డిజిటల్ రుగ్మతలు!


Sat,September 14, 2019 03:30 AM

Peoples are addicting to smartphones

- స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్న ప్రజలు
- విచ్చలవిడి వినియోగంతో శారీరక, మానసిక వ్యాధులు
- సెల్ఫీలు, టిక్‌టాక్‌ల కోసం ఆరోగ్యం పణం
- ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న ఆన్‌లైన్ ఆటలు
- ప్రాణాలు హరిస్తున్న డిజిటల్ వ్యసనం


స్మార్ట్ విప్లవం మన జీవనశైలినే మార్చేసింది. అదే సమయంలో కొత్త రుగ్మతలనూ తెచ్చి పెడుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అనూహ్యంగా విస్తరిస్తున్న ఈ సాంకేతికత.. అదే స్థాయిలో అనర్థాలనూ మోసుకొచ్చింది. రోజులో అధికభాగం డిజిటల్ తెరలకు అతుక్కుపోవడానికి, ఆన్‌లైన్‌లో గడుపడానికే కేటాయిస్తుండటంతో ఇంతకుముందెన్నడూ చూడని మానసిక, శారీరక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సోషల్ బ్రౌజింగ్ సంస్కృతి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. టిక్‌టాక్‌లు కాపురాలను కూల్చుతున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్ ఉన్మాదాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ బానిసత్వంతో పుట్టుకొస్తున్న రుగ్మతలపై ప్రత్యేక కథనం..
Smartphones1
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ ఓ వ్యసనంగా మారాయి. పెరుగుతున్న డిజిటల్ వినియోగం సరికొత్త మానసిక, శారీరక రుగ్మతలను సృష్టిస్తున్నది. ఇన్నాళ్లూ పరిసరాలు, ఆహారం, నీళ్లు.. తదితర కాలుష్యంతో రోగాల బారిన పడితే.. ఇప్పుడు స్మార్ట్ వ్యాధుల యుగంలోకి ప్రవేశించాం. విచ్చలవిడి స్మార్ట్‌ఫోన్ వాడకంతో మానసికంగా ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమితోపాటు ముఖాముఖి మాట్లాడే ధైర్యం లేకపోవడం, ముఖ్యమైన పనులను వదిలిపెట్టడం వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. మెదడుతోపాటు కీళ్లు, కండరాలు ఇతర అవయవాలపై స్మార్ట్ దుష్ప్రభావం పడుతున్నదని ఔట్‌లుక్ మ్యాగజైన్ తన కథనంలో పేర్కొన్నది.

Smartphones2

డిజిటల్ శారీరక సమస్యలు

టెక్స్ తంబ్: చాటింగ్ లేదా స్క్రీన్‌ను ఎక్కువగా స్క్రోల్ చేసేవారిలో బొటనవేళ్లలోని ప్రధాన కండరాలు ఒత్తిడికి గురై నొప్పులు వస్తాయి. ఇది వ్యసనంగా మారితే వేళ్లు శాశ్వతంగా పనిచేయడం మానేస్తాయి. ప్రస్తుతం 19 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు ఓ సర్వే వెల్లడించింది.

టెక్స్ క్లా: చాటింగ్ సమయాల్లో బొటన వేలు మినహా మిగతా నాలుగు వేళ్లను ఫోన్‌ను పట్టుకునేందుకు వినియోగిస్తాం. వేళ్లను ఎక్కువసేపు వంచి ఉంచడం వల్ల కీళ్లలో నొప్పులు మొదలవుతాయి. దీర్ఘకాలం కొనసాగితే వేళ్ల కండరాలు దెబ్బతింటాయి.

సెల్ఫీ ఎల్బో: సెల్ఫీలు ఓ వ్యసనంగా మారాయి. సెల్ఫీల కోసం చేతిని పైకెత్తి ఎక్కువ సేపు వంచి ఉంచడం వల్ల మోచేతి కీలుపై, దాని చుట్టూ ఉన్న కండరాలపై విపరీతమైన భారం పడుతుంది. ఆ నొప్పులు జీవితాంతం కొనసాగే ప్రమాదం ఉంది.

