విగ్రహాన్ని మేం నెలకొల్పుతాం


Fri,May 17, 2019 02:18 AM

PM Modi Promises Grand Vidyasagar Statue Amid Battle With Trinamool

- విద్యాసాగర్ విగ్రహ విధ్వంసానికి మమతే కారణం
- సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు యత్నాలు
- ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎంపికలో విపక్షాలు విఫలం
- ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ


మావు/చందౌలీ/మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్), మధురాపూర్ (పశ్చిమ బెంగాల్), మే 16: కోల్‌కతాలో హింసాకాండ సందర్భంగా ధ్వంసమైన పశ్చిమ బెంగాల్ ఆదర్శ పురుషుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని భారీ స్థాయిలో తామే నెలకొల్పుతామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్‌తో పాటు యూపీలోని చందౌలీ, మీర్జాపూర్, మావులో జరిగిన సభల్లో ప్రసంగించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం కోల్‌కతాలో నిర్వహించిన రోడ్‌షోలో హింసాత్మక ఘటనలు తలెత్తడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీయే కారణమని ఆయన విమర్శించారు. బెంగాల్ పోలీసులు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని, విద్యాసాగర్ విగ్రహం కూల్చివేతకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని మోదీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తనను జైలులో పెడతానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెదిరిస్తున్నారని, ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఆమె సహనాన్ని కోల్పోయారని అన్నారు.

ఓటమి తప్పదని విపక్షాలకు అర్థమైంది

ప్రత్యర్థులు తనను ఎంత ఘాటుగా విమర్శిస్తే ప్రజల్లో తన పట్ల ప్రేమాభిమానాలు అంతగా పెరుగుతున్నాయని ప్రధాని అన్నారు. ప్రస్తుతం యూపీలో ఎస్పీ, బీఎస్పీ సహా మహాకూటమిలోని అన్ని పక్షాల్లో ఆత్మవిశ్వాసం క్షీణించిందని, ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయమే ఇందుకు కారణమని అన్నారు. ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడంలో విపక్షాలు విఫలమయ్యాయన్నారు. ఈ పార్టీల నాయకులంతా బెంగళూరులో వేదికపై చేయిచేయి కలిపి ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ ప్రధాని అభ్యర్థి ఎంపిక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎవరి సొంత బాకా వారు ఊదుతున్నారు. కేవలం 8 సీట్లు, 10 సీట్లు, 20-22 సీట్లు, 30 నుంచి 36 సీట్లు ఉన్న నాయకులు ప్రధాని పదవిని చేపట్టాలని కలలు కంటున్నారు. కలలు కనడం తప్పేమీ కాదు. కానీ ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం రావాలి) అని దేశం అంటున్నది అని ఆయన పేర్కొన్నారు.

ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక

మరుగుదొడ్ల నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ఎద్దేవా చేస్తున్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌పై ఆయన నిప్పులు చెరిగారు. తమ దృష్టిలో మరుగుదొడ్లు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకలని మోదీ పేర్కొన్నారు.

243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles