ఘనంగా దీపావళి


Fri,November 9, 2018 01:37 AM

PM Narendra Modi Celebrates Diwali With Indian Army 2018

-సైనికులతో కలిసి పండుగ చేసుకున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
-పటాకుల వాడకంపై పలు చోట్ల సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
-శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

న్యూఢిల్లీ/కేదార్‌నాథ్, ఇటానగర్, నవంబర్ 8: దేశవ్యాప్తంగా బుధవారం దీపావళి పండుగ ఘనంగా జరిగింది. దీపాలు, లైట్ల అలంకరణతో ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి పండుగను సరిహద్దుల్లో సైనికులతో కలిసి జరుపుకున్నారు. సరిహద్దులో పాక్, భారత సైనికులు మిఠాయిలను ఇచ్చిపుచ్చుకున్నారు. పండుగ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య ప్రజలు పటాకులను కాల్చారు. కేవలం రెండు గంటలు మాత్రమే పటాకులను కాల్చాలని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో పలు చోట్ల అమలు కాలేదు. ఇక ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీని పటాకుల కాలుష్యం కమ్మేసింది. బుధవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీలో వాయు కాలుష్య సూచిక మీద తీవ్రత 302గా నమోదైంది. పండుగ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

nirmalasitharaman
కాలుష్య రహితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి, ఐక్యతను సాధించడానికి దీపావళి పండుగ మంచి అవకాశం. చీకటిని జయించి జీవితాన్ని వెలుగులమయం చేసుకోవడానికి సూచికలాంటిది దీపావళి పండుగ. ప్రజలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలి అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ భారత్-చైనా సరిహద్దులో ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు (సైనికులు) ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అంకితభావంతో విధులు నిర్వర్తించడం గొప్ప విషయం. 125 కోట్ల మంది ప్రజల జీవితాలను, వారి కలలను కాపాడుతున్నారు.

pak
ఓ దీపం తన వెలుగుల ద్వారా సమాజానికి ఎలాగైతే వెలుతురును ప్రసాదిస్తున్నదో.. సైనికులు కూడా ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా సంతోషంగా జీవించడానికి కష్టపడుతున్నారు అంటూ జవాన్ల మీద ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ వెంట ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లోని పరమశివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇక్కడ ఉన్న పలు సైనిక పోస్టులను ఆమె సందర్శించారు. అట్టారి-వాఘా సరిహద్దులో భారత్-పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. హిందూ సోదరులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్వీట్ చేశారు. భారత్, అమెరికా మధ్య స్నేహాన్ని ప్రతిబింబించే ప్రత్యేక సందర్భం దీపావళి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles