పీవోకేను భారత్‌కు అప్పగించాల్సిందే


Sat,September 14, 2019 02:46 AM

Pakistan Should Hand over PoK to India Says Union Minister Ramdas Athawale

- అదే మీకు మంచిది
- పాకిస్థాన్‌కు కేంద్ర మంత్రి రాందాస్ అథావలె హెచ్చరిక
- పీవోకేను ఇస్తే.. పాక్‌లో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమికొట్టడానికి సాయం చేస్తామని వ్యాఖ్య


చండీగఢ్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌కు అప్పగించాలని, అదే మీకు మంచిదని పాకిస్థాన్‌ను కేంద్ర సామాజిక న్యాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) అధినేత రాందాస్ అథావలె హెచ్చరించారు. పీఓకేలో నివసిస్తున్న ప్రజలు సంతోషంగా లేరని, భారత్‌లో కలవడానికి వాళ్లు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. తన మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకాలను సమీక్షించడానికి చండీగఢ్‌లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ సమర్థవంతమైన ప్రధాని. ఆర్టికల్ 370ను రద్దుచేసి ఆయన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే, ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామని విఫల ప్రయత్నాలు చేస్తున్నది అని అన్నారు.

పాకిస్థాన్ ఇప్పుడు పీఓకేను భారత్‌కు అప్పగించాలి. అదే ఆ దేశానికి కూడా మంచిది అని అథావలె పేర్కొన్నారు. ఒకవేళ పీఓకేను వాళ్లు మనకు అప్పగిస్తే, అక్కడ పలు పరిశ్రమలను స్థాపిస్తాం. అలాగే, పాక్‌లో నెలకొన్న పేదరికం, నిరుద్యోగాన్ని తరిమికొట్టడానికి సాయపడతాం. ఆ దేశంతో వర్తక వాణిజ్యాల్ని పెంపొందిస్తాం అని అన్నారు. యుద్ధం తదితర బెదిరింపులకు పాక్ దిగకపోవడమే మంచిదని ఆయన హితవు పలికారు. మన సైన్యం ఎంతో శక్తిమంతమైనది. కార్గిల్ వంటి యుద్ధాల్లో మనం వాళ్లను ఓడించాం అని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత కశ్మీర్ లోయలో శాంతి నెలకొన్నదని ఆయన తెలిపారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు నిర్ణయం కారణంగా అక్కడ కేంద్ర పథకాలు, చట్టాలు అమలవుతాయని.. అభివృద్ధి పరిఢవిల్లుతుందని చెప్పారు.

214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles