చెన్నై కనెక్ట్‌తో బంధం బలోపేతం

Sun,October 13, 2019 03:07 AM

జిన్‌పింగ్‌తో చర్చలు ఫలప్రదం.. ప్రధాని నరేంద్రమోదీ
చెన్నై, అక్టోబర్ 12: భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మామల్లాపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫలవంతమైన చర్చలు సాగించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్‌లో పర్యటించినందుకు జిన్‌పింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలకు చెన్నై కనెక్ట్ సదస్సు మరింత ఊపునిస్తుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ తమిళం, ఇంగ్లిష్‌తోపాటు చైనీయులు మాట్లాడే మాండరిన్ భాషలో ట్వీట్‌చేశారు. మామల్లాపురంలో జిన్‌పింగ్‌తో చర్చలు కొనసాగాయి. భారత్, చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మా మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయి అని ప్రధాని శనివారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో భేటీకి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన షేర్ చేశారు. అద్భుతమైన ఆతిథ్యం అందించినందుకు తమిళనాడు సోదర సోదరీమణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


మరిచిపోలేని పర్యటన

జిన్‌పింగ్ హర్షం
భారత్ పర్యటన ఎన్నటికీ మరిచిపోలేనిదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. మీ ఆతిథ్యం నన్ను పులకింపజేసింది. నాతోపాటు నా బృందానికి కూడా ఈ పర్యటన ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది అని తెలిపారు. తనకు, మోదీకి మధ్య హృదయపూర్వకంగా చర్చలు సాగాయని చెప్పారు. మనిద్దరి మధ్య చర్చలు పూర్తి స్నేహపూర్వకంగా సాగాయి. ద్వైపాక్షిక సంబంధాలపై మనసువిప్పి మాట్లాడుకున్నాం అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మూడో భేటీకి జిన్‌పింగ్ ఆహ్వానం..

అంగీకరించిన మోదీ
వచ్చే ఏడాది మూడో అనధికారిక సమావేశానికి చైనాకు విచ్చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానానికి ప్రధాని మోదీ సమ్మతి తెలిపారు. శనివారం మామల్లాపురంలో ఇరువురు నేతల భేటీ అనంతరం విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ విషయం వెల్లడించారు. సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు, అగ్రనేతల స్థాయిలో పరస్పరం అవగాహన పెంచుకునేందుకు అనధికారిక సదస్సులు గొప్ప అవకాశంగా ఇరువురు నేతలు భావిస్తున్నారని, వుహాన్ స్ఫూర్తి, చెన్నై కనెక్ట్ తరహాలో వీటిని కొనసాగించాలని వారు నిర్ణయించారని చెప్పారు. మూడో అనధికారిక సమావేశానికి చైనాకు రావాలని ప్రధాని మోదీని జిన్‌పింగ్ ఆహ్వానించారని, అందుకు మోదీ సమ్మతి తెలిపారని ఆయన పేర్కొన్నారు. సదస్సు వేదిక, తేదీలను ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు.

457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles