వ్యతిరేకిస్తే.. చంపడమేనా?Fri,October 13, 2017 02:46 AM

- ఈ ధోరణి ప్రమాదకరం.. దేశానికి అప్రతిష్ఠ
- హంతకులకు సంస్థాగత మద్దతు, నిధులు, ఆయుధాలు లభిస్తున్నాయి
- వారిని పట్టుకోవడాన్ని దర్యాప్తు సంస్థలు సవాల్‌గా తీసుకోవాలి
- పన్సారే, దభోల్కర్ హత్య కేసుల విచారణలో బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
Bombay-High-court
ముంబై, అక్టోబర్ 12: ప్రశ్నించేవారిని, వ్యతిరేకులను, ఉదార విలువలను తుదముట్టించే ప్రమాదకర ధోరణి కొనసాగుతున్నదని, ఇది దేశాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బెంగళూరులో ఇటీవల జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను ప్రస్తావిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, జస్టిస్ భారతీ డాంగ్రేలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. హేతువాదులు గోవింద్ పన్సారే, నరేంద్ర దభోల్కర్ హత్య కేసుల దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరుగాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం విచారించింది. ఉదారవాద విలువలను ప్రోత్సహించే వారిపై దాడులు పెరుగుతున్నాయి. ఉదారవాద విధానాలను కోరుకునే వారే కాదు వాటిని నమ్మే వ్యక్తులు, సంస్థలు కూడా దాడులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఎవరైనా నన్ను వ్యతిరేకిస్తున్నారంటే.. వారిని అంతమొందించాలన్న ధోరణి నెలకొంది అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా ప్రశ్నించే వారందరినీ హతమార్చే ధోరణి ప్రమాదకరం. ఇది దేశానికి అపకీర్తిని తెస్తున్నది అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా సీబీఐ, మహారాష్ట్ర సీఐడీ విభాగాలు పన్సారే, దభోల్కర్ హత్యలపై దర్యాప్తు నివేదికలను కోర్టుకు సమర్పించాయి. ఈ కేసుల్లో అధికారులు ఇంతవరకూ ఎటువంటి నిర్దిష్ట ఫలితాలను సాధించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. మీ (దర్యాప్తు సంస్థల) ప్రయత్నాలు నిజమే కావచ్చు. కానీ ప్రధాన నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారన్నది వాస్తవం. ఈ కేసు వాయిదా పడిన ప్రతిసారి మరో విలువైన ప్రాణం పోతున్నది అని ఆవేదన వ్యక్తం చేసింది. గత నెలలో జరిగిన ఓ దురదృష్టకర సంఘటనలో మరో విలువైన ప్రాణం పోయింది. బెంగళూరులో ఓ ఉదారవాది, భావసారూప్యత గల వ్యక్తి హత్యకు గురయ్యారు అని న్యాయమూర్తులు గౌరీలంకేశ్ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు.

తమ నమ్మకాలు, విధానాల కారణంగా భవిష్యత్‌లో మరికొంతమంది హత్యకు గురి కాబోరన్న గ్యారంటీ ఏముంది? నిందితులు, సంస్థలు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నప్పుడు, దర్యాప్తు సంస్థలు దీనిని సవాల్‌గా తీసుకోవాలి అని బెంచ్ సూచించింది. దోషులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నందున దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తు పద్ధతులను మార్చుకుని వారిని పట్టుకొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. హత్యలకు పాల్పడుతున్న వారికి సంస్థాగతమైన మద్దతు ఉన్నదని, నిధులు అందుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారని, వారికి అందుబాటులో ఆయుధాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్టు 20న పుణెలో దభోల్కర్, 2015 ఫిబ్రవరి 16న కొల్హాపూర్‌లో పన్సారే హత్యకు గురయ్యారు.

273

More News

VIRAL NEWS