునాదిరాయి వేసిందని, దానిని కాపాడేందుకు కృషిచేస్తామని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలి. కేంద్రం ఓవైపు కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించే వాతావరణం లేదని అంటున్నది. మరోవైపు గత ఏడాది పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని చెప్తున్నది. లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించగలిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేరు అని ఆజాద్ ప్రశ్నించారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు కాబట్టే ఎన్నికలు జరుపడం లేదని ఆరోపించారు.

610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles