నేడే కర్తార్‌పూర్ ప్రారంభోత్సవం

Sat,November 9, 2019 02:34 AM

-డేరా బాబా నానక్‌లో కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-నారొవల్ జిల్లాలో ప్రారంభించనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
-ఉత్సవానికి హాజరుకానున్న మాజీ ప్రధాని మన్మోహన్ సహా 550 మంది ప్రముఖులు

న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్థాన్ పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను అనుసంధానించే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం శనివారం జరుగనున్నది. ఈ చారిత్రాత్మక కారిడార్ ప్రారంభోత్సవం కోసం వేలాది మంది భారత సిక్కు యాత్రికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇరు దేశాల్లో వేరువేరుగా జరుగనున్నది. పంజాబ్‌లో గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ దగ్గర్లోని కర్తార్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు(ప్యాసింజర్ టర్మినల్ బిల్డింగ్) వద్ద ప్రధాని మోదీ శనివారం ఈ కారిడార్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కర్తార్‌పూర్‌కి వెళ్లనున్న మొదటి బృందం సభ్యులు 4.5 కి. మీ పొడవైన కారిడార్ వెంట పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ సందర్శనకు బయల్దేరుతారు. ఈ బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురీ, హర్సివ్‌ు రత్ కౌర్ బాదల్ సహా 550 మంది ప్రముఖులు ఉన్నారు.

కారిడార్ ప్రారంభోత్సవం అనంతరం డేరా బాబా నానక్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతారు. మరోవైపు, పాకిస్థాన్ పంజాబ్ రాష్ర్టం నారొవల్ జిల్లాలోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వద్ద పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా శనివారమే ఈ కారిడార్ ప్రారంభిస్తారని సమాచారం. వీసా లేకుండానే రోజుకు 5 వేల మంది భారత సిక్కు యాత్రికులు పాక్‌లోని కర్తార్‌పూర్‌ను సందర్శించవచ్చని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించేందుకు వచ్చే భారత సిక్కు యాత్రికులు నవంబర్ 9,12తేదీల్లో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ శుక్రవారం స్పష్టం చేశారు.

మళ్లీ రెచ్చగొట్టే చర్యలు

పాకిస్థాన్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను ఇటీవల సందర్శించిన ఓ భారత యాత్రికుల బృందం.. గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓ చిన్న బాంబును చూసి ఆశ్చర్యానికి లోనైంది. ఈ బాంబును సిక్కుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఖండాతో అలంకరించిన ఓ పిల్లర్‌పై పాకిస్థాన్ అధికారులు ఏర్పాటు చేశారు. దీని గురించి తెలుపుతూ ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను నాశనం చేయడానికి 1971లో భారత్ ఈ బాంబును ప్రయోగించింది. అయితే, ఆ వాహేగురు దయవల్ల గురుద్వారాకు ఏమీ కాలేదు అని రాసి ఉంది. భారత్‌లోని సిక్కులు, ఇతర మతస్థుల మధ్య అభిప్రాయబేధాలు సృష్టించడానికే పాక్ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

429
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles