మహిళా బిల్లును ఆమోదింపజేయండి


Tue,July 17, 2018 03:55 AM

Please support passage of bill on womens reservation in Parliament

-ప్రధాని మోదీకి రాహుల్‌గాంధీ లేఖ
-కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని వెల్లడి
-రాజకీయాలకతీతంతా అందరూ చేతులు కలుపాలని పిలుపు

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక లేఖ రాశారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు తమ పార్టీ బేషరతుగా మద్దతునిస్తుందని తెలిపారు. పార్లమెంట్‌లో, రాష్ర్టాల చట్టసభల్లో మహిళలు తమ స్థానం పొందే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, అనేక బహిరంగ సభల్లో మీరు మహిళా సాధికారత, ప్రజా జీవితంలో మహిళల అర్థవంతమైన భాగస్వామ్యం గురించి చెప్పారు. మహిళల పట్ల మీ నిబద్ధతను చాటుకోవడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా ఆమోదించడం కన్నా గొప్ప అవకాశం ఇంకా ఏముంటుంది? ఇందుకు రానున్న పార్లమెంట్ సమావేశాలకన్నా మంచి సమయం దొరుకదు. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం అసాధ్యమవుతుంది అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును రాజ్యసభ 2010లోనే ఆమోదించిందని, కానీ గత ఎనిమిదేండ్లుగా ఏదో ఒక కారణం చూపుతూ దానిని లోక్‌సభలో తొక్కి పెడుతున్నారని గుర్తు చేశారు.

ఆ బిల్లు విషయంలో కాంగ్రెస్ వైఖరి ఎన్నడూ మారలేదని, బీజేపీకి మాత్రం రెండో ఆలోచన ఉన్నట్టు కనిపిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. మహిళలకు సాధికారత కల్పించే విషయంలో రాజకీయాలకతీతంగా అందరం చేతులు కలుపుదాం. మార్పునకు సమయం ఆసన్నమైందన్న సందేశాన్ని అందిద్దాం. పార్లమెంట్‌లో, రాష్ర్టాల చట్ట సభల్లో మహిళలు తమ సరైన స్థానాన్ని పొందాలి. ఈ బిల్లును వ్యతిరేకించే మీ పార్టీలోని సంశయవాదులకు మీరు నచ్చజెప్తే అభినందిస్తాను. పంచాయతీ, మున్సిపల్ స్థాయిలో నాయకత్వ స్థానాన్ని అధిష్ఠించిన మహిళలు సమ్మిళిత, న్యాయవంతమైన సమాజం కోసం తమ తోటి పురుషుల కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం వారికి గుర్తు చేయండి అని రాహుల్ సూచించారు. బీజేపీ, దాని మిత్రపక్షాలకు లోక్‌సభలో మెజారిటీ ఉందని గుర్తు చేసిన రాహుల్, ఇక ఈ చారిత్రాత్మతక బిల్లు ఆమోదం పొందడానికి ప్రధానమంత్రి మద్దతు మాత్రమే అవసరమని పేర్కొన్నారు.

103

More News

VIRAL NEWS

Featured Articles