అధికంగా ఇంటర్నెట్ వాడటం వల్ల మెదడులో కలిగే మార్పులు తెలుసుకొనేందుకు నిపుణులు జరిపిన పరిశోధనల్లో విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఇంటర్నెట్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైనవారిలో మెదడు పనితీరు మందగిస్తున్నదని, కొన్ని రసాయనాల విడుదల ఆగిపోయిందని తేలింది.

టెక్స్ నెక్: చాటింగ్ సమయాల్లో ఎక్కువసేపు మెడను వంచి స్క్రీన్‌ను చూడటం వల్ల మెడ ఎముకపై ఒత్తిడి పెరుగుతుంది. కొన్నాళ్లకు ఎముకలు దెబ్బతింటాయి.

ఆక్సిపిటల్ న్యూరల్జియా: ఫోన్‌లో మునిగిపోయి ఇష్టం వచ్చిన భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై భారం పడుతుంది. వెన్నుపూసలు ఒకదానితో ఒకటి రాపిడికి గురవుతాయి. దీంతో వాటి మధ్య నుంచి వచ్చే వెన్నునాడులపై ఒత్తిడిపడుతుంది. ఫలితంగా వాటికి అనుసంధానమయ్యే అవయవాల పనితీరు దెబ్బతింటుంది.
Smartphones3

మరణశాసనాలు

స్మార్ట్ విప్లవం సరికొత్త మరణశాసనంగా మారింది. ఫోన్ మాయలోపడి ప్రాణాలు కోల్పోయినవారు, ప్రాణాలు తీసినవారు ఎందరో ఉన్నారు. ఇటీవలే కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పబ్‌జీ గేమ్ ఆడనివ్వడం లేదని ఓ కొడుకు కన్నతండ్రి తలను నరికేశాడు. ఓ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీ మరణాల్లో సగానికిపైగా భారత్‌లోనే నమోదవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ దుష్ప్రభావాలకు ఇవి మచ్చుతునకలు మాత్రమే.

మన చేతుల్లోనే పరిష్కారం

ఓ సర్వే ప్రకారం 47 శాతం మందికి అవసరానికి మించి స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నామని తెలుసు. అయినా వదిలించుకోలేకపోతున్నారు. ఈ మాయ నుంచి బయటపడటం మన చేతుల్లోనే ఉంది. ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. సోషల్ మీడియాలో చాటింగ్ బదులు కుటుంబం, స్నేహితులతో గడపాలి. మెసేజ్ కన్నా.. నేరుగా ఫోన్ చేసి మాట్లాడటం ఉత్తమం. దగ్గరలో ఉంటే నేరుగా కలవాలి. ఇంటర్నెట్ వాడకం శృతి మించితే కౌన్సిలింగ్ ఇప్పించాలి.
Smartphones4

బానిసలుగా మారిపోయాం

ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా, జపాన్ ప్రభుత్వాలు ఇంటర్నెట్ వ్యసనాన్ని ఓ రుగ్మతగా ప్రకటించాయి. ఈ ఏడాది మే నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విపరీతంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడటాన్ని ఓ వ్యసనంగా ప్రకటించింది. కానీ.. మన దగ్గర ఇంకా మేలుకోవడం లేదు. దేశంలో 119 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. వీరిలో 56 కోట్ల మంది కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది. 31 కోట్ల మందికి సోషల్ మీడియాలో ఖాతాలున్నాయి. వీరిలో అత్యధికశాతం మంది వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్స్, ఎమోజీల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డేటాను వినియోగిస్తున్నది భారతీయులే. సగటున రోజుకు ఒక జీబీ డేటా వినియోగిస్తున్నారు. వీరిలో సగం మంది ఇంటర్నెట్ లేకుండా ఐదు గంటలు కూడా ఉండలేరట. ఏడాదికి 50 గంటలు బ్రౌజింగ్‌లోనే కాలం గడుపుతున్నారట.
Smartphones5
ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 150 సార్లు ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారు రోజుకు 1.29 గంటలపాటు పాటలు వింటుంటే 52 నిమిషాలు వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్నారు గరిష్ఠంగా కొన్ని ఫోన్లలో ఏకంగా 200 యాప్‌లను వినియోగిస్తున్నారు ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రైవింగ్‌లో ఉండగా కాల్స్, మెసేజెస్ చేస్తున్నారు
56 శాతం మంది ఫోన్‌ను తల దగ్గరే పెట్టుకొని పడుకొంటున్నారు


ముంచుకొచ్చే మానసిక సమస్యలు

1. ఫోమో లేదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్: మనకు తెలియకుండా ఏదో జరిగిపోతోందని.. దాన్ని మనం మిస్ అవుతున్నామనే భావన. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకారం ఫోమో బారినపడినవారిలో అసంతృప్తి, ఒత్తిడి, సామాజిక ఆందోళన కనిపిస్తాయి. ఫోమో అనే పదాన్ని 2014లో ఆక్స్‌ఫర్డ్
డిక్షనరీలో చేర్చారు.
2. పాంటమ్ రింగింగ్ సిండ్రోమ్: మనకు కాల్ రాకపోయినా.. ఫోన్ మోగుతున్నట్టు భ్రమించడం. సెల్‌ఫోన్ వినియోగదారుల్లో 90 శాతానికిపైగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
3. నోమో ఫోబియా: ఫోన్ మన దగ్గర లేకపోయినా.. దగ్గరున్న ఫోన్‌ను వినియోగించలేకపోయినా ఒత్తిడికి లోనవ్వడం.
4. సైబర్ సిక్‌నెస్: ఎక్కువగా డిస్‌ప్లేను చూడటం వల్ల వాంతులు, వికారం, ఎక్కువగా చెమటలు పట్టడం.
5. ఫేస్‌బుక్ డిప్రెషన్: సోషల్ మీడియాలో మనకు తెలిసిన వారు కుటుంబంతోనో, స్నేహితులతోనో, బంధువులతోనే సరదాగా గడిపిన ఫొటోలను షేర్ చేస్తుంటే ప్రపంచంలో నేను తప్ప ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు అనే భావనలోకి కూరుకుపోవడం. సోషల్ మీడియాలో ఎంతసేపు గడుపుతారనే దానిని బట్టి ఈ వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుంది.
6. ఇంటర్నెట్ అడిక్షన్ డిజార్డర్: ప్రపంచాన్ని మరిచిపోయి రోజంతా ఇంటర్నెట్‌కే అంకితం కావడం.
7. ఆన్‌లైన్ గేమింగ్ అడిక్షన్: ఆన్‌లైన్ ఆటలకు బానిస కావడం. వీరిలో మానసిక ఒత్తిడి, ఉన్మాదం పెరిగిపోతుంటాయి. ఇది జూదంలాంటి వ్యసనమేనని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
8. సైబర్ కాండ్రియా: కొందరు శరీరంలో చిన్న మార్పు కలిగినా కారణాలను ఇంటర్నెట్‌లో వెతుకుతూ ఉంటారు. అందులో వచ్చే కొత్త కొత్త వ్యాధులను తమకు అన్వయించుకొని భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు నీరసం వల్ల చెమట వచ్చినా.. ఇంటర్నెట్‌లో వెతికి గుండెపోటుగా భ్రమిస్తుంటారు.
9. గూగుల్ ఎఫెక్ట్: గూగుల్‌పై అతిగా ఆధారపడటం. ప్రతిదానికి గూగుల్‌లో వెతుకడం అలవాటయ్యి.. చిన్న చిన్న విషయాలను కూడా జ్ఞాపకం ఉంచుకోకపోవడం.
10. టెక్నోఫెరెన్స్: ఆన్‌లైన్ స్నేహాల మోజులో కుటుంబం, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కలవారికి దూరం కావడం.

1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles