విపక్షాల నిరసనతో పార్లమెంట్ వాయిదా


Thu,December 13, 2018 02:47 AM

Parliament adjourned following protest by Opposition

-రాఫెల్‌పై జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్
-కావేరీ సమస్యపై అన్నాడీఎంకే, డీఎంకే సభ్యుల నిరసన
-దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రస్ట్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: రాఫెల్ కుంభకోణం, రామమందిరం, కావేరీ జల వివాదంపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో బుధవారం ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే రెండోరోజు పార్లమెంట్ ఉభయసభలు గురువారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం తొలిరోజు పార్లమెంట్ ఉభయసభలు మాజీ ప్రధాని వాజపేయి, కేంద్రమంత్రి అనంతకుమార్ తదితరులకు నివాళులర్పించి వాయిదా పడిన సంగతి తెలిసిందే. బుధవారం నిరసనలతోనే ఉభయసభలు మొదలయ్యాయి. రాఫెల్‌పై సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తక్షణం అయోధ్యలో రామాలయం నిర్మించాలని శివసేన, కావేరి జలాల సమస్య పరిష్కరించాలని అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే ఆటిజం, పక్షవాతం, బుద్ది మాంద్యం, దివ్యాంగుల సంక్షేమం కోసం జాతీయ ట్రస్ట్ (సవరణ) బిల్లును రాజ్యపభ ఆమోదించింది. మరోవైపు విపక్ష పార్టీలు ఆందోళనకు దిగడంతో తొలుత మధ్యాహ్న భోజన విరామ సమయానికి లోక్‌సభ వాయిదా పడింది.

తిరిగి సభ ప్రారంభం కాగానే తమ డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్, శివసేన, ఏఐఏడీఎం సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజనవిరామ సమయానికి ముందే రెండుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ తిరిగి సమావేశం కాగానే కావేరీ డెల్టా రైతుల ప్రాణాలు కాపాడండి అంటూ రాసిన ప్లకార్డులతో ఏఐడీఎంకే సభ్యులు, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా నిరసనలను అనుమతించబోమన్నారు. ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయల్ స్పందిస్తూ.. ఆటిజం, పక్షవాతం, బుద్ధిమాంద్యం, దివ్యాంగుల సంక్షేమం కోసం జాతీయ ట్రస్ట్ (సవరణ) బిల్లును ఆమోదించాలని సభ్యులను కోరారు. బిల్లును ఆమోదించగానే సభ గురువారానికి వాయిదా పడింది.

485
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles