తుది సమరానికి సిద్ధం


Sun,May 19, 2019 02:48 AM

Phase 7 voting on 59 seats today to decide fate of 918 candidates including PM Modi

-నేడు సార్వత్రిక ఎన్నికల చివరి విడుత పోలింగ్
-59 స్థానాల్లో ఎన్నికలు.. బరిలో 918 మంది అభ్యర్థులు
-ఓటేయనున్న 10.01 కోట్ల మంది ఓటర్లు
-ఏర్పాట్లు పూర్తిచేసిన ఎన్నికల కమిషన్
-1.12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
-అందరి దృష్టి వారణాసి, పశ్చిమబెంగాల్‌పైనే..
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వా మ్య ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో చివరివిడుత.. ఏడోదశలో మొత్తం 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 9, బీహార్, మధ్యప్రదేశ్‌ల్లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని మోదీ సహా మొత్తం 918 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందు లో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, హర్‌దీప్ సింగ్ పూరి, రామ్ కృపాల్ యాదవ్, ఆర్కే సింగ్, ఏకే చౌబే, మనోజ్ సిన్హా, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ జాఖర్, పంజాబ్ ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు భగవంత్ మాన్, నటుడు సన్నీడియోల్ ఉన్నారు. పోలింగ్ కోసం అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు. ప్రశాంతవాతావరణంలో పోలింగ్ జరిగేలా పటిష్ఠ భద్రతాఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు భద్రత కల్పించారు.

ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గోవాలోని పనాజీ, తమిళనాడులోని సులుర్, అరవకురిచి, ఒట్టపిడరం, తిరుపరంకుండ్రం, బీహార్‌లోని డెహ్రీ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. గోవా దివంగత సీఎం పారికర్ మృతితో పనాజీ స్థానం ఖాళీ అయ్యింది.
-పంజాబ్‌లోని 13 స్థానాల్లో 278 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ)-బీజేపీ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉన్నది. కొన్నిచోట్ల ఆప్, పంజాబ్ డెమోక్రాటిక్ అలయన్స్ పార్టీ ప్రభావం కూడా కనిపిస్తున్నది.
-చండీగఢ్‌లోని ఏకైక స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్రమంత్రి పవన్‌కుమార్ బన్సల్, బీజేపీ తరఫున కిరణ్ ఖేర్ తలపడుతున్నారు.
-గత ఆరు దశల్లో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలతో నెత్తురోడుతున్న పశ్చిమబెంగాల్‌లో ఈ దఫా 9 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోటీ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండనున్నది. ఇటీవలే అమిత్‌షా రోడ్ షోలో హింసాత్మక ఘటనలతో పోలింగ్‌ను ఒకరోజు ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించడం వంటి కీలక పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే.
-బీహార్‌లో ఏడు సీట్లకు పోలింగ్ జరుగనున్నది. నలుగురు కేంద్ర మంత్రులు బరిలో ఉన్నారు. ఇక్కడ పాట్నా సాహిబ్ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ తరఫున శత్రుఘ్న సిన్హా తలపడుతున్నారు.
-జార్ఖండ్‌లోని 3 స్థానాల్లో 42 మంది బరిలో ఉన్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం శిబుసోరెన్ పోటీలో ఉన్నారు.
-మధ్యప్రదేశ్‌లో పోలింగ్ జరుగనున్న 8 స్థానాలు 2014లో బీజేపీ గెలుచుకున్నవే.
-హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం విశేషం.

kolkata

వారణాసిపైనే అందరి దృష్టి

ప్రధాని మోదీ పోటీచేస్తున్న వారణాసి నియోజకవర్గంపై అందరి దృష్టి ఉన్నది. మోదీకి పోటీగా 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధానంగా త్రిముఖపోరు నెలకొన్నది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌రాయ్, ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి శాలిని మధ్యే పోటీ ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. మోదీకి విజయం నల్లేరుమీద నడక మాత్రం కాదంటున్నా రు. యూపీలో మొత్తం 13 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనుండగా.. 2014 ఎన్నికల్లో ఇవన్నీ బీజేపీ గెలుచుకున్నవే. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా, యూబీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మరోసారి యూపీ నుంచి ఎన్నికయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

సన్నీడియోల్‌కు ఈసీ నోటీసు

బాలీవుడ్ నటుడు, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్‌కు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు జారీ చేసింది. ప్రచార సమయం ముగినప్పటికీ శుక్రవారం రాత్రి ఆయన దాదాపు 200 మందితో సమావేశమయ్యారు. అంతేగాక మాట్లాడటం కోసం మైక్‌ను కూడా ఉపయోగించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ వివరణ ఇవ్వాలంటూ నోటీసు జారీ చేసింది.

మోదీపై పరువు నష్టం దావా!

ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ శనివారం పరువు నష్టం దావా నోటీసు పంపారు. ఈ నెల 15న డైమండ్ హార్బర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రజలను తాను వేధింపులకు గురిచేస్తున్నట్టు కల్పిత ఆరోపణలు చేశారని అభిషేక్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles