మన్మోహనుడు లేని రాజ్యసభ


Sun,June 16, 2019 02:37 AM

Parliament to miss former PM Manmohan Singh as his 30 year long Rajya Sabha term ends

- ముగిసిన మాజీ ప్రధాని పదవీ కాలం
- 28 ఏండ్లపాటు అసోం నుంచి ఎగువ సభకు ప్రాతినిధ్యం
- 10 ఏండ్లు ప్రధానిగా.. ఆరేండ్లు విపక్ష నేతగా మన్మోహన్


న్యూఢిల్లీ, జూన్ 15: రాజ్యసభ పదవీ కాలం శుక్రవారం ముగియడంతో మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను పార్లమెంట్ మిస్ కానున్నది. 1991లో తొలిసారి అసోం నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. నాటి నుంచి ఇప్పటివరకు ఆయన అసోం నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాడు సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన మన్మోహన్ సింగ్.. 2008 నాటి ఆర్థిక మాంద్యం ప్రభావం మనదేశంపై పడకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అసోంలో కాంగ్రెస్ పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే 43 మంది సభ్యుల మద్దతు కావాలి. అఖిలభారత యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు మద్దతునిచ్చినా ఆయన ఎన్నికయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం కంటే ఐదు సీట్లు తక్కువ. ప్రస్తుతం రాజ్యసభ సీట్లు ఖాళీ అయిన రాష్ర్టాల నుంచి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ ఎగువసభకు ఎన్నుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గుజరాత్ నుంచి మినహా రాజ్యసభకు సభ్యుడిని ఎన్నుకునే సంఖ్యా బలం లేదు. రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌ను రాజ్యసభకు పంపాలంటే ప్రస్తుత సభ్యుడితో రాజీనామా చేయించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రతిపాదనను కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలించడం లేదు. 28 ఏండ్ల పాటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్.. 2004-14 మధ్య పదేండ్లపాటు సభా నాయకుడిగా, ఆరేండ్ల పాటు విపక్ష నేతగా ఉన్నారు. కాగా, మరో మాజీ ప్రధాని దేవెగౌడ లేకుండానే పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో దేవెగౌడ ఓటమిపాలయ్యారు.

1110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles