బీజేపీకి పునాది వాజపేయి


Fri,August 17, 2018 07:44 AM

PM Modi and President Kovind Pays Homage To Former PM Atal Bihari Vajpayee

న్యూఢిల్లీ, ఆగస్టు 16: భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగానే కాకుండా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి అటల్ బిహారీ వాజపేయి. తాను గీసుకున్న పరిధిలోనే మిగిలిపోయిన పార్టీని బలమైన రాజకీయశక్తిగా ఆయన మార్చారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీని.. 1998, 1999లో బీజేపీకి ఏకంగా అధికారంలోకి ఆయన తేగలిగారు. పార్టీని మించి వాజపేయికి అభిమానులు ఎక్కువ. ఆయనకూడా సర్వదా హిందూత్వ వాదాన్ని తన భుజాలపై మోయలేదు. 1992 డిసెంబర్‌లో బాబ్రీమసీదును కూల్చివేసినప్పుడు.. వాజపేయి విపక్ష నేతగా ఉన్నారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి బీజేపీ సీనియర్ నేతలు కరసేవలకు చర్యను సమర్థించగా, వాజపేయి మాత్రం దానిని సుస్పష్టంగా ఖండించారు. అందుకే మైనార్టీలు, ఇతర వర్గాలు వాజపేయిలో ఒక లౌకిక నేతగా చూడగలిగాయి. అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి వంటి ఫైర్‌బ్రాండ్ నేతలున్న బీజేపీకి మితవాది వాజపేయి. రైట్ పర్సన్ ఇన్‌ద రాంగ్ పార్టీ అని రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన గురించి వ్యాఖ్యానించేవారు.

రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం

1999లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐదేండ్ల పూర్తికాలంపాటు ప్రభుత్వాన్ని నడుపడం భారత రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. వాజపేయి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను బీజేపీని తటస్థవర్గాలకు దగ్గర చేశాయి. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ సంఘ్‌పరివార్ సైతం వాజపేయి నిర్ణయాలతో పలు సందర్భాల్లో విభేదించినా, ఆయన వెంటే నడువడానికి ఈ నమ్మికే కారణం. అప్పటినుంచి ఎన్నికల రాజకీయాలపై బీజేపీ చాకచక్యంగా మెలుగుతూ వచ్చింది. పలు రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది. శివసేనను బీజేపీకి చేరువ చేయడంలో వాజపేయి చూపిన చొరవ కారణంగానే, ఆ పార్టీ ఇప్పటికీ ఎన్డీయే భాగస్వామిగా, కమలం పార్టీ మిత్రపక్షంగా కొనసాతున్నదని రాజకీయవిశ్లేషకులు చెబుతారు.

గొప్ప నాయకునిగా అటల్‌జీ గుర్తుండిపోతారు

modi-Kovind-Venkaiah
స్వాతంత్య్ర భారతావనిలో ఆయన అత్యంత గొప్ప నాయకుడు అని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో.. సుపరిపాలన అందించడంలో ఆయన కృషి ఎనలేనిది. 23 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఆయన తన నాయకత్వ పటిమ, సంఘటితపర్చే శక్తిసామర్థ్యాలతో విజయవంతంగా నిడిపించారు. దేశంలో అనుసంధాన విప్లవాన్ని ప్రవేశపెట్టిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. ఆయన వ్యక్తిత్వం, వాగ్ధాటి, పనిపట్ల నిబద్ధత, స్నేహపూర్వక గుణంతో కూడిన ఆయన గొప్ప నాయకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. గురువారం ఉదయం ఆయననను పరామర్శించడానికి వెళ్లాను. ఆయన మరణవార్త ఇంత తొందరగా వినాల్సివస్తుందని ఊహించలేదు.
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

అత్యంత ఆప్తున్ని కోల్పోయాను.. మాది 65 ఏండ్ల బంధం

modi-KovindAdvaniAIIMS
వాజపేయి అద్భుత నాయకత్వ పటిమ, సమ్మోహితులను చేసే ప్రసంగ పాటవం, దేశభక్తి, కరుణ, వినయం వంటి లక్షణాలతోపాటు సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థుల మనసులను దోచుకునే సామర్థ్యం అతడిని గొప్ప నేతగా నిలిపాయి. ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌లుగా ఉన్నప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం ఎంతో గొప్పది. భారతీయ జనసంఘ్, ఎమర్జెన్సీ సమయంలో ఎదుర్కొన్న చీకటి రోజులు, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం వంటి చారిత్రాత్మక ఘటనలెన్నో నా కండ్ల ముందు కదలాడుతున్నాయి. ఆయనకు సంతాపం, బాధను వ్యక్తం చేయడానికి నాకు నోట మాట రావడం లేదు. మొట్టమొదటి కాంగ్రెసేతర కూటమిని విజయవంతంగా నడిపిన ఒక మార్గదర్శిగా నిలిచిపోతారు. ఆరేండ్లపాటు ప్రభుత్వంలో ఆయనకు సహాయకుడిగా పనిచేయడం నాకు లభించిన గొప్పగౌరవం. నా కంటే పెద్దవాడిగా ఆయన నన్ను అన్ని సందర్భల్లోనూ ప్రోత్సహించడంతోపాటు మార్గదర్శనం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది.
- లాల్‌కృష్ణ అద్వానీ, బీజేపీ దిగ్గజ నేత

ఆధునిక భారతంలో ఆయన గొప్పనేత

modi-manmohansingh
ఆధునిక భారత చరిత్రలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి దిగ్గజ నేత. ఆయన గొప్ప దేశభక్తుడు.. జీవితం మొత్తం దేశానికి సేవచేయడానికే అంకితమయ్యారు. ఆయన గొప్ప ప్రధానమంత్రి మాత్రమే కాదు.. గొప్ప పార్లమెంటేరియన్ కూడా. అద్భుతమైన ప్రసంగ పాటవం ఆయన సొంతం. ఆయన గొప్ప కవి. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆయననను అభిమానించారు.. గౌరవించారు. ఆయన తన సామర్థ్యాన్ని జాతీయంగానే కాదు అంతర్జాతీయంగా సైతం చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పొరుగుతో సహా వివిధ దేశాలతో సంబంధాలు నెలకొల్పడంలో ఆయన పాత్ర అద్వితీయం. ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. అటల్‌జీ మరణవార్త విని తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని ప్రకటిస్తున్నాను.
-మన్మోహన్‌సింగ్, మాజీ ప్రధానమంత్రి

modi-Kovindirahul
వాజపేయి మృతితో భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకొన్న ఛరిష్మా గల నాయకుడు వాజపేయి. ఎన్నో సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొని దేశానికి దిశానిర్దేశం చేశారు. ఒక పరిపక్వత కలిగిన రాజకీయ సంకీర్ణాన్ని నిర్వహించిన గొప్ప దార్శనికుడు.
- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు

modi-Amit-shah
భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి.. బీజేపీని ఓ మర్రిచెట్టులా తయారయ్యేలా పెంచేందుకు పాటుపడ్డారు. అధికారమంటే ప్రజలకు సేవ చేయడమే అని నమ్మి ఆ సిద్ధాంతానికి పాటుపడ్డారు. జాతీయ ఆసక్తిపై రాజీపడకుండా మచ్చలేని అసమాన రాజకీయ నేతగా ఎదిగారు. అందుకే వాజ్‌పేయి అంటే రాజకీయ, సాంఘిక సరిహద్దులు చెరిపేసి ప్రతీ ఒక్కరు ఆయన పట్ల ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శించారు.
-అమిత్‌షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు

modi-Mamata
వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞడు. అలాంటి వ్యక్తి మృతితో మన దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆయన మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నేను అనేక జ్ఞాపకాలను మూటగట్టుకొన్నాను. వాజ్‌పేయి మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం

modi-vidyasagar-pti
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రజా జీవితంలో భీష్మ పితామహలాంటి వారు. దేశం అత్యంత అభిమానించే, గౌరవించే నాయకుడిని కోల్పోయింది. నేను వ్యక్తిగతంగా ఆత్మీయుడిని కోల్పోయాను. వాజపేయి ప్రభుత్వ హయాంలో 1999 నుంచి 2004 వరకు కేంద్రసహాయ మంత్రిగా పనిచేశా. ఆయన ఉన్నతమైన పార్లమెంట్‌సభ్యుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. మంచి వ్యాఖ్యాత. స్నేహ స్వభావి. ప్రజాజీవితంలోకి వచ్చేందుకు వాజపేయి నాకు స్ఫూర్తి.
- విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర గవర్నర్

modi-sonia
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రజాస్వామ్య విలువల కోసం చివరివరకు కట్టుబడి నిలబడ్డ ఉన్నతమైన వ్యక్తి. అన్ని సమయాల్లోనూ ఇదే నిబద్ధతను ప్రదర్శించారు. గొప్ప వ్యక్తిత్వం, స్నేహంతో ఆయన ఎంతోమంది మనసులు దోచుకున్నారు. రాజకీయాలతోపాటు ఆయన జీవన విధానంతో ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నారు. వాజపేయి మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను. ఆయన మరణంతో శూన్యం నెలకొన్నది. వాజపేయి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకునే లక్షలాది మంది భారతీయుల్లో నేను కూడా ఒకరిని.
- సోనియాగాంధీ, యూపీఏ చైర్‌పర్సన్

1384
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles