ప్రధాని కలిసి పనిచేద్దామన్నారు

Tue,December 3, 2019 03:21 AM

-సాధ్యంకాదని చెప్పాను.. సుప్రియను కేంద్రమంత్రిని చేస్తామన్నారు
-నన్ను రాష్ట్రపతిని చేస్తామన్న ప్రతిపాదనేదీ రాలేదు
-అజిత్ తిరుగుబాటును అణచివేస్తానని ఉద్ధవ్‌కు మాటిచ్చా
-ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడి

ముంబై, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్రమోదీ తనతో కలిసి పని చేద్దాం అని ప్రతిపాదించారని, కానీ తాను అందుకు తిరస్కరించానని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తెలిపారు. కలిసి పని చేయడం సాధ్యం కాదని మోదీకి స్పష్టం చేసినట్లు ఒక మరాఠా టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పవార్ అన్నారు. మోదీ కలసి పని చేద్దామని నాతో ప్రతిపాదించారు. కానీ, నేను మన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయి అలాగే కొనసాగుతాయి. కానీ కలిసి పని చేయడం మాత్రం సాధ్యం కాదు అని చెప్పానన్నా రు. తనను రాష్ట్రపతిని చేస్తామని మోదీ సర్కార్ భావించినట్లు వచ్చిన వార్తలను పవార్ తోసిపుచ్చారు. కానీ తన కూతురు సుప్రియా (సూలే)ను మోదీ క్యాబినెట్‌లో చేర్చుకునేందుకు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. ఉద్ధవ్‌ఠాక్రేతోపాటు అజిత్ పవార్ ప్రమాణం చేయరాదన్నది ఎన్సీపీ నేతలు కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. అకస్మాత్‌గా ఫడ్నవీస్‌కు మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ తిరుగుబాటును అణిచేస్తానని, తనను విశ్వసించాలని ఉద్ధవ్ ఠాక్రేను కోరినట్లు శరద్ పవార్ తెలిపారు. ఫడ్నవీస్‌కు మద్దతునిచ్చే అంశాన్ని పునరాలోచించుకోవాలని అజిత్ పవార్‌ను తమ కుటుంబ సభ్యులు కోరిన సంగతి తనకు తెలియదన్నారు. కానీ అజిత్ తప్పు చేశారని కుటుంబం భావించిందని శరద్ పవార్ చెప్పారు. ఆయన చేసింది క్షమించరాని తప్పిదం అని నేను తర్వాత అజిత్‌కు చెప్పాను. ఎవరు చేసినా పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. అందుకు నువ్వు మినహాయింపు కాదు అని తేల్చి చెప్పానన్నారు. మెజారిటీ ఎన్సీపీ నేతలు తనపై విశ్వాసం ప్రదర్శించడం వల్లే తాను విజయవంతమయ్యానని పవార్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని పవార్ కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఊహాగానాలు అప్పట్లో వచ్చాయి.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles