మోదీ గమనిస్తున్నారు

Wed,October 23, 2019 04:13 AM

-మీడియాతో అభిజిత్ బెనర్జీ..
-భారత్‌కు క్షేత్రస్థాయి అధికారులు అవసరమని వ్యాఖ్య
-ప్రధానితో సమావేశమైన నోబెల్ విజేత

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: తనకు సంబంధించి మీడియా ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నదో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు గమనిస్తు న్నారని నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానితో తన సమావేశం ఒక జోక్‌తో ప్రారంభమైందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై అభిప్రాయం వెల్లడించాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు అభిజిత్ నేరుగా సమాధానం ఇవ్వకుండా మా సమావేశాన్ని మీడియాపై ఒక జోక్ వేయడం ద్వారా ప్రధాని ప్రారంభించారు. మీడియా నన్ను మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా ఎలా వలలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నదో చెప్పారు.

ఆయన టీవీ చూస్తారు. మీ అందరినీ గమనిస్తున్నారు. మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో కూడా ఆయనకు తెలుసు. అందువల్ల ఇక ఆపేయండి అని అభిజిత్ పేర్కొన్నారు. ప్రధానితో సమావేశం తనకు ఒక ప్రత్యేక అనుభవం అని చెప్పారు. నేలపై నివసించి, క్షేత్రస్థాయిలో జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవడం ద్వారా ఉత్తేజం పొందే అధికార వ్యవస్థ భారతదేశానికి ఎంతో అవసరమని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు.అప్పుడే జవాబుదారీతనం గల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, లేకపోతే ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలిసే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగిస్వామ్యాన్ని సంస్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి మోదీ తనకు వివరించారని తెలిపారు.

ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా స్పందించే విధంగా అధికార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారని అన్నారు. దేశం గురించి తన ఆలోచనా విధానాలను వివరించేందుకు ప్రధాని తనకు ఎంతో సమయాన్ని కేటాయించి మాట్లాడారని అభిజిత్ తెలిపారు. భారత్ ఎంతో ప్రత్యేకమైనదని, ఇక్కడ చాలామంది విధానాల గురించి చెప్తారు తప్ప, వాటి వెనుకనున్న ఆలోచనల గురించి మాట్లాడరన్నారు. పరిపాలనా వ్యవస్థను ఆయన (మోదీ) ఎలా చూస్తారో చెప్పారు. కొందరు ప్రజల అపనమ్మకం.. పాలనపై ఎటువంటి రంగులు వేస్తుందో తెలిపారు. పాలనా ప్రక్రియపై పట్టు కలిగి ఉండే వ్యవస్థలు ఎలా ఆవిర్భవిస్తాయో చెప్పారు. అది ప్రజల సమస్యలపై స్పందించే ప్రభుత్వం కాదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే అలవాటు అధికారులకు రావాలంటే.. వారిని క్షేత్రస్థాయిలోని వాస్తవాలకు దగ్గరగా ఉంచాలి అని బెనర్జీ తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికార వ్యవస్థ నేడు భారత్‌కు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అభిజిత్ భారత్‌కు గర్వకారణం: మోదీ

అభిజిత్ బెనర్జీతో తన భేటీకి సంబంధించిన ఫొటోను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీతో సమావేశం అద్భుతంగా జరిగింది. మానవ సాధికారత పట్ల ఆయన అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన సాధించిన విజయాల పట్ల భారత్ గర్విస్తున్నది అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles