మృత్యువు నీడలో జీవనం


Sun,September 24, 2017 02:53 AM

Pakistan violates ceasefire again in J&Ks RS Pura and Arniya sector

- పాక్ కాల్పులతో ఊళ్లు ఖాళీ
- సరిహద్దు గ్రామాల్లో దుర్భర పరిస్థితులు
- సురక్షిత ప్రాంతాలకు వలస పోతున్న ప్రజలు

shelling
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రాత్రీపగలు అనే తేడా లేకుండా బాంబులు వచ్చిపడుతుంటే ఆ గ్రామస్థులకు విసుగు వచ్చింది. ఇంక మావల్ల కాదంటూ ఊరు ఖాళీ చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల్లోని అర్నియా అనే పల్లె కథ ఇది. సరిహద్దు గ్రామం అన్న తర్వాత ఎంతో కొంత ఉద్రిక్తత మామూలే. కానీ ఎడతెరిపిలేకుండా కాల్పులు జరుపుతూ శతఘ్ని గుండ్లను పేలుస్తుంటే ఎలా? ఇంట్లో ఓ మూల టేబుళ్లు, కుర్చీలు అడ్డం పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపడం అంటే కష్టమే మరి. ఎడతెరిపి లేకుండా దాడులు జరుగుతున్నా ఇక్కడే ఉండిపోదామనుకున్నాం. కానీ గురువారం రాత్రి పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది. రెండు శతఘ్ని గుండ్లు మా ఇంటి మీదకు వచ్చిపడ్డాయి. ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. ఓ గేదె చనిపోయింది అని అనితాకుమార్ చెప్పారు. ఏడురోజులుగా పాక్ జరుపుతున్న కాల్పులతో ఊరివారి సహనం నశించిపోయింది. ఒకప్పుడు కళకళలాడిన అర్నియా ఇప్పుడు మానవ సంచారం లేక బోసిపోయింది. మేం ఊరు ఖాళీ చేయకపోతే పాకిస్థానీ శతఘ్ని గుండ్లు మా ప్రాణాలు తీయడం ఖాయం అని ప్రీతమ్‌చంద్ అనే గ్రామస్థుడు వాపోయారు.

20 గ్రామాల్లో ఇదే పరిస్థితి

ఇది కేవలం అర్నియా కథే కాదు. పాక్ సరిహద్దుల్లోని సుమారు 20 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలు వెదుక్కుంటూ పోవడంతో ఊళ్లన్నీ నిర్జనంగా మారిపోయాయి. గతవారం ఇద్దరు మరణించగా 19 మంది గాయపడ్డారు. సుమారు పదివేల మంది ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని స్థానిక పోలీసు అధికారి సురిందర్ చౌదరి చెప్పారు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు పగటిపూట పశువులకు దాణా వేసేందుకు ఊళ్లకు తిరిగి వస్తారు. నెత్తుటిమడుగులో పడిఉన్న పశువులు, అద్దాలు పగిలిన కిటికీలు, గోడలు, పైకప్పులు కూలిన ఇండ్లు వారికి దర్శనమిస్తుంటాయి. ఎటుచూసినా తూటాల గుర్తులే. శతఘ్ని గుండ్ల శకలాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి.

బంకర్లు నిర్మించి ఇవ్వండి

మేమంతా మృత్యువు నీడలో బతుకుతుంటాం. మా పశువులకు గాయాలవుతాయి. చనిపోతాయి. మా ఇండ్లు, పశువుల కొట్టాలు దెబ్బతింటాయి. ఇండ్లు వదిలి పారిపోవాల్సిన దుస్థితి పట్టింది మాకు. మా పిల్లల చదువు సాగడం లేదు. ఇదేనా జీవితమంటే? అని జబోవాల్ గ్రామస్థుడు షంషేర్‌సింగ్ ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో కూర్చుని పాకిస్థాన్‌కు మేం గట్టిగా జవాబు చెప్తాం అని మన మంత్రులు ప్రకటనలు చేసిన ప్రతిసారీ మామీద మరిన్ని ఎక్కువ దాడులు జరుగుతుంటాయి అని ఆయన పేర్కొన్నారు. వారు చేయాల్సింది ప్రకటనలు కాదు.. మాకు సురక్షిత బంకర్లు నిర్మించడంఅని సింగ్ అన్నారు. పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. గత ఆగస్టు నెలలో 285 కాల్పుల ఘటనలు జరిగాయి. ఈ దుర్భర పరిస్థితులు ఇంకెన్నాళ్లు? అని సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Shelling-F

తాజా ఘటనలో ఏడుగురికి గాయాలు

జమ్ము, సెప్టెంబర్ 23: పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు దిగింది. భారత సైనిక స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి కాల్పులు జరుపడంతో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ఎనిమిదేండ్ల బాలునితో సహా ఐదుగురు పౌరులు గాయపడ్డారు. దాదాపు 500 మంది గ్రామస్థులను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్ము, సాంబా, పూంఛ్ జిల్లాల్లో 20కి పైగా గ్రామాల్లో ఈ ఘటనలు జరిగాయని, గాయపడిన వారిని దవాఖానలకు తరలించామని అధికారులు తెలిపారు.

215

More News

VIRAL NEWS