ప్రశ్నించడానికి భయపడవద్దు


Tue,September 18, 2018 02:16 AM

PM Modi To Celebrate His 68th Birthday In Varanasi Today

-అభ్యాసనకు అదే కీలకం
-పాఠశాల విద్యార్థులతో ప్రధాని
-వారణాసిలో పుట్టినరోజు జరుపుకున్న మోదీ
-రాష్ట్రపతి నుంచి సామాన్యుల వరకు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

వారణాసి/న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రశ్నించడానికి ఎప్పుడూ భయపడవద్దని, అభ్యాసనకు అదే కీలక అంశమని ప్రధాని నరేంద్రమోదీ పాఠశాల విద్యార్థులకు ఉద్బోధించారు. సోమవారం తన లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో 68వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్న మోదీ ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను, ఆ తరువాత కాశీ విద్యాపీఠ్‌కు చెందిన విద్యార్థులను కలుసుకున్నారు. వారణాసి శివార్లలో ఉన్న నారూర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన మోదీ, వారిని భవిష్యత్ భారత్‌గా అభివర్ణించారు. విద్యార్థులుగా ప్రశ్నలు వేయడం ముఖ్యం. ప్రశ్నలు అడిగేందుకు ఎప్పుడూ భయపడవద్దు. క్రీడలకు ప్రాముఖ్యతనివ్వాలి. బయటకు వెళ్లి ఆడుకోవాలి అని చెప్పడంతో విద్యార్థుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. మోదీ 68వ పుట్టినరోజును పురస్కరించుకొని వారణాసిలోని 68 ప్రాంతాలలో 68 కిలోల బరువున్న 68 కేకులను కట్ చేశామని వారణాసి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నీలకంఠ తివారీ ప్పారు.
శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోదీ 68వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం సంతోషంగా జీవిస్తూ దేశ ప్రజలకు సేవ చేయడాన్ని కొనసాగించాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వివిధ రాష్ర్టాల సీఎంలు, బాలీవుడ్ ప్రముఖులు ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. చెన్నై శివార్లలోని తంబారంలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ పేదలకు బహుమతులందజేశారు.
568 కిలోల లడ్డూ ఆవిష్కరణ
ప్రధాని బర్త్‌డేను పురస్కరించుకొని కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 568 కిలోల లడ్డూను ఆవిష్కరించారు. ప్రధాని పుట్టినరోజును స్వచ్ఛతా దివస్‌గా జరుపుకుంటున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ లడ్డూను ఏర్పాటు చేసింది.

మోదీకి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి: కేసీఆర్


laddoo
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున సీఎం కే చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, దేశానికి ఆయన దీర్ఘకాలంపాటు సేవలు అందించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రధానికి సోమవారం లేఖ రాశారు.

380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles