అతిథులకు భారత్ ఆతిథ్యంWed,January 24, 2018 01:51 AM

W-E-F
దావోస్, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులకు భారత్ విందు ఏర్పాటు చేసింది. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఈ విందులో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ, సినీ నటుడు షారుఖ్‌ఖాన్, దర్శక నిర్మాత కరణ్‌జోహార్ తదితరులు పాల్గొన్నారు. సమోసా, కచోరీ, భారతీయ వంటకాలను ఇక్కడ వడ్డించారు.

స్విస్ అధ్యక్షునితో మోదీ భేటీ

స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్‌తో ప్రధాని మోదీ సోమవారం రాత్రి సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మోదీ స్విస్ అధ్యక్షునితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా అలైన్ బెర్సెట్ పేర్కొన్నారు. పన్ను సమాచారాన్ని పరస్పరం బదిలీ చేసుకోవడంపై కూడా ఇద్దరు నేతలు చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ప్రధాని మోదీ మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు పరస్పర ప్రయోజనాంశాలపై చర్చించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కూడా మోదీ కలుసుకున్నారు. భారత్-నెదర్లాండ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారని విదేశాంగశాఖ ప్రతినిధి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చారిత్మ్రాతక, విజయవంతమైన భాగస్వామ్యం అనంతరం ప్రధాని మోదీ తిరిగి భారత్‌కు బయలుదేరారని పేర్కొన్నారు.

వాతావరణ మార్పులపై తక్షణ చర్యలు:స్విస్ అధ్యక్షుడు

వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, పెరుగుతున్న అసమానతలపై పోరాటానికి సమిష్టి చర్యలు తీసుకోవాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం అలైన్ మాట్లాడుతూ.. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించకపోతే పేదలు, బలహీనులు బాధితులుగా మారుతారని ఆందోళన వ్యక్తంచేశారు.

180

More News

VIRAL NEWS