పాక్ మూల్యం చెల్లించక తప్పదు


Tue,February 13, 2018 02:25 AM

Pakistan Will Pay For This Misadventure Defence Minister Nirmala Sitharaman On Jammu Attack

-దుస్సాహసానికి తగిన గుణపాఠం చెబుతాం
-కార్యాచరణకు సిద్ధమవుతున్న భారత్
-పాక్ నుంచే జైషే ఉగ్రవాదులకు ఆదేశాలందినట్లు ఆధారాలున్నాయి
-రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
-సుంజ్వాన్‌లో ఏరియల్ సర్వే
-దవాఖానలో బాధితులకు పరామర్శ

Nirmala
శ్రీనగర్, ఫిబ్రవరి 12:జమ్ముకశ్మీర్‌లోని సుంజ్వాన్ ఆర్మీక్యాంప్‌పై ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ దుస్సాహసానికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటివచ్చినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, పాకిస్థానే అందుకు బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. అయితే తమ సరిహద్దులు దాటి లక్షితదాడులు జరిపేందుకు భారత్ సాహసించవద్దని పాక్ హెచ్చరించింది. మరోవైపు యుద్ధం పరిష్కారం కాదని, రక్తపాతాన్ని నివారించేందుకు భారత్-పాక్ చర్చలు జరుపాలని జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ సూచించారు. ఉగ్రవాదులు దాడిచేసిన సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ ప్రాంతంలో రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మల.. పాక్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పాక్‌లో నివసిస్తున్న మసూద్ అజహర్ ప్రోద్బలంతో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సరిహద్దుకు ఆవల నుంచే వారికి ఆదేశాలిచ్చి నడిపించారు. ఆర్మీక్యాంప్, కుటుంబాలు రెండూ ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయాలని మసూద్ అజార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకే సుంజ్వాన్ క్యాంప్‌ను వారు లక్ష్యంగా చేసుకున్నారు. స్థానికుల మద్దతు కూడా ఉగ్రవాదులకు లభించి ఉండొచ్చు అని ఆమె తెలిపారు. చొరబాట్లను ప్రోత్సహించేందుకే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని విమర్శించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతుందని, ఆ దిశగా ఓ కార్యచరణకు సిద్ధమవుతున్నదని ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఉగ్రవాదుల చర్యల వెనుక పాక్ హస్తమున్నట్లు నిరూపితమైంది. సుంజ్వాన్ దాడికి సంబంధించి కూడా పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ దుస్సాహసానికి సిద్ధమైన పాక్ తగిన మూల్యం చెల్లించేలా చేస్తాం అని సీతారామన్ చెప్పారు. అనంతరం మిలిటరీ దవాఖానకు వెళ్లిన నిర్మల ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు.

లక్షిత దాడులకు సాహసించవద్దు.. పాక్ హెచ్చరిక


సుంజ్వాన్‌పై ఉగ్రదాడి నెపాన్ని అడ్డం పెట్టుకొని భారత్ మరోసారి సరిహద్దు దాటి వచ్చి లక్షిత దాడులు జరిపేందుకు సాహసించవద్దని పాకిస్థాన్ హెచ్చరించింది. సుంజ్వాన్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడికి పాల్పడింది పాక్‌కు చెందిన జైషే ఉగ్రవాదులేనని భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాక్ ఈ హెచ్చరిక చేసింది.

రక్తపాతాన్ని ఆపేందుకు పాక్‌తో చర్చలు జరుపాలి: సీఎం


భారత్, పాకిస్థాన్ మధ్య మూడు యుద్ధాలు జరిగాయని అయినా కశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. సోమవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడుతూ, మనం పాకిస్థాన్‌తో 1947, 1965, 1971లో మూడు యుద్ధాలు చేశాం. కార్గిల్ యుద్ధంతో సహా అన్నీ మనమే గెలిచాం. కానీ ప్రాథమిక సమస్య మాత్రం పరిష్కారం కాలేదు అన్నారు. జమ్ముకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు వెంటనే భారత్, పాక్ మధ్య చర్చలు జరుగాలని ఆమె సూచించారు.
SOG-Kashmir

కారుబాంబు దాడికి ఉగ్రవాదుల కుట్ర!


శ్రీనగర్: జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో భారీ స్థాయిలో దాడి జరిపేందుకు వ్యూహం రచిస్తున్నట్టు భద్రతా సంస్థలకు సమాచారం అందింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఫిదాయీ (ఆత్మాహుతి) దాడి చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నుతున్నట్టు వారి ఫోన్ సంభాషణల ద్వారా భద్రతా సంస్థలు గ్రహించాయి. తాజా సమాచారం ప్రకారం పైరెండు ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిదీన్‌తో కలిసి కశ్మీర్ లోయలో కళ్లు చెదిరేలా కారు లేదా వాహన బాంబు దాడి జరుపాలని ప్రణాళిక వేస్తున్నట్టు తెలిసింది. జైషే మొహమ్మద్ సంస్థ 2001లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీపై జరిపిన కారుబాంబు దాడిలో 40 మంది పౌరులు, ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులు మరోసారి అసెంబ్లీ లేదా అధికారులు నివసించే ప్రాంతా లు లేదా సైనిక స్థావరం, హోటల్‌పై దాడి చేయవచ్చని భావిస్తున్నారు. ఇక దాడికి కావాల్సిన బాంబు తయారీకి లష్కరే తాయిబా కమాండర్ నవీద్ జట్ కృషి చేస్తున్నట్టు తెలిసింది. ఉగ్రవాదులు ఈ నెల 8న ఇద్దరు పోలీసులను హతమార్చి దవాఖాన నుంచి నవీద్ జట్‌ను తప్పించిన సంగతి తెలిసిందే.

సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడికి విఫలయత్నం జవాన్ మృతి


ఉగ్రవాదులు సోమవారం సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడికి ప్రయత్నించారు. వారి యత్నాన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అనంతరం ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని కరణ్‌నగర్ సీఆర్పీఎఫ్ శిబిరం వద్ద చోటుచేసుకున్నది. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు సాయుధులు క్యాంప్ వైపు వస్తుండటంతో అప్రమత్తమైన జవాన్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయి.. సమీపంలోని ఓ పాడుబడిన ఇంట్లో దాక్కున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఇరువర్గాల మధ్య ఎదుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగడంతో బీహార్‌కు చెందిన ముజాహిద్‌ఖాన్ అనే జవాను చనిపోయారు.

1237
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles